గురువారం 09 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 17, 2020 , 02:49:15

జిల్లాలో నేడు 6లక్షల మొక్కల నాటింపు

జిల్లాలో నేడు 6లక్షల మొక్కల నాటింపు

నల్లగొండ, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా సోమవారం జిల్లావ్యాప్తంగా మొక్క ల నాటింపు (ప్రత్యేక హరితహారం) కార్యక్రమం జరుగనుంది. తన జన్మదినం సందర్భంగా బహుమతిగా మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్‌ సూచించడంతో ఆ దిశగా అధికార పార్టీ శ్రేణులతోపాటు  అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారుగా నేడు 6లక్షల మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు. 


టీఆర్‌ఎస్‌ శ్రేణుల ఆధ్వర్యంలో....

జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణుల ఆధ్వర్యంలో నియోజకవర్గానికి కనీసం 50వేల మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పలుశాఖల సహకారంతో మొక్కలు తెప్పించి అందుబాటులో ఉంచారు. ఈ మొక్కలను ఇప్పటికే కార్యకర్తలు తీసుకెళ్లి నాటేలా చర్య లు తీసుకుంటున్నారు. మొక్కలు నాటడంతోపాటు సంరక్షణ బాధ్యత సైతం తీసుకోనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు ఇతర ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేసుకున్నారు. 


 ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో.. 

టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతోపాటు పార్టీ అనుబంధ సంఘాలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు నేడు కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా మొక్కల నాటేందుకు చర్యలు చేపట్టారు. అన్ని శాఖలకు  అధికారులు సంబంధిత కార్యాలయంలో మొక్కలు నాటేందుకు ఇప్పటికే మొక్కలను సిద్ధం చేసుకున్నారు. ఉద్యోగ సంఘాలు సైతం ఇప్పటికే మొక్కల నాటింపునకు చర్యలు చేపట్టారు. 


logo