శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 11, 2020 , 03:05:56

రాష్ట్ర సమాచార కమిషనర్‌గా మన కట్టా శేఖర్‌రెడ్డి

రాష్ట్ర సమాచార కమిషనర్‌గా మన కట్టా శేఖర్‌రెడ్డి
  • మాడ్గులపల్లి మండల కేంద్రం శేఖర్‌రెడ్డి స్వస్థలం
  • 30ఏండ్ల నుంచి పత్రికా రంగంలో విశేష సేవలు
  • నమస్తే తెలంగాణలో.. ఉద్యమంలో కీలక పాత్ర
  • జిల్లా వాసికి కీలక బాధ్యత దక్కడంపై ఆనందం

జిల్లా వాసి, నమస్తే తెలంగాణ ఎడిటర్‌ కట్టా శేఖర్‌రెడ్డిని సమాచార కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాడ్గులపల్లి మండలం మర్రిగూడెం శేఖర్‌రెడ్డి స్వస్థలం కాగా.. 1987నుంచి వివిధ పత్రికల్లో ఆయన జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఎంఏ, ఎంఫిల్‌ చదివిన కట్టా.. 2010నుంచి నమస్తే తెలంగాణ వ్యవస్థాపక సీఈఓగా, 2014నుంచి నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కట్టా శేఖర్‌రెడ్డిని.. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం సమాచార కమిషనర్‌గా ఎంపిక చేయడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ  : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరో కీలక పదవిని కేటాయించారు. జిల్లాకు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ కట్టా శేఖర్‌ రెడ్డిని రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ఎంపిక చేశారు. ప్రస్తుతం నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా బాధ్యతల్లో ఉన్న కట్టా శేఖర్‌ రెడ్డి స్వస్థలం మాడ్గులపల్లి మండల కేంద్రం పరిధిలోని మర్రిగూడెం గ్రామం. రైతు దంపతులైన కట్టా మల్లారెడ్డి, జానకమ్మ సంతానంగా 1961 డిసెంబర్‌ 5న జన్మించిన శేఖర్‌రెడ్డి.. మాడ్గులపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి పూర్తి చేశారు. నల్లగొండలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌, ఎన్జీ కాలేజీలో డిగ్రీ, నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ కాలేజీలో బీఈడీ చదివారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో తత్వశాస్త్రంలో ఎంఏ, లెనినిస్ట్‌ విద్యా తాత్వికతపై ఎంఫిల్‌ పూర్తి చేశారు. యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగానూ కట్టా.. పలు బాధ్యతలు నిర్వహించారు. 1985లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ హ్యుమానిటీస్‌ కాలేజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా, సెనేట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 


1987వ సంవత్సరం నుంచి  పత్రికారంగంలో సేవలు...

చదువులు పూర్తిచేసిన వెంటనే 1987లో ఉదయం దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా కట్టా శేఖర్‌రెడ్డి జర్నలిస్టు ప్రస్థానం మొదలుపెట్టారు. రెండేళ్ల తర్వాత పాత ఆంధ్రజ్యోతి పత్రికలో చేరి పదేళ్లకు పైగా వివిధ హోదాలలో పని చేశారు. ఆ తర్వాత రీడిఫ్‌.కామ్‌, వార్త పత్రికల్లోనూ కొద్ది రోజులు కొనసాగారు. పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వెలుగు ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌గా 2002లో పని చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక పునఃప్రారంభ సమయంలో ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆరేళ్లు పనిచేశారు. వందల మంది పాత్రికేయులకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత రెండేళ్లపాటు మహాటీవీలో ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించిన కట్టా శేఖర్‌రెడ్డి.. 2010లో నమస్తే తెలంగాణ దినపత్రిక ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వ్యవస్థాపక సీఈఓగా వ్యవహరించారు. 2014 నుంచి నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా కొనసాగుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ అధినేత కేసీఆర్‌కు పత్రిక పరంగా చేయూతనిస్తూ కీలకపాత్ర పోషించారు. శేఖర్‌రెడ్డి మార్గదర్శకత్వంలో జర్నలిస్టులుగా ఎదిగిన ఎందరో పాత్రికేయులు సైతం తెలంగాణ ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించారు. కట్టా సంపాదకత్వంలో వెలువడిన జర్నలిస్టు కరదీపిక పుస్తకం వర్ధమాన, యువ జర్నలిస్టులకు కరదీపికగా ఉపయోగపడుతోంది.


తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర...

ఆంధ్రజ్యోతితోపాటు నమస్తే తెలంగాణ పత్రికల ద్వారా ఎన్నో వ్యాసాలు, సంపాదకీయాలు కట్టా శేఖర్‌రెడ్డి రాశారు. బొమ్మా-బొరుసు, బయోగ్రాఫ్‌ కాలమ్‌ పేరుతో అనేకమంది ప్రముఖులను, రాజకీయ సందర్భాలను విశ్లేషించారు. కట్టా-మీఠా, మాటకు మాట శీర్షికల ద్వారా తెలంగాణ ఉద్యమ సమయంలో పదునైన వ్యంగ్యాస్ర్తాలను తెలంగాణ శక్తులపై సంధించారు. తెలంగాణ నీటి వాటాలతోపాటు జల వనరుల ఆవశ్యకతను వివరిస్తూ ఎన్నో వ్యాసాలు రాసిన కట్టా శేఖర్‌రెడ్డి.. నదుల కథను పుస్తకాన్ని సైతం ప్రచురించారు. వార్తల సేకరణలో పలువురు జర్నలిస్టులు ఎదుర్కొన్న అనేక సంఘటనల అనుభవాల సంకలనంగా వార్తల వెనుక కథ పుస్తకం తీసుకువచ్చారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ కె.రామచంద్రమూర్తితో కలిసి ఈ పుస్తకం రచించారు. మాడ్గులపల్లి మండల ఏర్పాటుకోసం ఎంతో కృషిచేసి మండలాన్ని సాధించిన ఆయన. వరదకాల్వ అసంపూర్తి పనులను పూర్తిచేయించే విషయంలో తీసుకున్న చొరవ రైతాంగం ఎన్నటికీ మర్చిపోలేనిది. సుదీర్ఘకాలం జర్నలిస్టుగా పనిచేసి.. తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించిన కట్టా శేఖర్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ప్రభుత్వంలో సమాచార కమిషనర్‌గా క్యాబినెట్‌ ర్యాంక్‌ రాష్ట్రస్థాయి పదవి కట్టబెట్టడం పట్ల జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


logo