ఆదివారం 29 మార్చి 2020
Nalgonda - Feb 15, 2020 , 01:27:12

యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్‌ సేవ

యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్‌ సేవ

యాదగిరిగుట్ట, నమస్తే తెలంగాణ: యాదాద్రి  శ్రీ లక్ష్మీ నరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్‌ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో వేలాదిమంది పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త... తనను కొలిచిన వారికి నేనున్నానంటూ అభయహస్తమిచ్చి కపాడే శ్రీలక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకారం జరిపారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రంవరకు పలు విడుతలుగా 516 రూపాయల టికెట్‌ తీసుకున్న భక్తులకు సువర్ణ పుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చనచేశారు. దీన్నే సువర్ణపుష్పార్చనగా భక్తులు అత్యంత ప్రీతికరంగా నిర్వహిస్తారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణ జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారుచేసిన 108పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. ఉప ప్రధానార్చకులు బట్టర్‌ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలోని అర్చకబృందం వైభవంగా ఈ పూజలు నిర్వహించారు. మతయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊయలతో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలుఉ కోలాహలంగా కొనసాగింది. అష్టోత్తర పూజల్లో భక్తులు పాల్గొన్నారు. 

అర్జిత పూజల కోలాహలం

యాదాద్రిలో అర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము మూడుగంటల నుంచి  మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీ సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతి రోజు నిర్వహించే నిత్య కల్యాణోత్సంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

రూ. 6,71,247 ఆదాయం

శ్రీవారి ఖజానాకు రూ. 6,71,247 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 87,044, రూ. 100ల దర్శనంతో రూ. 36,100, కల్యాణకట్ట ద్వారా రూ. 14,000 వత్ర పూజల ద్వారా రూ. 29,000, ప్రసాద విక్రయాలతో రూ. 2,59,840, శాశ్వతపూజల ద్వారా రూ. 16,116, టోల్‌గేట్‌ ద్వారా రూ. 2,100, అన్నప్రసాదంతో రూ. 9,172, వాహనపూజల ద్వారా రూ.11,600, ఇతర విభాగాలతో రూ. 1,69,475తో కలిపి శ్రీవారి ఖజానాకు రూ. 6,71,247 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.


logo