శనివారం 29 ఫిబ్రవరి 2020
ప్రేమంటే..!

ప్రేమంటే..!

Feb 14, 2020 , 03:46:16
PRINT
ప్రేమంటే..!

నేడు ప్రేమికుల దినోత్సవం పరస్పర కానుకలకు భారీగా ఖర్చు.. ప్రేమ.. హృదయ స్పందన. ప్రేమ ఎప్పుడు, ఎలా చిగురిస్తుందో తెలియదు. కానీ, ప్రేమలో పడితే ప్రపంచాన్ని మర్చిపోతారు. ప్రేమ మైకంలో మునిగిపోతారు. రెండక్షరాల ప్రేమను వ్యక్తం చేయడానికి రెండు వేల పదాలు సైతం సరిపోవు. ప్రేమ త్యాగానికి చిరునామా అని కొందరు.. స్వార్థానికి పరాకాష్ట అని మరికొందరు నిర్వచించారు. ప్రేమ జంటలు పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటుండగా.. మరికొందరు వారిని ఒప్పించి ఒక్కటవుతున్నారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం వెనుక పాశ్చాత్య సంస్కృతే ప్రధాన కారణం కాగా.. ప్రియురాలి/ప్రియుడి మనస్సు దోచుకునేందుకు కానుకల కోసం భారీ మొత్తంలోనే ఖర్చుచేయడం విశేషం.

 నల్లగొండ విద్యావిభాగం :  వాలెంటైన్‌ ఒక మత గురువు. క్రీస్తూ శకం 3వ శతాబ్దంలో రోమ్‌ చక్రవర్తి క్లాడియస్‌ వివాహాలను నిషేధిస్తాడు. ఈ నిషేదానికి ఓ విచిత్రమైన కారణం ఉంది. యుద్ధంలో పాల్గొనే సైనికులు కుటుంబంపై ప్రేమానుబంధాలు పెంచుకుని ఆలోచిస్తూ సక్రమంగా యుద్ధంలో పోరాడలేకపోతున్నారని రోమ్‌ చక్రవర్తి వివాహాలను నిషేధించాడు. ఆ దేశ క్రైస్తవ మత గురువులు కూడా దీనికి సరేననడంతో యువకుల్లో వ్యతిరేకత వచ్చింది.  కానీ వాలెంటైన్‌ అనే క్రైస్తవ మత గురువు మాత్రం ఆ దేశ రాజు ఆజ్ఞానాన్ని వ్యతిరేకించి రహస్యంగా పెళ్లిళ్లు చేయడం ప్రారంభించాడు. ఇది ఆ నోట ఈ నోట చేరి రాజుకు తెలిసింది. 


రాజు ఆదేశాల మేరకు సేవకులు వాలెంటైన్‌ను బంధించి రాజదర్భాలో హాజరుపర్చాడంతో వాలెంటైన్‌కు రాజు మరణ శిక్ష విధించి జైల్‌లో ఉంచారు. ఇది తెలిసిన ఆ దేశ ప్రజలు, యువతులు జైలుకు వచ్చి వాలెంటైన్‌ను చూసి వెళ్లాడం ప్రారంభించారు. దేశంలో యువతులతోపాటు ఆదేశ సైనికాధికారి కుమార్తె కూడా వాలెంటైన్‌ను చూసేందుకు వచ్చి వెళ్లేది. ఇది తెలిసిన ఆ సైనికాధికారి తన కుమార్తెను జైలు వద్దకు వెళ్లాడుండా భద్రత చేశాడు. అప్పటీకే వాలెంటైన్‌ తన మనుస్సులోని మాటలను చెప్పేందుకు కాగితాలు లభించకపోవడంతో హృదయ ఆకారంలో ఉండే ఆకులపై (పత్రాలపై) ప్రేమ లేఖ రాసి కిటీకీ నుంచి బయటకు విసిరాడు. ఆమెకు తన ప్రేమను చివరి రోజుల్లో వెల్లడించినప్పటీకీ అది ఫలించకుండానే క్రీస్తూ శకం 270 ఫిబ్రవరి 14న వాలెంటైన్‌ మృత్యువును చేరాడు. అతని ప్రాణత్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14ను “ ప్రపంచ ప్రేమికుల దినోత్సవం”గా  నిర్వహిస్తున్నారు.  


ఆకర్షణ వ్యామోహంలోనే నేటి ప్రేమలు అధికం...

