బుధవారం 08 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 16, 2020 , 02:51:14

పోలింగ్‌@80.31శాతం

  పోలింగ్‌@80.31శాతం

నీలగిరి : జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాలకు శనివారం నిర్వహించిన ఎన్నికల్లో 80.31 పోలింగ్‌శాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 39సహకార సంఘాల పరిధిలోని 368 డైరెక్టర్‌ స్థ్ధానాలకు ఎన్నికలు జరుగగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 74882 మంది ఓటర్లు ఉండగా 60137 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇప్పటికే 177 డైరెక్టర్‌ స్థ్ధానాలు ఏకగ్రీవం కాగా శనివారం గెలిచిన వారి తో ఆదివారం సహకార అధికారులు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపిక పూర్తి చేయనున్నారు. సహకార ఎన్నికల అథారిటీ జిల్లాలో 42 సహకార సంఘాల పరిధిలో 545 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 2189మంది నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో 185 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 545 డైరెక్టర్‌ స్థానాల్లో వెనిగండ్ల, దామరచర్ల, ఆలగడప సొసైటీలు పూర్తిగా, 177 స్థానాలు ఏకగ్రీవం కావడంతో 368స్థానాలకు 846 మంది బరిలో ఉండగా శనివారం ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేసి పోలింగ్‌ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.


80.31 శాతం పోలింగ్‌ ....

జిల్లాలో 39సహకార సంఘాల పరిధిలో 368 స్థానాలకు శనివారం సహకార అధికారులు ఎన్నికలను నిర్వహించగా 80.31 శాతం ఓటింగ్‌ నమోదైంది. మొత్తం 74,882 మంది ఓటర్లకు గాను 60,137 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 43,0 90 మంది పురుషులు, 17047 మంది స్త్రీలున్నారు. జిల్లాలో 42 సహకార సంఘాల పరిధిలోని 545 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయగా ఇందులో ఒక లక్షా 8,955 మంది ఓటర్లున్నట్లు గుర్తించారు. వీరిలో 79,661 మంది పురుషులు, 29,294 మంది స్త్రీలున్నారు. అయితే 3 సహకార సంఘాలు, 177 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కావడంతో ఈ సంఘాల పరిధిలో ఓటర్లు ఓటు వేయడం లేదు. మిగిలిన 39 సహకార సంఘాల పరిధిలోని 74,882 మంది ఓటు హక్కు వినియోగించుకునున్నారు. 


నేడు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక...

శనివారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అధికారులు  ఎన్నికలు నిర్వహించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఫలితాలు ప్రకటించారు. ఓట్ల లెక్కింపులో ఎన్నికైన డైరెక్టర్లకు ఎంపికైన పత్రాలను అందజేశారు. అదివారం జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని సహకార సంఘాలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎంపిక చేయనున్నారు. ఆ రోజు కోరం సరిపోకున్నా వాయిదా పడినా మరుసటి రోజు ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. 


logo