శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 11, 2020 , 02:38:23

రాణిస్తున్న గిరిజన రైతాంగం

రాణిస్తున్న గిరిజన రైతాంగం

ఆత్మకూర్‌.ఎస్‌ : అందరి రైతుల లాగా ఒకే రకమైన పంటలు వేసి గిట్టుబాటు ధర రాక నష్ట పోకూడదనే లక్ష్యంతో వినూత్నంగా సాగు చేసి రాణిస్తున్నారు గిరిజన రైతులు. మండలంలో బొరింగ్‌తండాకు చెందిన రైతులు తమకున్న వ్యవసాయ భూమిలో వరి, పత్తి పంటలతో పాటు కూరగాయలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఆవాస గ్రామంలో కొందరు రైతులు గత ఐదేండ్లుగా బెండకాయ, కాకర, వంకాయ, దోసకాయలతో పాటు ఆకుకూరలు సాగు చేస్తున్నారు. సమీపంలోని నూతనకల్‌, ఆత్మకూర్‌ మండలంలోని గ్రామాల్లో విక్రయించుకుంటూ, నెమ్మికల్‌ వారంతాపు సంతలో అమ్మి తద్వారా అధిక లాభాలు పొందుతున్నట్లు రైతులు తెలిపారు. తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంలో కూరగాయలు, ఆకుకూరల పంట చేతికి రావడంతో ఇతర పంటల పెట్టుబడులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, ఇంటి ఖర్చుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఉందని వారు చెబుతున్నారు. వాతావరణం అనుకూలించకపోయినా, ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంటలో లాభం పొందవచ్చనే ఆశతో కూరగాయాలు, ఆకుకూరల సాగువైపు దృష్టి సారించినట్లు పేర్కొంటున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న నిత్యావసర పంటలకు మధ్య దళారుల బెడద చాలా తక్కువ, పైపెచ్చు సొంతంగా అమ్ముకోవచ్చు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యాపారులు సైతం తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేయడం ద్వారా అమ్మకాల బెడద ఉండదు. కూరగాయలు, ఆకుకూరల సాగుపై ఒకరిని చూసి మరొకరు ఆసక్తి కనబరుస్తున్నట్లు వారు అంటున్నారు.


logo