సోమవారం 06 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 22, 2020 , 04:37:38

ఇంటర్‌ పరీక్షలకు సిద్ధం

ఇంటర్‌ పరీక్షలకు సిద్ధం

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రాక్టికల్‌ పరీక్షలు గురువారంతో ముగియగా.. మార్చి 4 నుంచి 20 వరకు ఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగనుండగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 37,539 మంది హాజరు కానున్నారు.

  • మార్చి 4నుంచి
  • వార్షిక పరీక్షలు
  • నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
  • పరీక్ష కేంద్రాల వద్ద జీపీఎస్‌తో ప్రత్యేక నిఘా
  • హాజరు కానున్న 37,539 మంది విద్యార్థులు
  • జిల్లాలో 46 పరీక్ష కేంద్రాలు

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రాక్టికల్‌ పరీక్షలు గురువారంతో ముగియగా.. మార్చి 4 నుంచి 20 వరకు ఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగనుండగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం  విద్యార్థులు 37,539 మంది హాజరు కానున్నారు. వీరికోసం జిల్లా వ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయానికంటే నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. ప్రతి పరీక్ష కేంద్రంపై జీపీఎస్‌తో నిఘా ఏర్పాటు చేయనుండగా.. సీసీ కెమెరాల ఎదుటనే ప్రశ్న పత్రాలను పోలీసుల సమక్షంలో తెరవాల్సి ఉంటుంది. మరో వైపు పరీక్ష కేంద్రాల తనిఖీకి సీనియర్‌ అధ్యాపకులతో ఫ్లైయింగ్‌, సిట్టింగ్‌ స్క్యాడ్‌ బృందాలను ఇంటర్‌ విద్యా శాఖ నియమించింది. 

నల్లగొండ విద్యావిభాగం : జిల్లాలో 101 ఇంటర్మీడియట్‌ కళాశాలలు ఉన్నాయి. మార్చి 4నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి పరీక్ష కేంద్రానికి చీఫ్‌ సూపరింటెండెం ట్‌, డిపార్టుమెంటల్‌ అధికారులను నియమించా రు. అదేవిధంగా కస్టోడియన్స్‌, 2 ఫ్లయింగ్‌, ప్రతీ పరీక్ష కేంద్రాన్ని సందర్శించేలా సిట్టింగ్‌ స్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. వీరితోపాటు డీఐఈవో, జిల్లా పరీక్షల విభాగం, హైపవర్‌ కమిటీ అధికారులు సైతం ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. పరీక్ష రోజున అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉండనుంది. 


హాజరుకానున్న 37,539మంది విద్యార్థులు..

ఇంటర్మీడియట్‌ పరీక్షలకు జిల్లా నుంచి 37,539 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరంలో రెగ్యులర్‌ విభాగంలో 13,911 మంది, ఒకేషనల్‌ విభాగంలో 2,929 మంది మొత్తం 16,840మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అదే విధంగా ద్వితీయ సంవత్సరం రెగ్యులర్‌ విభాగంలో 17,832 మంది, ఒకేషనల్‌ విభాగంలో 2867 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 


నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు..

ప్రతి రోజు పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే నిర్ణీత సమయానికంటే ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులంతా ఆయా పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత తిరిగి ముగిసే వరకు బయటకు అనుమతించరు. పరీక్ష ప్యాడ్‌, హాల్‌టికెట్‌ , పెన్నులు మినహా ఇతర వస్తువులను పరీక్ష హాళ్లోకి అనుమతించరు. 


పరీక్ష కేంద్రాలు ఇలా...

జిల్లాలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు 46పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. (12 ప్రభుత్వ కళాశాలలు, మూడు మోడల్‌ స్కూళ్లు, మూడు రెసిడెన్షియల్‌ కళాశాలలు, 28 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి) నల్లగొండలో 18, నకిరేకల్‌లో 4, కట్టంగూర్‌లో 1, మిర్యాలగూడలో 8, చండూరులో1, మర్రిగూడలో 3, కొండమల్లేపల్లి1, దామరచర్ల 1, దేవరకొండ 3, సాగర్‌1, హాలియా1, చింతపల్లి1, నాంపల్లి1, డిండి 1 చొప్పున ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. 


జీపీఎస్‌ నిఘా...

పరీక్షల్లో అక్రమాలు, మాస్‌ కాపియింగ్‌కు చెక్‌ పెట్టేలా ఈ సారి పరీక్ష కేంద్రాలను జీపీఎస్‌తో అనుసంధానం చేయనున్నట్లు సమాచారం. పరీక్ష జరిగే సమయంతో పాటు పేపర్స్‌ను ప్యాకింగ్‌ చేసే వరకు ఆ కేంద్రంపై ప్రత్యేక నిఘా ఉంటుంది. పరీక్ష కేంద్రంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌ తప్ప ఎవ్వరూ సెల్‌ఫోన్లు ఉపయోగించరాదు. పరీక్ష కేంద్రంలో ఎవరైనా సెల్‌ఫోన్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తులు వినియోగిస్తే జీపీఎస్‌ సాయంతో అధికారులకు తెలుస్తుంది. అలా జరిగితే ఆ పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌తో పాటు డిపార్టుమెంటల్‌ అధికారి, ఇతరులపై కఠిన చర్యలు తీసుకునేలా ఇంటర్మీడియట్‌ బోర్డు నిబంధనను అమలు చేస్తుంది. 


సీసీ కెమెరాల వద్దే ప్రశ్నపత్రం ఓపెన్‌...

పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల వద్దనే ప్రశ్నపత్రాన్ని ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. పరీక్షలో విద్యార్థులను జంబ్లింగ్‌ విధానంలో హాల్‌ టికెట్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. జంబ్లింగ్‌ విధానంలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇన్విజిలేటర్ల తీరుపై సైతం ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించగానే వారి వద్ద సెల్‌ఫోన్లను చీఫ్‌ సూపరింటెండెంట్‌కు అప్పగించి పరీక్ష ముగిసిన తర్వాత తీసుకోవాలి. కాపియింగ్‌కు పాల్పడినా ప్రోత్సహించినా అదికారులు చర్యలు తీసుకుంటారు. 


పరీక్షలకు సర్వం సిద్ధం..

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షల కోసం 46 కేంద్రాలను ఏర్పాటు చేశాం.  కాపియింగ్‌కు అవకాశం లేకుండా ప్రతి పరీక్ష కేంద్రం జీపీఎస్‌ నిఘాలో ఉంటుంది. పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్కాడ్‌ బృందాలను నియమిం చాం. అంతేగాకుండా జిల్లా ఇంటర్డీడియట్‌ విద్యా శాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నాం. 

-భానునాయక్‌, డీఐఈఓ, నల్లగొండ 


logo