ప్రేమించడం తప్పుకాదు. అర్హత లేకుండాప్రేమలలో పడడమే వైఫల్యానికి కారణమౌతోంది. ప్రేమకు ఎలాంటి అర్హతలుండవని... ఆస్తులు చూడకుండా ఇద్దరి మధ్య చిగురించేదే ప్రేమని కొట్టిపారేస్తున్నారు నేటి యువత. అయితే ప్రేమ వైఫల్యాలను విశ్లేషిస్తున్న న్యాయ నిపుణులు, పెద్దలు మాత్రం ప్రేమకు కొన్ని అర్హతలు ఉన్నాయని చెబుతున్నారు.  నేటి సమాజం లో వయస్కుల మధ్య ఎదుటి వారికి ఆకర్షణకు లోనవుతూ ప్రేమలో పడుతున్నారు.  ఈ క్రమంలో స్థిరత్వం లేక ప్రేమ పెళ్లిలు చేసుకున్న వారు చిన్నచిన్న తగాదాలతో   విడిపోతున్నారు. ఇరు పక్షాల్లో ఎలాంటి తగాదాలు ఉండవు అనుకున్న సందర్భంలోనే ప్రేమకు, పెళ్లిలకు శ్రీకారం చుట్టడం సమంజసం అంటున్నారు పెద్దలు. 


 ఒకరికి ఒకరు అర్థం చేసుకున్నప్పునడే కలిసి జీవించగం..

మేము ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు మాకు పరిచయం ఏర్పడింది.  కులాల అంతరాలు తోలగిపోవాలనే లక్ష్యంతో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో కులాంతర వివాహం చేసుకున్నాం. ఆరోజు నుంచి నేటి వరకు ఇరుకుటంబ సభ్యుల సహకారంలో ఎలాంటి మార్పు లేదు. మా కుమారుడు, కూతరు చిన్నతనం నుంచే పుష్ప తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉంటున్నారు. పుష్ప కుటుంబ సభ్యులకు కొన్ని విషయాల్లో వారి సామాజికవర్గం, బంధువుల నుంచి సమస్యలు ఎదురైనా వారి తండ్రి అన్నింటిని ఎదుర్కొని మా కుటుంబానికి అండగా ఉన్నారు. మేము టీఆర్‌ఎస్‌లో చేరి  ఉన్నత స్థానానికి చేరుతే విమర్శించిన వారే పుష్ప తండ్రికి అభినందనలు తెలిపారు. ఇద్దరు మనుషుల మధ్య మనసులు, వ్యక్తిత్వాలు ఏ సమయంలోనైనా కలవవచ్చు ... వ్యక్తిత్వాలు కలిసి జీవితం పంచుకోవాలనే ఆలోచనకు వచ్చినప్పుడు తమ కాళ్లపై తాము నిలబడి ఉన్నప్పుడే ఈ నిర్ణయాలు తీసుకోవాలి.ప్రేమ వివాహల్లో ఆర్థిక ఇబ్బందులు తరుచుగా ఎదురవుతుంటాయి. వీటన్నింటిని తట్టుకుని ప్రేమతో మెలిగి సమస్యలు పరిష్కరించుకోవాలి.ప్రేమించడం , ప్రేమించుకోవడం, ప్రేమ వివాహలు చేసుకోవడం తప్పు కాదు కానీ స్థిరమైన అభిప్రాయంతో  కలిసి జీవించినప్పుడే  విజయం సాధించగలం.

- వేముల వీరేశం-పుష్ప, 

నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే-గాయని 


మా ఇద్దరిని కలిపింది తెలంగాణ ఉద్యమమే..

కళాశాల సమయంలో వామపక్ష విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరికి  పరిచయం ఏర్పడింది. సంఘంలో పనిచేస్తూనే ఉన్నత చదువులు కొనసాగించాము.  ఉస్మానియ విశ్వవిద్యాలయంలో నేను పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు రాజేశ్వరీ పీజీలో ప్రవేశం పొందింది. ఆ సమయంలో  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం... 2010లో వివాహం చేసుకుందామిని రాజేశ్వరికి చెప్పడంతో ఆమె ఒప్పుకొని మా కుటుంబ సభ్యులతో మాట్లాడమని చెప్పింది. ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి అందరి సమక్షంలో ఆదర్శ వివాహం చేసుకున్నాం. కులాంతర వివాహల ఇబ్బందులపై  ముందు జాగ్రత్తతో ఉండడం వల్ల మా దాంపత్య జీవితంలో ఎలాంటి విభేదాలు రాలేదు. వివాహం తరువాత ఇద్దరం పీహెచ్‌డీ పూర్తి చేశాం.  ఉస్మానియా యూనివర్సిటీలో 700 మంది డాక్టరేట్లలో భార్యభర్తలు పీహెచ్‌డీ పట్టా పొందడం ప్రథమంగా మేమే కావడం సంతోషం కలిగించే విషయం. ఏ ప్రేమ వివాహమైనా ఆర్థిక ఇబ్బందులు సహజమే, అన్నింటిని తట్టుకొని నిలబడి సమాజానికి మంచి సందేశమివ్వాలి.  

