శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 07, 2020 , 02:26:01

ఎస్‌ఓను బదిలీ చేయొద్దంటూ విద్యార్థినుల ధర్నా

ఎస్‌ఓను బదిలీ చేయొద్దంటూ విద్యార్థినుల ధర్నా

కేతేపల్లి : మండలంలోని చెర్కుపల్లి గ్రామంలోని కస్తుర్బా బాలికల పాఠశాలలో గురువారం విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. వివరాలు ఈవిధంగా ఉన్నాయి. పాఠశాల మొత్తంలో 379 మంది విద్యారినులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇక్కడ స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన నీలాంబరిని కట్టంగూర్‌ మండలానికి బదిలీ చేశారు. ఈమె స్థానంలో నాంపల్లి మండలంలో స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వసంతను బదిలీ చేశారు. గురువారం పాఠశాలకు వచ్చిన ఎస్‌ఓ వసంత బాధ్యతలు స్వీకరిస్తుండగా విద్యార్థినులు అడ్డుకొని, ఆమెను పాఠశాలలోకి రాకుండా గేటు వద్దనే నిలిపివేశారు. అనంతరం విద్యార్థినులు తరగతి గదుల నుంచి బయటకు పరుగు తీసి గేటుకు తాళం వేశారు. అనంతరం గ్రామంలో ధర్నా నిర్వహించి స్పెషల్‌ అధికారిగా నీలాంబరినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న జీసీడీఓ అరుణశ్రీ,  తాసిల్దార్‌ డి.వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ బి.రామకృష్ణ, ఎంఈఓ చంద్రశేఖర్‌రెడ్డిలు సంఘటనా ప్రదేశానికి చేరుకొని విద్యార్థినులతో మాట్లాడారు. ఉద్యోగులకు సాధారణంగా బదిలీలు జరుగుతాయని విద్యార్థినులు తొందరపడి ఆందోళన చేయొద్దని కోరారు. పాఠశాలలో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవాలని జీసీడీఓ అరుణశ్రీ కోరా రు. 


అయినప్పటికీ విద్యార్థినులు మధ్యాహ్న భోజనానికి వెళ్లకుండా రెండుగంటలకు పైగా ధర్నాను కొనసాగించారు. అక్కడితో ఆగకుండా గ్రామశివారులో గల ఏఎమ్మార్పీ కాల్వ రోడ్డువెంట పరుగులు తీస్తూ జాతీ య రహదారిని చేరుకునే ప్రయత్నం చేశారు. హైవే సుమారు 4కి.మీ. దూరం వరకు విద్యార్థినులు పరుగు తీయడంతో అధికారులు, పాఠశాల సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో ఏమోనని, అధికారులు తీవ్ర భయాందోళన చెందారు. వి ద్యార్థినులను హైవేకు చేరుకోకుండా అధికారులు మధ్యలోనే  అడ్డుకున్నారు. అనంతరం వారితో తాసిల్దార్‌ మరోసారి మాట్లాడే ప్రయత్నం చేశారు. సాయం త్రం అవుతుండడం, ఆందోళన తీవ్రమయ్యే పరిస్థితి ఉండడంతో విద్యార్ధినుల ఆందోళన విరమించే విధం గా పలుమార్లు అధికారులు వేర్వేరుగా మాట్లాడారు. అయినప్పటికీ విద్యార్థినులు ఆందోళన విరమించకపోవడంతో తాసిల్దారు ఈవిషయాన్ని డీఈఓ భిక్షపతికి ఫోన్‌లో తెలియజేశారు. విద్యార్థినులు ఎవరూ ఆందోళన చెందవద్దని పాత స్పెషల్‌ ఆఫీసర్‌ నీలాంబరిని తిరి గి పాఠశాలకు పంపిస్తామని ఫోన్‌లో డీఈఓ హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థినులు ఆందోళనను విరమించి సాయంత్రం పాఠశాలకు చేరుకున్నారు. ధర్నా విరమించడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.


logo