సోమవారం 30 మార్చి 2020
Nalgonda - Feb 08, 2020 , 03:11:16

పెళ్లి చేయమని అడిగినందుకే..

పెళ్లి చేయమని అడిగినందుకే..

మునుగోడు : పెళ్లి చేయమని అడిగిన కూతురిపై తల్లిదండ్రులు, సోదరుడు హత్యాయత్నం చేసిన ఘటన మండల పరిధిలోని ఎల్గలగూడెంలో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ రజనీకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్గలగూడెం గ్రామానికి చెందిన తీర్పారి కవిత(30) తనకు వివాహం చేయమని తల్లిదండ్రులు లక్ష్మమ్మ, బుచ్చయ్య, అన్న గోవర్ధన్‌తో కొంతకాలంగా గొడవపడుతున్నది. కుటుంబానికి చెందిన 12 ఎకరాల భూమిలో కనీసం 2 ఎకరాలు తన పేర రిజిస్ట్రేషన్‌ చేయిస్తే పెళ్లి చేసుకుంటానని కవిత పలుమార్లు తల్లిదండ్రులతో చెప్పింది. పెళ్లి సంబంధం కుదిరితేనే భూమి రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని వారు తేల్చిచెప్పారు. ఈ విషయమై నాలుగేళ్ల క్రితం తల్లిదండ్రులపై కవిత మునుగోడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 


అప్పటి నుంచి రెండెకరాల భూమి కోసం చట్టపరంగా పోరాడుతూ పెళ్లి చేయాలని తల్లిదండ్రులు, అన్నపై ఒత్తిడి తీసుకొస్తున్నది. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్న తల్లిదండ్రులు, సోదరుడు శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న కవితపై కర్రలతో దాడిచేశారు. అంతటితో ఆగకుండా రాయితో తలపై బలంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేయడంతో ఎస్‌ఐ రజనీకర్‌ సంఘటనా స్థలానికి చేరుకొని కవితను చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. దాడికి పాల్పడిన తల్లిదండ్రులు లక్ష్మమ్మ, బుచ్చయ్య, అన్న గోవర్ధన్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రజనీకర్‌ తెలిపారు. 


logo