గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 08, 2020 , 03:16:56

మానవత్వం మాయం..

మానవత్వం మాయం..

(నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) ఫిబ్రవరి తొలి వారంలోనే ఉమ్మడి జిల్లాలో ఆరు దారుణ హత్యలు జరిగాయి. ఈ వారంలో ఇప్పటికి గడిచింది ఏడు రోజులే అయినా ఆరు దారుణ ఘటనలు జరగ్గా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఉదయం మునుగోడు మండలం ఎలగలగూడెంలో జరిగిన మరో దారుణ ఘటనలో తీర్పారి కవిత అనే యువతి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. తన పెళ్లికి ఇవ్వాల్సిన కట్న కానుకల విషయంలో తల్లిదండ్రులు, అన్నతో జరుగుతున్న ఘర్షణలే కవితపై రాయితో వాళ్ల దాడికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం కవిత చికిత్స పొందుతుండగా.. దాడి చేసిన తల్లి లక్ష్మమ్మ, అన్న గోవర్ధన్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు ముందు కూడా ఉమ్మడి జిల్లాలో ఈ నెలలోనే మరో ఐదు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటో తేదీన ఆలేరు పట్టణంలో నగల కోసం పట్ట పగలే మహిళ హత్యకు గురికాగా.. నాలుగో తేదీన శాలిగౌరారం మండలంలో గురజాల గ్రామానికి చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. 


క్షుద్ర పూజల కోసమే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. హాలియా సమీపంలో ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున యువకుడిని మాటు వేసి మరీ కత్తులతో నరికి చంపారు. వివాహేతర సంబంధంతో మొదలైన పాత కక్షలే ఇందుకు కారణమని సమాచారం. ఆ వెంటనే 5వ తేదీ తెల్లవారుజామున చివ్వెంల మండలం మోదిన్‌పురంలో మతిస్థిమితం లేని భార్య తన భర్తను రాయితో కొట్టి చంపింది. ఆరో తేదీ సుర్యాపేట మండలం తాళ్లఖమ్మంపహాడ్‌లో మారు తల్లి, చెల్లెలును.. మొదటి భార్య కొడుకు, అక్క ఇద్దరూ కలిసి రోకలి బండతో కొట్టి చంపారు. వరుస ఘటనల్లో నెత్తుటి దారలు పారించిన ఈ ఘటనలన్నీ జిల్లా ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నాయి. రోజుకో చోట వెలుగు చూస్తున్న దారుణం.. మానవత్వం పూర్తిగా మాయమైన స్థితిని చాటుతోందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి కోసమో.. పాత కక్షల నేపథ్యమో.. మనిషిని తోటి మనిషి చంపుకునే ఈ విష సంస్కృతి వేళ్లూనుకోకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 


రోకలిబండతో.. మారు తల్లి, చెల్లెలు హత్య...

సూర్యాపేట మండలం తాళ్లఖమ్మంపహాడ్‌లో ఈనెల 6న తెల్లవారుజామున తల్లీ, కూతురు దారుణ హత్యకు గురయ్యారు. తన భర్త కప్పల నాగయ్య మొదటి భార్య, తన సొంత అక్క అయిన కప్పల అచ్చమ్మ, ఆమె కొడుకు కప్పల హరీష్‌.. ఇద్దరూ కలిసి రెండో భార్య అంజమ్మ(38), ఆమె కుమార్తె(18) మౌనికను రోకలి బండతో మోది చంపారు. ఘటన అనంతరం తల్లీ కొడుకు ఇద్దరూ నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఆస్తితోపాటు అంజమ్మ ప్రవర్తన హత్యకు కారణంగా తెలుస్తోంది. logo
>>>>>>