సోమవారం 30 మార్చి 2020
Nalgonda - Feb 16, 2020 , 02:49:47

ఉద్యోగులకు అండగా సీఎం కేసీఆర్‌

ఉద్యోగులకు అండగా సీఎం కేసీఆర్‌

నల్లగొండ, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాధినేతగా వారికి నిత్యం అండగా ఉంటున్నారని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. టీఎన్‌జీఓస్‌ కౌన్సిల్‌ సమావేశం శనివారం నల్లగొండ జిలాకేంద్రంలోని సంఘం భవనంలో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సంఘం డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణలో గుత్తా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఎల్లప్పుడు సహకారం అందించడంతో పాటు వారి సేవలను వినియోగించుకొని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని బాధ్యతలు ప్రభుత్వంపై ఉన్నందునే పీఆర్‌సీ విషయంలో కొంత ఆలస్యమవుతుందన్నారు. వరుస ఎన్నికలు, ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు సంతృప్తి పొందేలా సాధ్యమైనంత మేరకు పీఆర్‌సీ ఇచ్చే విధంగా సీఎం కేసీఆర్‌ కృత నిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. సీపీఎస్‌ విషయంలో అప్పట్లో యూపీఏ ప్రభుత్వం చట్టం చేస్తే సంఘాల నుంచి సైతం సరిగ్గా స్పందన లేదని,  ప్రస్తుతం అందులో మార్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. 


టీఎన్‌జీఓస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతోనే త్వరలో మంచి పీఆర్‌సీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరికి ఉపయోగపడే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని, దానితోనే సత్‌ సంబంధాలు కొనసాగిస్తూ మంచి ఫలితాలు పొందడానికి కాస్త ఓపిక అవసరమన్నారు. కొంత మంది ఉద్యోగుల్లో చిచ్చు పెట్టి సంఘాన్ని అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. జూలై 1, 2018 నుంచి పీఆర్‌సీ తీసుకురావడంతో పాటు 63 శాతం మేరకు పొందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీపీఎస్‌పై దేశ వ్యాప్తంగా వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఒక్కో ఉద్యోగికి కనీసం 24 వేలు వచ్చేలా నివేదిక తయారు చేసి సర్కారుకు నివేదించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ సౌకర్యం ప్రభుత్వం కల్పించిందని, అవసరమైతే ప్రతి ఉద్యోగి కొంత కంట్రిబ్యూట్‌ చేసైనా మరిన్ని సేవలు పొందేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఉద్యోగి కనీసం ఒక మొక్క నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. 


నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌కు ఎంతో సహకారం అందించారని, వారికి మంచి చేసేందుకు కేసీఆర్‌ ఎప్పుడు సానుకూలంగా ఉంటారని అన్నారు. ప్రభు త్వ పథకాలు అర్హులకు అం దేలా ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. సీపీఎస్‌ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉద్యోగులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. టీఎన్‌జీవోస్‌ భవన నిర్మాణానికి మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి సహకారంతో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 


డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ...

టీఎన్‌జీవోస్‌ ఉద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆ సంఘం నేతలు 20 తీర్మానాలు ప్రవేశ పెట్టగా దీనికి అన్ని అనుబంధ సంఘాల నేతలు ఆమోదం తెలిపారు. అనంతరం సంఘం జిల్లా డైరీ, క్యాలెండర్‌ను గుత్తా సుఖేందర్‌రెడ్డి, కారం రవీందర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఎన్‌జీవోస్‌ నేతలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం11 సంఘాలకు సంబంధించిన క్యాలెండర్లను సైతం ఆవిష్కరించారు. నాగార్జునసాగర్‌ ఇరిగేషన్‌ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా చేస్తున్న సరికొండ నర్సింహరాజు రాసినటువంటి వేకువచలమ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం టీఎన్‌జీవోస్‌ నుంచి రాష్ట్రకబడ్డీ అసోసియేషన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తాజొద్దీన్‌ను సన్మానించారు. టీఎన్‌జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు ఎం. శ్రవణ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిల్ల రాజేందర్‌, సహధ్యక్షుడు బండారు రేచల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్‌, ఖయ్యూంబేగ్‌, మాలే శరణ్యారెడ్డి, టీఎన్‌జీవోస్‌ నేతలు కొణతం చంద్రారెడ్డి, డీఐ రాజు, నర్సింహాచారి, శేఖర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రావు, లక్ష్మయ్య, శ్రీనివాస్‌, జైపాల్‌, జ్ఞానేశ్వర్‌, మామిడాల రమేష్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రాజ్‌కుమార్‌, పందిరి వెంకటేశ్వరమూర్తి, తదితరులు పాల్గొన్నారు. 


logo