గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 17, 2020 , 02:49:58

సహకారంలోనూ కారు జోరు

సహకారంలోనూ కారు జోరు

నల్లగొండ, నమస్తే తెలంగాణ:  శాసన సభ ఎన్నికల నుంచి ఈ ఏడాది వరకు వరుసగా నిర్వహించిన  ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకే జిల్లా ప్రజలు పట్టం కడుతున్నారు. ఇటీవల  నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల్లో జిల్లాలో పూర్తి స్థాయిలో చైర్మన్లను టీఆర్‌ఎస్‌కే ప్రజలు కట్టబెట్టగా నేడు  రైతాంగం పీఏసీఎస్‌ల ఎన్నికల్లోను కేసీఆర్‌ సర్కార్‌కే మద్దతు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 42 ప్రాథమిక సహకార సంఘాలుండగా 32 స్థానాల్లో గులాబీ పార్టీకి చెందిన చైర్మన్లే ఎన్నిక కాగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ ఏడు స్థానాలకు పడిపోయిం ది. మరో మూడు స్థానాలు వాయిదా పడగా రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఆదేశాల మేరకు ఆయా స్థానాల్లో ఎన్నిక జరగనుంది.  


32 పీఏసీఎస్‌ల్లో టీఆర్‌ఎస్‌ పాగా... 

జిల్లా వ్యాప్తంగా 42 ప్రాథమిక సహకార సంఘాలుండగా అందులో 32 స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గెలుపొందినటువంటి డైరెక్టర్లే చైర్మన్లుగా ఆదివారం ఎన్నికయ్యారు. రాష్ట్ర సహాకార ఎన్నికల అథారిటీ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగిన ప్రక్రియలో ఈ ఎన్నిక జరగింది. ప్రధానంగా మిర్యాలగూడ నియోజక వర్గంలో 9 పీఏసీఎస్‌ కేంద్రాలుండగా అన్ని కేంద్రాల్లోను టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే చైర్మన్లుగా ఎన్నికయ్యారు. 

ఇక నాగార్జునసాగర్‌ నియోజక వర్గంలో 8 పీఏసీఎస్‌ కేంద్రాలుండగా 6 కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌, ఒక కేంద్రంలో కాంగ్రెస్‌ చైర్మన్‌ ఎన్నిక కాగా నిడమనూరు పీఏసీఎస్‌ ఎన్నిక వాయిదా పడింది. ఇక నకిరేకల్‌లో ఏడింటికి గాను ఆరు పీఏసీఎస్‌ల్లో టీఆర్‌ఎస్‌, 1 కాంగ్రెస్‌ ఎన్నిక కాగా, మునుగోడులో ఆరింటికి గాను 3 టీఆర్‌ఎస్‌, 2 పీఏసీఎస్‌ల్లో కాంగ్రెస్‌ చైర్మన్లు ఎన్నికకాగా శివన్నగూడెం వాయిదా పడింది. ఇక దేవరకొండలో ఎనిమిదింటికి గాను అయిదు స్థానాల్లో టీఆర్‌ఎస్‌, 3 స్థానాల్లో కాంగ్రెస్‌ , నల్లగొండలో నాలుగింటికి గాను 3 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలువగా నల్లగొండ మండలంలోని గొల్లగూడ పీఏసీఎస్‌ ఎన్నిక వాయిదా  పడింది. 


logo
>>>>>>