బుధవారం 08 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 14, 2020 , 03:41:07

‘సహకార’ ఎన్నికలకు సర్వం సిద్ధం

‘సహకార’ ఎన్నికలకు సర్వం సిద్ధం

ముగిసిన ప్రచారం.. రేపే పోలింగ్‌ 368స్థానాల్లో 846మంది పోటీ మూడు పీఏసీఎస్‌లు, 177డైరెక్టర్లు ఏకగ్రీవం 368పోలింగ్‌ స్టేషన్లు 1250మంది సిబ్బంది 72,882మంది సభ్యులకు ఓటుహక్కు నేడు బ్యాలెట్‌ పత్రాలు, పోలింగ్‌ సామగ్రి అందజేత సహకార ఎన్నికల పోలింగ్‌కు సమయం ఆసన్నమైంది. గురువారం సాయంత్రానికి ప్రచార గడువు ముగియగా.. శనివారం ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్‌.. తిరిగి 2గంటలకు లెక్కింపు ప్రారంభించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకంతో పాటు బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 42సహకార సంఘాల పరిధిలో మూడు ఏకగ్రీవం కాగా 545డైరెక్టర్‌ స్థానాల్లో ఏకగ్రీవమైన 177మినహా 368స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 72,882 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు 368పోలింగ్‌ స్టేషన్లలో 1250మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేసేలా మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 11రూట్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా రూట్‌, జోనల్‌ అధికారులను నియమించారు.

నీలగిరి : సహకార ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధ్దమైంది. శనివారం పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, మౌలిక వసతుల కల్పన, పోలింగ్‌ సిబ్బందితోపాటు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 15న ఉదయం పోలింగ్‌ మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. జిల్లాలో 42 సహకార సంఘాలకు ఇప్పటికే 3 ఏకగ్రీవమ కాగా 545 డైరెక్టర్‌ స్థానాలకు 177 ఏకగ్రీవమయ్యాయి. మిగిలి 368 స్థానాలకు 846 మంది పోటీ పడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు 368 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి 1250 మంది సిబ్బందిని కేటాయించారు. 72,882 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 11రూట్లను ఏర్పాటు చేసి ప్రత్యేక రూట్‌ అధికారి, జోనల్‌ అధికారులను కేటాయించారు.


జిల్లాలో మొత్తం 42సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఈ నెల 6న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 6 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. 9న పరిశీలన, 10న ఉపసంహరణ ముగిసింది. 42 సహకార సంఘాల పరిధిలోని 545 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా ఆలగడప, దామరచర్ల, వెనిగండ్ల సహకార సంఘాలతోపాటు 177 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 368 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 


368 పోలింగ్‌ కేంద్రాలు..

39 సహకార సంఘాల పరిధిలోని 368 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బందిని కేటాయించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి పోలింగ్‌ అధికారి ఇద్దరు అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారులతో సహా 1104 మంది సిబ్బందిని కేటాయించారు. వీరు కాకుండా 10శాతం అదనంగా మరో 110 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. 22 మంది జోనల్‌, రూట్‌ అధికారులను నియమించారు. జిల్లా వ్యాప్తంగా మూడు రెవెన్యూ డివిజన్లను దేవరకొండలో 3, నల్లగొండ, మిర్యాలగూడలో 4 రూట్లను ఏర్పాటు చేసి ప్రతీ రూట్‌కు జోనల్‌, రూట్‌ అధికారులను నియమించారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోనే 8 ప్రింటింగ్‌ ప్రెస్‌ల్లో 74,882 బ్యాలెట్‌ పత్రాలు ముద్రించారు. 601 బ్యాలెట్‌ బాక్సులను సైతం సిద్ధ్దం చేశారు. 


నేడు ఎన్నికల సామగ్రి పంపిణీ..

జిల్లాలో ఎన్నికల సామగ్రి పంపిణీకి 3 డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేవరకొండలో ఎంపీడీఓ కార్యాలయం, నల్లగొండలో డైట్‌ ప్రాంగణం, మిర్యాలగూడలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వీటిని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి నిర్ణీత పోలింగ్‌ కేంద్రం సిబ్బందికి బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పత్రా లు, పోలింగ్‌కు సామగ్రి అందజేస్తారు. ఎన్నిక సిబ్బంది శుక్రవారం డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు వెళ్లి రిపోర్టు చేసి తమకు కేటాయించిన సామగ్రిని తీసుకొని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. 


74,882 మంది ఓటర్లు...

జిల్లాలో 42 సహకార సంఘాల పరిధిలోని 546 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయగా ఇందులో ఒక లక్షా 8,955 మంది ఓటర్లున్నట్లు గుర్తించారు. వీరిలో 79,661 మంది పురుషులు, 29,294 మంది స్త్రీలు ఉన్నారు. అయితే 3 సహకార సంఘాలు, 177 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కావడంతో ఈ సంఘాల పరిధిలో ఓటర్లు ఓటు వేయడం లేదు. మిగిలిన 39 సహకార సంఘాల పరిధిలోని 368 డైరెక్టర్‌ స్థానాలకు 74,882 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 


15న ఉదయం పోలింగ్‌.. మధ్యాహ్నం ఫలితాలు

ఈ నెల 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికైన డైరెక్టర్లకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. 16న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. ఆ రోజు కోరం లేక లేదా అనివార్య కారణాలతో ఎన్నిక వాయి దా పడితే మరుసటి రోజు ప్రక్రియ పూర్తి చేస్తారు.  


3 చైర్మన్‌, 177 డైరెక్టర్లు ఏకగ్రీవం ..

జిల్లా వ్యాప్తంగా 42 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా చైర్మన్‌ అయ్యేందుకు అవసరమైన సంఖ్యకు అనుగుణంగా 11 సంఘాల్లో డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో వెనిగండ్ల, దామరచర్ల, ఆలగడప సహకార సంఘాలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. మరో 8 చైర్మన్‌కు సరిపడా డైరెక్టర్లు ఏకగ్రీవమయ్యాయి. వీరంతా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఏకగ్రీవం కావడంతో 11 చైర్మన్లు 16న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు లాంఛనంగా చైర్మన్లు కానున్నారు. శాలిగౌరారంలో 13 స్థానాలకు 12, గుండ్రాంపల్లిలో 13 స్థానాలకు 7, నార్కట్‌పల్లిలో 13కు 11, ఎల్లారెడ్డిగూడెంలో 12కు 8, సల్కునూర్‌లో 13కు 12, ఆలగడపలో 13కు 13, దామరచర్లలో 13కు 10, బాబుసాయిపేటలో 13కు 11, వెనిగండ్లలో 13కు 13, పెద్దవూరలో 13కు 11, గుర్రంపోడులో 13కు 10 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 


ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశాం..

సహకార ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. పోలింగ్‌ పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 368 డైరెక్టర్లకు 846 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే బ్యాలెట్‌ పత్రాలు ముద్రించాం. శుక్రవారం డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల వద్ద సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించి సామగ్రి అందజేస్తాం. 

- ఆర్‌. శ్రీనివాసమూర్తి, జిల్లా సహకార అధికారి


logo