బుధవారం 08 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 23, 2020 , 03:26:43

నూతనకల్‌ టు నేపాల్‌

నూతనకల్‌ టు నేపాల్‌

అతను సినిమా స్టార్‌ కాదు. పేరొందిన క్రీడాకారుడు కూడా కాదు. జన బలం కలిగిన రాజకీయ నాయకుడు అంతకన్నా కాదు. అయినా సరే ఫలానా చోటుకు ‘నేనొస్తున్నా’నంటూ ఒక చిన్న మెసేజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే చాలు.. ఎంత చిన్న పట్టణమైనా సరే వందల సంఖ్యలో అభిమా నులు గుమి గూడుతున్నారు. అతడితో సెల్ఫీల కోసం పోటీ పడుతున్నారు. బైక్‌ రైడర్‌గా రెండేళ్ల లోనే యూట్యూబ్‌లో లక్షల మంది సబ్‌స్ర్కైబర్లతో పాటు.. రెండు తెలుగు రాష్ర్టాల్లో వేలాది మంది అభిమానులను సైతం సంపాదించుకున్నాడు. ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో ఎక్కువ మంది మోటో వ్లాగర్స్‌ బైక్‌ రైడింగ్స్‌ చేస్తుండగా.. పూర్తిగా తెలుగులోనే తన రైడింగ్‌ గురించి వివరిస్తూ ఇప్పటికే నేపాల్‌తోపాటు లడఖ్‌ ట్రిప్‌ సైతం పూర్తి చేసిన ఘనత మన ఉమ్మడి జిల్లాకే చెందిన బయ్య సన్నీ యాదవ్‌ సొంతం. మోటార్‌ సైకిల్‌పై లాంగ్‌ జర్నీ చేస్తూ.. ఆ టూర్‌ను వివరించడంతోపాటు జర్నీ మొత్తం తెలుగులో వ్లాగ్‌ చేయడం సన్నీ ప్రత్యేకత కాగా.. బైక్‌ పైనే లండన్‌ వెళ్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. తన ప్రతీ రైడ్‌లో ఒక సందేశం ఇస్తూ ప్రయాణం సాగిస్తున్నాడు.

  • మోటార్‌ సైకిల్‌పై వేలాది కిలోమీటర్ల ప్రయాణాలు
  • బైక్‌పై లడఖ్‌, నేపాల్‌ సహా పదుల సంఖ్యలో ట్రిప్‌లు
  • జిల్లా వాసికి యూట్యూబ్‌లో లక్షల మంది ఫాలోవర్లు
  • రెండేళ్లలోనే స్టార్‌గా తెలుగు బైక్‌ రైడర్‌ బయ్య సన్నీ యాదవ్‌
  • బైక్‌పై లండన్‌ వరకు వెళ్లడమే లక్ష్యంగా ప్రణాళికలు

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : బయ్య సన్నీ యాదవ్‌.. యూట్యూబ్‌ చూసే వాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండల కేంద్రం సన్నీ స్వస్థలం. తల్లిదండ్రులు బయ్య శ్రీదేవి, రవీందర్‌ దంపతుల తొలి సంతానం అయిన సన్నీ అసలు పేరు సందీప్‌ యాదవ్‌. కబడ్డీ ప్లేయర్‌ అయిన సన్నీ తమ్ముడు కల్యాణ్‌ ప్రస్తుతం ప్రో కబడ్డీకి ఎంపికయ్యాడు. 8వ తరగతి నుంచే బైక్‌ డ్రైవింగ్‌ చేయడం నేర్చుకున్న సన్నీకి.. లాంగ్‌ రైడ్‌ వెళ్లాలనే ఆకాంక్ష అప్పటి నుంచే మొదలైంది. 2012లో పదో తరగతి పూర్తి చేసిన తర్వాత డిప్లోమాలో చేరినా విజయవంతంగా పూర్తి చేయలేకపోయాడు. 


ఆ తర్వాత ఓపెన్‌ డిగ్రీ పూర్తి చేశాడు. తల్లిదండ్రుల సహకారంతో 2013లో పల్సర్‌ 220సీసీ బైక్‌ను కొన్న సన్నీ.. అప్పటి నుంచే రైడింగ్‌ చేయడం ప్రారంభించాడు. తల్లిదండ్రులు నిర్వహించే మెడికల్‌ షాపులో చేదోడు వాదోడుగా ఉంటూ.. చదువుతోపాటు వాలీబాల్‌ ఆటను సైతం ఇష్టంగా ఆడటం మొదలుపెట్టాడు. తండ్రి రవీందర్‌ ప్రొఫెషనల్‌ వాలీబాల్‌ ప్లేయిర్‌ కావడంతో.. తన పిల్లలను సైతం చదువు అనే కోణంలోనే కాకుండా క్రీడల్లోనూ ప్రోత్సహిస్తూ వచ్చారు. సన్నీ 2016లో కేటీఎమ్‌ ఆర్సీ200బైక్‌ కొనుగోలు చేసిన తర్వాత లాంగ్‌ రైడ్స్‌ వెళ్లడం స్టార్ట్‌ చేశాడు. తనకు ఇష్టమైన మెటో వ్లాగింగ్‌ కోసం యూట్యూబ్‌లో వెతికితే.. తెలుగులో ఎవరూ చేయడం లేదని గుర్తించి తానే మొదలుపెట్టాలని నిర్ణయించాడు. 2017లో బయ్య సన్నీ యాదవ్‌ అనే తన పేరుతోనే యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభించాడు. 


