మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Feb 10, 2020 , 02:20:58

ఘనంగా చక్రతీర్థ స్నానం

ఘనంగా చక్రతీర్థ స్నానం

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం చక్రతీర్థస్నానం జరిపించారు. కల్యాణం.. రథోత్సవంతో అలసిపోయిన స్వామివారిని చక్రతీర్థ సేవ నిర్వహించి శృంగార డోలోత్సవానికి సిద్ధం చేశారు. అంతకుముందు ఆలయంలో మహాపూర్ణాహుతి నిర్వహించారు. భక్తులు తమ మనస్సు, తనువును ఒక్కటి చేసి శ్రీనారసింహ.. జై నారసింహా అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ శ్రీస్వామివారి శ్రీచక్రాళ్వార్‌కు జరిపించిన శ్రీచక్రతీర్థ మహోత్సవాన్ని కనుల పండువగా తిలకించారు.  ‘శ్రీచక్ర తీర్థాన శ్రీధరుడే అడగా కలియుగమే శిరమొంచి ప్రణమిల్లగా అన్నట్లుగా భక్తులు శ్రీవారిని స్మరిస్తూ పుష్కరిణిలో ఆనందతాండవం చేశారు. ఒకవైపు వేదపండితుల వేదఘోష, పారాయణాల సందడిలో తరలివచ్చిన భక్తుల ఆనంద హేలలో భక్త జనులు ఆనందపరవశులయ్యారు. స్థానిక భజనమండలి సభ్యుల భజన నిర్వహించారు. ఆలయంలో వేదపారాయణములు జరిపారు.


   శ్రీపుష్పయాగం.. డోలారోహణం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన పాతగుట్టలో ఆదివారం రాత్రి శ్రీపుష్పయాగం, డోలారోహణం, దేవతా ఉద్వాసన వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహుడి ఉత్సవాలకు ఆహ్వానించిన ఆయా దేవతలను ఆయా మంత్రముల చేత ఆహ్వానించిన పిదప తిరిగి వారి స్వస్థలములకు సంప్రదాయంగా పంపించే వేడుకను దేవతా ఉద్వాసనగా పేర్కొంటారు. భగవానుడి నామాలతో అర్చన వేడుకలు నిర్వహించే ప్రక్రియను శ్రీపుష్పయాగంగా పేర్కొంటారు. సహస్రనామాలతో అమ్మవారిని, భగవానుడిని పుష్పాలతో ఆరాధించారు. భగవానునికి ప్రీతి కలిగే రాగ, లయబద్ధంగా యజ్ఞాచార్యులు, అర్చకబృందం వేడుకగా జరిపారు. 


    ‘చక్రతీర్థం’ ప్రత్యేకత

బ్రహ్మోత్సవ వేడుకల ముగింపు సూచికగా శ్రీచక్రస్వరూపుడైన శ్రీహరి చక్ర స్వరూపమును అర్చించి వైధిక విధులను అనుసరించి శ్రీస్వామివారి స్నాపన బింబములను పుష్కరిణికి తెచ్చి స్నానోత్సవమును నిర్వహించును. దీనినే అవభృథ స్నానం అని అంటారు. దీక్షాన్తోఅవభృథోయజ్ఞే అని అమరం. అవభృథ స్నానమనేది యజ్ఞాంతమందలి చేసే  విశిష్టప్రక్రియ. శ్రీ చక్రాత్తాళ్వార్‌ను (సుదర్శన చక్రాన్ని) శ్రీస్వామి వారి పుష్కరిణిలో ముంచి పవిత్రస్నానం చేయిస్తారు. శ్రీసుదర్శన చక్రస్నానం వల్ల అత్యంత పవిత్రత పొందిన పుష్కరిణి జలాల్లో భక్తులు కూడా శిరస్నానం చేస్తారు. దీని వలన సర్వపాప ప్రక్షాళణ గావించును. శ్రీస్వామి వారి సుదర్శన ఆయుధాన్ని  ఒక విశిష్టదైవవతంగా అన్ని కష్టాల నుంచి, దుష్ట శక్తుల నుంచి రక్షించే మహాశక్తాయుధముగా విశ్వసించి పూజించడం ప్రత్యేకత.


శ్రీపుష్పయాగము ప్రత్యేకత

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి వారి సన్నిధిలో ఎంతో మనోహరముగా శ్రీ పుష్పయాగము నిర్వహించును. పుష్పహాస అని భగవానునికి నామం కలదు. లక్ష్మీదేవి నివసించు ఎనిమిది స్థానములో పుష్పమునకే అగ్రస్థానము నిల్చినది. పుష్పములు భిన్నభిన్న రూపములో ఉన్న వాటిలోని పరిమళము ఒకే విధముగా ఉండుట రూపాంతరములెన్ని స్వీకరించిన అంతర్గతమైన లక్ష్మీతత్తము ఒక్కటే అని పురాణ ప్రశస్తి. లక్ష్మీదేవికి నిత్యనివాస స్థానములు కమలములు కనుక కమలాలయ అని అమ్మవారికి నామము. భగవానునికి అత్యంత ఇఘ్టరాలైన అమ్మవారు నివసించు పుష్నములచే శ్రీ పుష్పయాగము నిర్వహించుట ఎంతో శుభప్రదమైనది.


logo
>>>>>>