శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 08, 2020 , 03:15:09

కల్యాణం...కమనీయం

 కల్యాణం...కమనీయం
  • అంగరంగ వైభవంగా శ్రీలక్ష్మీనృసింహుడి కల్యాణం
  • అపూర్వఘటాన్ని తిలకించేందుకు పాతగుట్టకు పోటెత్తిన భక్తులు
  • ఉత్సవమూర్తులకు పట్టువస్ర్తాల సమర్పణ
  • ‘జైనారసింహ’ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : పాతగుట్ట అపర వైకుంఠాన్ని తలపించింది. పండు వెన్నెల్లో శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణం శుక్రవారం రాత్రి కనుల పండువగా జరిగింది. తుల లగ్న పుష్కరాంశ సుముహూర్తాన శ్రీనారసింహుడు అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేసే అపూర్వ ఘట్టాన్ని తిలకించి భక్తులు తరించారు. అంతకుముందు స్వా మి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. పండితుల వేదఘోష, భక్తజనం జేజేల మధ్య శుక్రవారం రాత్రి 8. 15 గంటలకు మొదలైన కల్యాణ వేడుక అర్థరాత్రి వరకు సాగింది. ముందుగా కల్యాణ మండపంలో విశ్వక్సేన ఆరాధన చేసి స్వస్తి పుణ్యహవాచనం చేసి సంప్రోక్షణ చేశారు. ఆలయ అనువంశికధర్మకర్త భాస్కరాయణి నర్సింహామూర్తి, ఈఓ ఎన్‌.గీతలకు కంకణ ధారణ చేశారు. 


స్వామి వారికి బంగారు యజ్ఞోపవీతాన్ని ధారణ చేశారు. స్వామి, అమ్మవార్లకు మధ్య తెరపత్రం ఉంచి జీలకర్ర బెల్లం ఘట్టాన్ని జరిపారు. అనంతరం పూలమాలలను మార్పిడి చేశారు. ప్రవరలను చెప్పి కన్యాదానం చేశారు. వేదపండితులు, అర్చకబృందం, పారాయణీకులు వేదఘోష నడుమ పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణ వేడుక కొనసాగింది. అనంతరం ఆభరణాలు, పట్టువస్ర్తాలతో అమ్మవారిని, స్వామివారిని అలంకరించారు. బ్యాండు మేళాలు, కోలాట నృత్యాల నడుమ గజవాహనంపై స్వామి, అమ్మవార్లు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్థానాచార్యులు రాఘవాచార్యులు, ప్రధానార్చకుడు నర్సింహాచార్యులు, నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు బట్టర్‌ సు రేంద్రచార్యులు ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు.


logo