ఆదివారం 23 ఫిబ్రవరి 2020
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

Feb 15, 2020 , 01:33:02
PRINT
 ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

పెన్‌పహాడ్‌ : రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకొని మూస పద్ధతిలో సాగు చేసే వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలంలోని కాళేశ్వరం జలాలు పారే చివరి ఆయకట్టు ప్రాంతాలైన చిన్నసీతారాం, పెద్దసీతారాంతండాలు, చెట్లముకుందాపురం, న్యూబంజారాహిల్స్‌తండా తదితర తండాల్లో మంత్రి శనివారం రెండో రోజు పర్యటించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి టూవీలర్‌పై కాల్వ గట్లు, తండాల్లో పర్యటించారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు అంతిమంగా ఎకరాకు రూ.15వేల కంటే ఎక్కువ గిట్టుబాటు కావడం లేదన్న అంశాన్ని రైతులు గుర్తించాలని ఆయన ఉపదేశించారు. రైతులు మూస పద్ధతి మాని ప్రత్యామ్నాయమైన పామాయిల్‌, కూరగాయలు తదితర పంటలపై దృష్టి సారిస్తే అధిక దిగుబడులతోపాటు లాభాలు పొందవచ్చని తెలిపారు. లాభసాటి పంటలపై రైతులకు అవగహన కల్పించేందుకు త్వరలో సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. గోదావరి జలాల చివరి ఆయకట్టులోని కాల్వలపై మంత్రి గురువారం రాత్రి పొద్దుపోయేంత వరకు తిరిగి శుక్రవారం సైతం తన పర్యటనను విస్తృతంగా కొనసాగించారు. మండలంలోని జల్మాలకుంటతండా, చిన్నసీతారం, పెద్ద సీతారంతండా, న్యూబంజారాహిల్స్‌తండా, వేల్పులకుంటతండా, చెట్లముకుందాపురం తదితర గ్రామాల్లో  కాల్వల మీదుగా మంత్రి ప్రయాణం సాగించారు. ఎస్సారెస్పీ కాల్వల్లో పరుగులు పెడుతున్న గోదావరి జలాలకు ఎక్కడ ఆటంకాలు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వానాకాలం నుంచి గోదావరి జలాలు పుష్కలంగా వస్తాయని రైతులకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే బీడు భూములు సస్యశ్యామలంగా మారాయని మంత్రి జగదీశ్‌రెడ్డి కొనియాడారు. కేసీఆర్‌ అపర భగీరథుడని, ఆయన చలువతోనే సూర్యాపేటకు గోదావరి జలాలు అందుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాకపోయినా, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకపోయినా సూర్యాపేటకు గోదావరి జలాలు వచ్చేవా? అని మంత్రి ప్రశ్నించారు. మంత్రి ఆరు గంటలపాటు కాల్వ గట్లు, తండాల్లో మోటర్‌ సైకిల్‌పై పర్యటించిన సందర్భంలో అధికారులు పరుగులు పెట్టారు. కార్యక్రమంలో మార్కెట్‌ మాజీ చైర్మన్‌ వై.వెంకటేశ్వర్లు, ఎంపీపీ నెమ్మాది భిక్షం, గుజ్జ యుగంధర్‌రావు, సర్పంచులు భిక్షం, శాలీబాయి, సముద్రాల రాంబాబు, నాగేందర్‌, రైతులు పాల్గొన్నారు. 


logo