- దూదిమెట్ల బాలరాజుయాదవ్‌-రాజేశ్వరి, తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్‌, నకిరేకల్‌


ప్రజాసేవలో ఆదర్శ దంపతులు

అర్వపల్లి : మండల కేంద్రానికి చెందిన దావుల వీరప్రసాద్‌ యాదవ్‌-మనీష 2010వ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమలో గెలవడమే కాకుండా 10 ఏళ్లుగా ఒకరినోకరు గౌరవించుకుంటూ రాజకీయాల్లో సైతం రాణిస్తున్నారు.  2014లో మనీష అర్వపల్లి ఎంపీపీగా ఎన్నికై 5 సంవత్సరాలు పనిచేయగా వీరప్రసాద్‌ ఆమెకు తోడు 

నీడగా  ఉండి ప్రజలకు సేవలందించారు. 2019లో వీరప్రసాద్‌ యాదవ్‌ అర్వపల్లి జడ్పీటీసీగా గెలుపొందగా మనీష ఆయన విజయంలో కీలకపాత్ర పోషించింది. 


పెద్దలను ఒప్పించాం.. ప్రేమలో గెలిచాం.

నేను బీటెక్‌ పూర్తి చేసి దామరచర్ల మండల కేంద్రంలో డెకరేషన్‌, సౌండ్‌ సిస్టిమ్‌ వ్యాపారం నడుపుతున్నాను.   నా భర్య సౌమ్య బీఏ బీఎడ్‌ పూర్తిచేసింది. ఐదు సంవత్సరాల క్రితం మా మధ్య పరిచయం ఏర్పడి  ప్రేమగా మారింది.  మా ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. వారికి తెలియకుండా 2015 డిసెంబర్‌లో నల్లగొండ ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నప్పటికీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఒక్కటిగా ఉండలేక పోయాం. పలు రకాలుగా పెద్దలను ఒప్పించాం. అప్పటిదాక వేరుగానే ఉన్నాం. చివరికి మా ప్రేమలో ఉన్న నిజాయితీని అర్ధం చేసుకున్న పెద్దలు మా పెళ్లిని అంగీకరించారు. మా ప్రేమకు ప్రతి రూపంగా బాబు పుట్టాడు. ప్రస్తుతం రెండు కుటుంబాలు కలసిపోయాయి. ప్రేమకుల మధ్య మొదల్లో ఉన్న ప్రేమ చివరిదాకా ఉన్నప్పుడే ప్రేమ పెళ్లిల్లు కలకాలం నిలిచి ఉంటాయి. 

- మోదాల శ్రీనివాస్‌-సౌమ్య, దామరచర్ల


పరిచయం ప్రేమగా మారింది..

నేను 2003 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యోగానికి ఎంపికయ్యాను. మహాబుబ్‌నగర్‌ పీజీ సెంటర్‌లో ఉద్యోగం వచ్చింది. ఇదే ఎంపికలో అనురాథ కూడా ఉద్యోగానికి ఎంపికై మహాబుబ్‌నగర్‌ జిల్లా గద్వాల పీజీ సెంటర్‌కు అధ్యాపకురాలిగా వచ్చింది. అలా అనురాథతో పరిచయం ఏర్పడి 2004లో ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలను ఒప్పించి 2007లో వివాహం చేసుకున్నాం. నేను ప్రస్తుతం ఎంజీయూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా తను  మహబుబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. మాకు పాప, బాబు ఉన్నారు. ప్రేమించేటప్పుడు ఏ విధంగా ప్రేమను పంచారో అదే ప్రేమను జీవితాంతం చూపించాలి. ఇంత వరకు మా మధ్య బేధాభిప్రాయాలు రాలేదు.

- డా.ఆకుల రవి-అనురాథ, ఎంజీయూ అధ్యాపకుడు, నల్లగొండ


logo