బుధవారం 01 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 21, 2020 , 05:55:04

డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలకు రంగం సిద్ధం

డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలకు రంగం సిద్ధం

సహకార సంఘాల చైర్మన్‌ ఎన్నికలు పూర్తికావడంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర సహకార సంఘం ప్రకటన మేరకు ఈ నెల 22న జిల్లా అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.

  • రేపు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న జిల్లా ఎన్నికల అధికారి
  • 25న నామినేషన్ల స్వీకరణ
  • 28న ఎన్నికలు.. సాయంత్రం ఫలితాలు
  • 29న ఇరు సంఘాల చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక

నల్లగొండ, నమస్తే తెలంగాణ : సహకార సంఘాల చైర్మన్‌ ఎన్నికలు పూర్తికావడంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర సహకార సంఘం ప్రకటన మేరకు ఈ నెల 22న జిల్లా అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. 25న నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ అనంతరం 28న ఇరు సంఘాల్లో డైరెక్టర్ల ఎన్నిక జరుగనుంది. తుది విడతగా ఈ నెల 29న డీసీఎంఎస్‌, డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరుగనుంది. ఇరు సంఘాల పరిధిలోని ప్రగతిలో ఉన్న సంఘాలను పరిగణలోకి తీసుకుని పీఏసీఎస్‌ చైర్మన్లతో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు సహకార యంత్రాంగం సిద్ధమైంది.

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా కేంద్ర మార్కెటింగ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) డైరెక్టర్లతో పాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల నియామకానికి రాష్ట్ర సహకార ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 22న నోటిఫికేషన్‌, 25న ఉదయం 8నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నోటిఫికేషన్‌ స్వీకరించి స్క్రూటినీ చేయనున్నారు. అనంతరం మూడున్నర గంటల నుంచి 5గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. 28న ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం వరకు కౌంటింగ్‌ చేపట్టి పలితాలు ప్రకటించనున్నారు. 


పీఏసీఎస్‌ చైర్మన్లతో పాటు ఇతర సహకార సంఘాలకు ఓటు...

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో 110ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఆయా పీఏసీఎస్‌ చైర్మన్లతో పాటు ప్రగతిలో ఉన్నటువంటి సహకార సంఘాలు (చేనేత, మత్స్య, గొర్రెల, గీత) డైరెక్టర్ల ఎన్నికలో భాగస్వామ్యం కావడంతో పాటు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డీసీఎంఎస్‌ ఎన్నికల్లో 110పీఏసీఎస్‌ చైర్మన్లతో పాటు నాలుగు ఇతర సహకార సంఘాలకు సంబంధించిన చైర్మన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా డీసీసీబీ పరిధిలో 110పీఏసీఎస్‌ చైర్మన్లతో పాటు 29 ఇతర సహకార సంఘాలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 29న జరిగేటువంటి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో డీసీసీబీకి నల్లగొండ జిల్లా సహకార అధికారి శ్రీనివాసమూర్తి ఎన్నికల అధికారిగా వ్యవహరించనుండగా డీసీఎంఎస్‌కు సూర్యాపేట డీసీవో ఎస్‌.వి.ప్రసాద్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. 


డీసీసీబీలో 20.. డీసీఎంఎస్‌లో 10మంది డైరెక్టర్లు...

డీసీసీబీలో 20మంది డైరెక్టర్లుండగా, డీసీఎంఎస్‌లో 10మంది డైరెక్టర్లున్నారు. డీసీసీబీలో 110మంది పీఏసీఎస్‌ చైర్మన్లతో పాటు 29ఇతర సంఘాల చైర్మన్లు కలిపి మొత్తంగా 20మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంది. వీరిలో ఒకరు చైర్మన్‌గా, మరొకరు వైస్‌ చైర్మన్‌గా ఎన్నిక కానున్నారు. అయితే పీఏసీఎస్‌ నుంచి ఎన్నికైన డైరెక్టర్లు గ్రూప్‌ ‘ఏ’గా, ఇతర సంఘాల నుంచి ఎన్నికైన వారు గ్రూప్‌ ‘బీ’ డైరెక్టర్లుగా పరిగణిస్తారు. గ్రూప్‌"ఎ’లో 20మందికి గాను 16మంది డైరెక్టర్లు ఎన్నిక కానుండగా అందులో ఓసీ 10, బీసీ 2, ఎస్సీ 3, ఎస్టీ 1 డైరెక్టర్‌ ఉండనుండగా గ్రూప్‌ ‘బి’లో నలుగురు డైరెక్టర్లకు గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో డైరెక్టర్‌ ఎన్నిక కానున్నారు. ఇక డీసీఎంఎస్‌లో 10మంది డైరెక్టర్లు ఉండగా గ్రూప్‌ ‘ఏ’లో ఆరుగురు డైరెక్టర్లలో ఓసీ 3, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఒకరు చొప్పున ఎన్నిక కానుండగా గ్రూప్‌ ‘బి’లో నలుగురు డైరెక్టర్లకు ఓసీ 2, బీసీ1, ఎస్సీ1 ఎన్నిక కానున్నారు. logo
>>>>>>