శనివారం 28 మార్చి 2020
Nalgonda - Feb 18, 2020 , 01:45:45

24 నుంచి పట్టణ ప్రగతి

24 నుంచి పట్టణ ప్రగతి

సూర్యాపేట జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఎవరూ ఊహించని రీతిలో పల్లెలను అభివృద్ధి చేస్తూ అక్కడి ప్రజలకు ఎలాంటి సమస్యలతో కూడా సతమతమవకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వినూత్న రీతిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం విధితమే. ఇప్పటికే రెండు విడుతలుగా ఓసారి 30రోజులు, మరోసారి 10రోజుల కార్యక్రమం చేపట్టారు. పల్టెల్లో చేపట్టాల్సిన పనులు గుర్తించి వాటిని చేపట్టేందుకు నెలనెలా నిధులు కూడా విడుదల చేస్తున్నారు. దీంతో పల్లెలు పచ్చలహారంగా మారుతూ పారిశుధ్యం మెరుగుపడుతుంది. దీంతో పల్లెలు బాగుపడుతూ ప్రజలు సంతోషంగా ఉంటుండడంతో ఇటీవల కాలంలో పంచాయతీ సిబ్బంది పన్నుల వసూళ్లకు వెళ్లినా ప్రజలు సమస్యలపై నిలదీయడం మానేసి పన్నులు చెల్లిస్తున్నారు. దీంతో గతంతో పోల్చితే ఈ సంవత్సరం పన్నుల వసూళ్లు అధికంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తాజాగా పట్టణ ప్రగతిని కూడా చేపట్టేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.


 నెలనెలా నిధులు విడుదల

ఇక మీదట ప్రతి నెలా పట్టణాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నిధులు కూడా విడుదల చేయనున్నట్లు ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం విధితమే. ఈకార్యక్రమానికి రెండు మూడు రోజుల ముందే ఆయా పట్టణాల్లోని వార్డుల్లో ప్రత్యేక అధికారుల నియామకాలు, నిరక్షరాస్యుల గుర్తింపు, చేయాల్సిన పనులు, వార్డుల వారీగా నలుగురు చొప్పున ప్రజా సంఘాల ఏర్పాటు తదితరాలను పూర్తి చేయాలని సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు కసరత్తు చేపడుతున్నారు. పచ్చదనం, పారిశుధ్యం ప్రణాళికా బద్దంగా సాగుతూ పౌరులకు మెరుగైన సేవలు అందాలని, దీనికి ప్రజలు కూడా విస్తృత భాగస్వామ్యంతో విజయవంతం చేయనున్నారు. ప్రస్తుతం పట్టణాలు ఎలా ఉన్నాయి... భవిష్యత్లు ఎలా ఉండాలి అనే దానికి ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందించనున్నారు.


నేడు ప్రగతిభవన్‌... రేపు వార్డుల్లో 

నేడు హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, కమిషనర్లతో మున్సిపల్‌ సదస్సు జరుగబోతుండగా మరుసటి రోజు అంటే బుధవారం పట్టణాల్లోని వార్డుల్లో సమావేశాలు నిర్వహిస్తారు. పట్టణాల్లో జరిగే సమావేశాల్లో వార్డుల వారీగా నలుగురు చొప్పున ప్రజాసంఘాల ఏర్పాటు కోసం ముందుకు వచ్చే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అలాగే ఆయా వార్డుల్లో ఉన్న సమస్యలను గుర్తిస్తారు.

logo