శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 11, 2020 , 02:58:56

ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యమివ్వాలి

ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యమివ్వాలి

నల్లగొండ, నమస్తే తెలంగాణ: నల్లగొండ నూతన కలెక్టర్‌గా గత సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ తొలి గ్రీవెన్స్‌లో తన మార్క్‌ను చూపించారు.  గ్రీవెన్స్‌లో పెద్ద సంఖ్యలో బాధితులు పలు సమస్యలను ప్రస్తావిస్తూ విన్నవించుకోగా వాటిలో ప్రత్యేక సమస్యలను గుర్తించిన కలెక్టర్‌ వారికి మొబైల్‌ నెంబర్‌ను సైతం అందజేసారు. ప్రధానంగా భూ సమస్యలతో పాటు ఇతర పనుల విషయంలో అధికారులు డబ్బులు అడుగుతున్నారని ఆయన దృష్టికి తీసుకొస్తే మొబైల్‌ నెంబర్‌ ఇచ్చి మరోసారి కిందిస్థాయిలో సంప్రదించి తనకు కాల్‌ చేయమని సూచించడంతో బాధితులు సంతోషంగా వెనుదిరిగారు. చింతపల్లి మండలం తహసిల్దార్‌ తమ వారసత్వ భూమి తమకు పట్టా చేయమంటే వేరే వాళ్లకు చేసిందని మళ్లీ పట్టా చేయడానికి రూ.50 వేలు అడుగుతుందని బాధితులు కలెక్టర్‌ దృష్టికి తీసుకురావడంతో ప్రత్యేకంగా స్పందించి సమస్య పరిష్కరిస్తామని హామీఇచ్చారు. 

గైర్హాజరైన అధికారులపై ఆగ్రహం..

గ్రీవెన్స్‌ సందర్భంగా ప్రతి జిల్లా అధికారి హాజరు కావల్సి ఉంది. అయితే సోమవారం పది శాఖలకు పైగా అధికారులు ఈ సమావేశానికి హాజరుకాక కిందిస్థాయిలో ఉన్న సూపరింటెండెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లను పంపించారు. అయితే ఆ శాఖకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు సంబంధిత అధికారిని అడగటంతో వారు అక్కడ లేనందున ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే కాల్‌ చేసి పిలువమని వారిస్థానంలో వచ్చిన వారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో కొందరు అధికారులు ఆలస్యంగా హాజరైనప్పటికి మరికొందరు మాత్రం కుంటి సాకులు చెప్పి రాకుండా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌ ఏఓ మోతిలాల్‌కు సూచిస్తు వారికి నోటీసులు జారీ చేసి సంజాయిషీ అడగాలని ఆదేశించారు. 

పీఎం కిసాన్‌కార్డులపై స్పెషల్‌ డ్రైవ్‌ : కలెక్టర్‌

ప్రధానమంత్రి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులచే లబ్ధిదారులకు రుణ సదుపాయం కల్పించేందుకు ఈనెల 8 నుంచి 24 వరకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కిసాన్‌ బీమా పథకంపై ఎల్‌డీఎం సూర్యం వివరించగా దీన్ని వినియోగించుకోవాలని రైతులకు సూచిస్తు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 2.55లక్షల మంది రైతులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుకు అర్హత కలిగి ఉన్నారని వీరికి రుణం వచ్చే అవకాశం ఉన్నందున దీన్ని పొందాలని రైతులకు సూచించారు. ఈ క్రెడిట్‌ పథకం ద్వారా రూ.3లక్షల వరకు రుణంపొందే అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కిసాన్‌ క్రెడిట్‌కార్డులు అందజేస్తున్నందున ఈ రుణాన్ని వినియోగించుకుని పశు సంపద, పాల ఉత్పత్తి,గొర్రెలు,మేకల పెంపకం, కోళ్లు, పందులు, బాతుల పెంపకం కోసం రుణ సదుపాయం ఇస్తున్నామన్నారు.


logo