బుధవారం 01 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 17, 2020 , 02:43:51

యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: యాదాద్రి శ్రీ లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులు దీరిన భక్తులతో సముదాయాలు, మొక్కు పూజలతో మండపాలు కిక్కిరిశాయి. ఆదివారం ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి పోటెత్తింది. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు.  ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము 3 గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం 3గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.


హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీ రోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. రూ. 100 టిక్కెట్‌పై బాలాలయం ముఖ మండపంలో 10 నిమిషాల పాటు పూజలో పాల్గొనే ఈ పూజలకు ఆదరణ పెరుగుతుంది. శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. 


వైభవంగా వ్రత పూజలు

యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు.  సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. 


శ్రీవారి ఖజానాకు రూ.19,25,839

శ్రీవారి ఖజానాకు రూ.19,25,839 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 3,66,430, రూ.150ల దర్శనంతో రూ. 2,70,000, రూ.100ల దర్శనంతో రూ. 16,300, కల్యాణకట్ట ద్వారా రూ. 44,000 వ్రత పూజల ద్వారా రూ.1,14, 500, ప్రసాద విక్రయాలతో రూ.6,41,470, శాశ్వత పూజల ద్వారా రూ.98,160, టోల్‌గేట్‌ ద్వారా రూ.1,240, అన్నప్రసాదంతో రూ.6,276, వాహనపూజల ద్వారా రూ.19,900, ఇతర విభాగాలతో రూ. 2,66,813తో కలిపి శ్రీవారి ఖజానాకు రూ. 19,25,839 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.


logo
>>>>>>