16రోజులు నేపాల్‌ టూర్‌.. 

లడఖ్‌ వెళ్లి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఫాలోవర్స్‌ పెరగడంతోపాటు.. ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేక కార్యక్రమాలు సైతం చేయాల్సి వచ్చింది. రెండు తెలుగు రాష్ర్టాల్లోని అనేక జిల్లా కేంద్రాలు, చిన్న చిన్న పట్టణాల్లోనూ ఫ్యాన్స్‌ మీట్‌ నిర్వహించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియాలోని తన ఖాతాలో మెసేజ్‌ చేయడం ద్వారానే ప్రతీ మీట్‌ అప్‌కూ కనీసం 200మంది అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి సన్నీ కోసం ఎదురు చూస్తున్నారు. సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ స్పోర్ట్స్‌ బైక్‌ షోరూమ్‌ నిర్వాహకులు సైతం బయ్య సన్నీ యాదవ్‌తో తమ కొత్త మోడల్‌ బైక్‌ను ఇండియాలో లాంచ్‌ చేయించారు. 


అనారోగ్యానికి గురైన తమ కుమారుడి కోసం ఒక్కసారి తన ఇంటికి రావాలని గుంటూరులోని ఓ ప్రముఖ డాక్టర్‌ సన్నీని పిలిచి మరీ తన కొడుకు ముచ్చట తీర్చాడంటే సన్నీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అర్థం చేసుకోవచ్చు. లడఖ్‌ ట్రిప్‌ తర్వాత మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్‌ ట్రిప్‌లే కాకుండా ఇటీవలే నేపాల్‌ ట్రిప్‌ కూడా వెళ్లొచ్చాడు. 16రోజులపాటు సుమారు 8వేల కిలోమీటర్ల ప్రయాణం సాగించాడు. లండన్‌ వరకు బైక్‌పై వెళ్లే టూర్‌ టార్గెట్‌గా భవిష్యత్తు ప్రణాళికలతో సన్నీ ముందుకు సాగుతున్నాడు. ఆసక్తితోపాటు శ్రమించే గుణం ఉంటే విజయం మన వెంటే ఉంటుందని.. రైడింగ్‌ మాత్రమే కాదు కెమెరా షూటింగ్‌, వీడియో ఎడిటింగ్‌ సహా అన్ని పనులూ తానే చేసుకుంటూ స్టార్‌గా ఎదిగిన సన్నీ యాదవ్‌ సక్సెస్‌ జర్నీ చాటి చెప్తోంది. 


తెలుగులో తొలి మోటో వ్లాగర్‌గా జర్నీ..

మొదట్లో తన యూట్యూబ్‌ చానెళ్లో చుట్టు పక్కల గ్రామాల్లో తాను తీసిన కబడ్డీ, వాలీబాల్‌ టోర్నమెంట్లు, ఇతర వీడియోలు పోస్ట్‌ చేసే వాడు. వాటికి పెద్దగా రెస్పాన్స్‌ రాలేదు. తాను రైడింగ్‌కు వెళ్తున్నందున వాటిని కూడా పోస్ట్‌ చేయాలనే ఆలోచనతో.. 2018 డిసెంబర్‌లో తాను వెళ్లిన విశాఖపట్నం టూర్‌ వీడియోలతో రైడర్‌గా యూట్యూబ్‌ ప్రయాణం ప్రారంభించాడు. తొలి ట్రిప్‌లోనే 1400కిలోమీటర్లు ప్రయాణం చేసిన సన్నీ.. జర్నీ వివరాలతోపాటు మధ్య మధ్యలో తనకు కనిపించే ప్రతి సన్నివేశాన్నీ వివరిస్తూ వచ్చాడు. సొంతంగానే వీడియో షూటింగ్‌తోపాటు ఎడిటింగ్‌ నేర్చుకోవడమే కాకుండా.. అన్ని పనులు తానే చేసుకుంటూ ఇప్పటి వరకు పదికి పైగా టూర్లు పూర్తి చేశాడు. 2018లోనే కేటీఎమ్‌ డ్యూక్‌ 390 బైక్‌ కొనుగోలు చేసిన సన్నీ.. వైజాగ్‌ తర్వాత 1200కిలో మీటర్లతో తిరుపతి టూర్‌.. జనవరి 2019లో శ్రీశైలం-మహానంది-గండి కోటకు 1200 కిలోమీటర్లు.. కర్ణాటకలో ని హంపి టూర్‌.. ఆ తర్వాత మూడు వేల కిలోమీటర్లతో దక్షిణ భారత దేశంలోని నందిహిల్స్‌-మైసూర్‌-ఊటీ- కొచ్చి- కన్యా కుమారి- మధురై- పుదుచ్చే రి టూర్‌ పూర్తి చేశాడు. గోవా, లక్నవ రం, సూర్య లంక, మహారాష్ట్రలోని లోనావాలా ఇలా మోటార్‌ సైకిల్‌ పైనే సన్నీ చుట్టి వచ్చిన రైడ్లు చాలా ఉన్నాయి. 


