శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 13, 2020 , 04:06:07

వైద్యులు బాధ్యతగా వ్యవహరించాలి

వైద్యులు బాధ్యతగా వ్యవహరించాలి

నల్లగొండ సిటీ: వైద్యులు తమ హక్కులను కాపాడుకుంటూనే ప్రజలకు బాధ్యతాయుతంగా వైద్య సేవలందించాలని ఎస్పీ ఏవీ రంగనాథ్‌ సూచించారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్లు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సభ్యులు, పోలీస్‌ అధికారుల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. దవాఖానాలపై దాడులు జరుగటానికి కారణాలు, వాటిని తగ్గించే క్రమంలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన సామాజిక బాధ్యత వైద్యులపై ఉందని గుర్తుంచుకోవాలన్నారు. దవాఖానలలో సమస్యలు వచ్చినప్పుడు అందుకు అనుగుణంగా స్పందించాలని, కేసులు నమోదు చేయాల్సి వస్తే డాక్టర్లతో పోలీసులు సహకరించాలన్నారు. దవాఖానాలకు అనుబంధంగా ఉండే మెడికల్‌ ల్యాబ్స్‌లో నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా రోగుల నుంచి, వారి బంధువుల నుంచి వచ్చే సమస్యల తీవ్రత తగ్గించే అవకాశం కలుగుతుందన్నారు. డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వైద్యుల వృత్తి సున్నితంగా మారిందని, రోగికి, వైద్యుడికి ఉన్న సన్నిహిత సంబంధాలు  దెబ్బతింటున్న కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. అన్ని దవాఖానాలలో వైద్య పరీక్షలు, చికిత్సలకు సంబంధించిన ధరల పట్టికను ప్రదర్శించడం ద్వారా దాడులను కొంత తగ్గించే అవకాశం ఉంటుందని వైద్యులకు సూచించారు. డాక్టర్ల మధ్య ఐక్యత పెరుగాలని సూచించారు. దవాఖానాలపై గతంలో జరిగిన దాడులు, మృతిచెంది రోగుల బంధువుల బాధ, పాటించాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఏఎస్పీ నర్మద పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్‌ వైభవ్‌ గైక్వాడ్‌, డాక్టర్‌ జయప్రకాష్‌రెడ్డి, డా.పుల్లారావు, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, రమణారెడ్డి, సీఐలు రవీందర్‌, గౌరీనాయుడు, డాక్టర్లు హుస్సేన్‌రెడ్డి, సుచరిత, సుధాకర్‌, సురేశ్‌, అనితారాణి , ఇతర డాక్టర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. logo