గురువారం 09 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 09, 2020 , 01:26:04

కనుల పండువగా రథోత్సవం

కనుల పండువగా రథోత్సవం
  • యాదాద్రిలోని పాతగుట్టలో శ్రీవారి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డ భక్తులు

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్య విమాన రథోత్సవం శనివారం రాత్రి వైభవంగా జరిగింది. శ్రీలక్ష్మీ అమ్మవారిని 33కోట్ల దేవతల సాక్షిగా వివాహమాడిన నరసింహస్వామిని దివ్యవిమాన రథోత్సవంపై ఊరేగే తంతును ఆలయ అర్చకులు, యజ్ఞాచార్యులు ఘనంగా నిర్వహించారు.  భక్తులు తన్మయత్వంతో దర్శించుకున్నారు. అంతకు ముందు రథం ముందు పసుపు, కుంకుమ కలిపిన అన్నంతో బలిహరణం చేశారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను మల్లె, మందార, పున్నాగ, జాజి, వకుళ, కేతకి, చంపక, మల్లిక వంటి పుష్పాలతో, చంద్రహారం, ముత్యాలు, మువ్వలు, వగడాలు, వివిధ కంఠాభరణాలతో అలకరించారు. రథంలోని ఆ పరమాత్మను దర్శిస్తే పునర్జన్మ ఉండదని నమ్మకం. రథంపైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని అదిష్టింపజేయగానే లక్ష్మీనృసింహ.. గోవిందా... గోవిందా నామస్మరణలతో పాతగుట్ట ప్రాంత పరిసరాలు మార్మోగాయి. రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంగళవాయిద్యాల నడుమ భక్తులు భజనలు చేస్తూ కోలాటాలు వేశారు. భక్తులు రథాన్ని లాగడానికి పోటీపడ్డారు. 


రథాంగహోమం ...

శ్రీ స్వామి వారి ఆలయంలో నిత్య ఆరాధనలు నిర్వహించిన మీదట సాయంత్రం 5 గంటలకు రథాంగహోమం జరిపారు. రథబలి యాజ్ఞీకులచే నిర్వహించారు. శ్రీస్వామి వారి, అమ్మవారి ఉత్సవ మూర్తులను దివ్యవిమాన రథంపై వేంచే చేసి ఆరాధనలు గావించారు. భక్తుల దర్శనార్థం శ్రీస్వామి, అమ్మవార్లను అలంకరించి రథారూఢులను గావించి తిరువీధిలో ఊరేగింపు సేవ నిర్వహించారు. భక్తుల మంగళ హారతులు... జయ జయ ధ్వానంతో నామ సంకీర్తనలతో కోలాటాల మధ్య  దివ్యవిమానరథోత్సవం కనుల పండువగా సాగింది. 


సాంస్కృతిక కార్యక్రమాలు 

సాయంత్రం 5 గంటల నుంచి 5. 45 గంటల వరకు యాదగిరిగుట్ట గాయత్రీ భజన మండలి వారిచే భజన, 5. 45 గంటల నుంచి 6. 30 వరకు బొమ్మ భాగ్యలక్ష్మి భజనమండలిచే భజన, 7.15 గంటల వరకు శ్రీమార్కండేయస్వామి భజన మండలిచే భజన, రాత్రి 8.00 గంటల వరకు నేహ బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన, రాత్రి 8గంటల నుంచి కానుగు పాపయ్య బృందంచే రథం ఎదుట చెక్క భజన నిర్వహించారు.


logo