లడఖ్‌ ట్రిప్‌తో లక్షకు పైగా సబ్‌స్ర్కైబర్లు.. 

బైక్‌ రైడింగ్స్‌ చేస్తూ.. వాటిని భాగాలుగా చేసి వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ వస్తున్న సన్నీకి క్రమంగా యూట్యూబ్‌లో ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రారంభంలో తల్లిదండ్రుల సహకారంతో టూర్లకు డబ్బులు సమకూర్చు కున్నా.. ఆ తర్వాత యూట్యూబ్‌ ద్వారా వచ్చే ఆదాయంతోపాటు స్పాన్సర్ల సహకారంతో ప్రయాణాలు పూర్తి చేస్తున్నాడు. 2019 జూన్‌లో నూతనకల్‌ నుంచి హిమాలయాల్లో ఉన్న లడఖ్‌ టూర్‌కు వెళ్లాడు. 22రోజులపాటు మొత్తం 7500కిలోమీటర్ల ప్రయాణం చేసిన సన్నీ.. ఎన్నో సాహసాలు, ఎన్నో ప్రమాదకర ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఆర్మీ క్యాంపులో బస చేయడం తో పాటు.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అప్పటికి 50వేలు మాత్రమే ఉన్న సంఖ్య.. లడఖ్‌ టూర్‌తో బైక్‌ రైడర్‌గా సన్నీ యూట్యూబ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య లక్షన్నరకు పెరిగింది. అప్పటి నుంచి ఇక వెనుతిరిగి చూసు కోకుండా ప్రతి నెలా వెయ్యికి పైగా సబ్‌ స్ర్కైబర్లు పెరుగుతూనే ఉన్నారు. నూతనకల్‌ నుంచి మొదలు పెట్టిన ప్రయాణం సూర్యాపేట-హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ -ఆగ్రా-ఢిల్లీ-అమృత్‌ సర్‌- సోన్‌మార్గ్‌- అనంతనాగ్‌ జమ్మూకాశ్మీర్‌)-శ్రీనగర్‌-కార్గిల్‌- లేహ్‌-మనాలి- చండీగడ్‌-ఢిల్లీ మీదుగా సాగింది. 


చాలా గర్వంగా ఉంది..

మేమెన్నడూ ఇది చేయి.. ఇది చేయకు అని మా పిల్లలకు చెప్పలేదు. సన్నీని కూడా నీకు ఇష్టమైన ప్రొఫెషన్‌ ఎంచుకొని అందులోనే పని చేయమని చెప్పాము. వాడికి చిన్నప్పటి నుంచి బైక్‌ రైడింగ్‌ ఇష్టం. అందులోనే ఇప్పుడు ఎంతో గుర్తింపు సాధించాడు. మాకు చాలా సంతోషంగా.. గర్వంగా కూడా ఉంది. చిన్నోడు కల్యాణ్‌ మంచి కబడ్డీ ప్లేయర్‌. తను ప్రో కబడ్డీకి ఎంపికయ్యాడు. సన్నీ, కల్యాణ్‌, నేను(తండ్రి) మంచి వాలీబాల్‌ ప్లేయర్లం. కలిసి టోర్నమెంట్లు కూడా గెలిచాం.  


లండన్‌ ట్రిప్‌ నా డ్రీమ్‌ రైడ్‌..

ఆసక్తితోపాటు గుర్తింపు కోసమూ బైక్‌ రైడింగ్‌ ప్రారంభించాను. ముంబై కర్నికల్‌ పేరుతో రైడింగ్స్‌ చేసే నిఖిల్‌ శర్మను చూసి ఆయన తరహాలో రైడింగ్‌ వ్లాగ్స్‌ చేయాలని అనుకున్నాను. తెలుగులో ఎవరూ మోటో వ్లాగ్‌ చేయడం లేదని తెలుసుకొని నేనే చేయాలని స్టార్ట్‌ చేశాను. స్టార్టింగ్‌లో పెద్దగా వ్యూస్‌ రాలేదు. లడఖ్‌ రైడ్‌తో ఒక్కసారిగా సబ్‌ స్ర్కైబర్స్‌ పెరిగారు. యూట్యూబ్‌, బైక్‌ రైడింగ్‌ ఇప్పుడు నాకు కెరీర్‌గా మారాయి. మా అమ్మానాన్నలు, మిత్రులు, ఫాలోవర్స్‌ సహకారంతో ప్రతీక్షణం ఆస్వాదిస్తూ రైడ్స్‌ చేస్తున్నాను. బైక్‌పై లండన్‌ వెళ్లడం నా డ్రీమ్‌ రైడ్‌.

- బయ్య సన్నీ యాదవ్‌ 


- రవీందర్‌, శ్రీదేవి, బయ్య సన్నీ యాదవ్‌ తల్లిదండ్రులు


logo