సోమవారం 06 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 06, 2020 , 02:02:47

పంచాయతీ కార్మికులకు బీమా

పంచాయతీ కార్మికులకు బీమా
  • 59 ఏళ్లలోపు వారికి వర్తింపు
  • జిల్లాలో 2849 మంది కార్మికులకు ప్రయోజనం
  • ఈ నెల నుంచే అమలు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
  • ఒక్కో కార్మికుడికి రూ.769 ప్రిమియం చెల్లింపు
  • సాధారణ మరణమైనా రూ. 2లక్షల ైక్లెయిమ్‌

నల్లగొండ, నమస్తేతెలంగాణ : నూతన పంచాయతీరాజ్‌ చట్టంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలను పారిశుధ్య రహిత పంచాయతీలుగా మార్చడంతోపాటు అన్నిరంగాల్లోను అభివృద్ధి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆయా పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలను సైతం కోరుతుంది. వాళ్లకు ఇప్పటికే రూ.8500/ల ప్రకటించిన సర్కార్‌ ఏకారణం చేతనైనా వారు మరణిస్తే రూ.2లక్షల బీమా క్లెయిమ్‌ అందజేసేలా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పంచాయతీరాజ్‌ శాఖ యంత్రాంగం నుంచి జాబితాను స్వీకరించిన సర్కార్‌ నేడో రేపో ప్రీమియం చెల్లించి ఈనెల నుంచే క్లెయిమ్‌ వర్తించేలా చర్యలు చేపడుతోంది.


ప్రతి కార్మికుడికి రూ.2లక్షల బీమా...

జిల్లాలో 844 గ్రామ పంచాయతీలుండగా ఆయా పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం రూ.2లక్షల బీమా వర్తింపచేసేలా ప్రణాళికలు రూపొందించి ఆదిశగా అడుగులు వేస్తుంది. పాత గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే 2099మంది కార్మికులుండగా వారికి సంబంధించిన జాబితాను గత నెల 22న పంచాయతీరాజ్‌ శాఖ సర్కార్‌కు నివేధించింది. తొలుత పాత గ్రామ పంచాయతీలకు సంబంధించిన కార్మికుల జాబితాను పంచాయతీరాజ్‌ శాఖ యంత్రాంగం జాబితా ఆధారంగా ఈస్కీమ్‌ వర్తించనుంది. ప్రతి కార్మికుడికి రూ.769 చొప్పున ప్రభుత్వం ప్రీమియం చెల్లించి రూ.2లక్షల బీమా వర్తించేలా చర్యలు చేపడుతుంది. 


రెండో దశలో మరో 750 మందికి....

జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 844గ్రామ పంచాయతీలుండగా అందులో పంచాయతీల విభజన అనంతరం నూతనంగా 342గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. అప్పటికే ఉన్న 502 గ్రామ పంచాయతీల్లో 2099మంది కార్మికులు ఉండగా వారికి తొలి దశలో భాగంగా బీమా ఈనెల నుంచి వర్తిస్తుంది. నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డ 342 గ్రామాల్లో కొత్తగా 750 మంది కార్మికులు ఉన్నారు. వారికి సైతం ఈబీమా వర్తింపచేయనున్న సర్కార్‌ మలిదశగా వారి జాబితాను నివేధించమని ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి సూచించింది. ఈ నేపథ్యంలో ఇక్కడి పంచాయతీరాజ్‌ శాఖ కొత్త గ్రామ పంచాయతీల పారిశుధ్య కార్మికుల వివరాలను సేకరించి సర్కార్‌కు నివేధించే పనిలో నిమగ్నమైంది. తొలిదశ జాబితాకు సంబందించిన కార్మికులకు ఈనెల నుంచి బీమా వర్తించనుండగా కొత్త గ్రామ పంచాయతీలకు సంబంధించిన కార్మికులకు మలి దశలో అమలు చేయనున్నారు.


నూతన పంచాయతీరాజ్‌ చట్టంలో భాగమే

పల్లెలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్‌ చట్టం అమలు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే రెండు దఫాలుగా పల్లెప్రగతి నిర్వహించిన సర్కార్‌ నాలుగు దఫాలుగా జిల్లాలో ఉన్న 844 గ్రామ పంచాయతీలకు సుమారు రూ.20కోట్ల చొప్పున మొత్తంగా ఆయా పంచాయతీలకు రూ.80 కోట్లు అందజేసింది. అయితే గ్రామాల్లో ప్రధానంగా పారిశుధ్యంపై దృష్టిసారించిన సర్కార్‌ పారిశుధ్య కార్మికులను పరిగణలోకి తీసుకొని వారికి వేతనం సైతం రూ.8500కు పెంచింది. వీరితో పారిశుధ్య రహిత గ్రామాలుగా మారుస్తూ గ్రామాల్లో ఉన్న చెత్తను డంపింగ్‌యార్డులకు తరలించేలా ట్రాక్టర్ల సౌకర్యం కల్పించింది. ఈ భూమికలో ప్రధానపాత్ర పోషించిన పారిశుధ్య కార్మికులు ఏ కారణం చేతనైనా మరణిస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో సర్కార్‌ రూ.769 ప్రీమియం చెల్లించి ఈనెల నుంచి రూ. 2లక్షల క్లెయిమ్‌ అందజేసేలా చర్యలు చేపడుతుంది.logo