శనివారం 28 మార్చి 2020
Nalgonda - Feb 05, 2020 , 02:47:24

హరహర మహదేవ

హరహర మహదేవ

నార్కట్‌పల్లి : ఓం నమః శివాయ, శంభో శంకర, హరహర మహాదేవ శంభోశంకర అంటూ కణకణ మండే నిప్పుల గుండం  నుంచి భక్తులు భక్తి శ్రద్ధలతో నడిచారు. చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థాన కల్యాణ మండపం ఎదుట మంగళవారం తెల్లవారుజామున అగ్ని గుండాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. శివ సత్తుల నాట్య విన్యాసాలు, ఆటపాటలు గట్టు క్షేత్రంలోని భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అగ్ని గుండాల నుంచి నడచేందుకు పోటీ పడ్డారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్ని గుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశారు. తెలిసీ తెలియక చేసిన పాపాలు అగ్నితో దహింపజేయాలని వేడుకుంటూ నిప్పుల్లో నడిచారు. పంటలు బాగా పండాలని, కాలం సమృద్ధిగా కావాలని రైతులు తీసుకొచ్చిన ఆముదాలు, పత్తి, కందులు, మినుములు తదితర ధాన్యాలు అగ్నిగుండంలో వేసి వేడుకున్నారు. పర్వత వాహనంపై ఆసీనులైన పార్వతీ రామలింగేశ్వరులను మంగళవాయిద్యాల నడుమ అగ్ని గుండాల వద్దకు తీసుకొచ్చిన ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ప్రత్యేక హారతి నివేదించారు. అగ్ని దేవుడికి ఆవాహనం చేసి నిప్పుల గుండం వెలిగించారు. అనంతరం నిప్పులపై  నుంచి ప్రధాన అర్చకుడితో పాటు భక్తులు నడిచారు. 

నేడు పుష్పోత్సవం 

బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి ఏకాంత సేవ, పుష్పోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ సులోచన, దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ తెలిపారు. స్వామివారికి అష్టోత్తర శత కలశాలతో అభిషేకం, సూర్య నమస్కారాలు, దీక్షా హోమాలు, బలిహరణ, జయాదిహోమం, మహా పూర్ణాహుతి, ధ్వజారోహణం, త్రిశూల స్నానం, వసంతోత్సవం, నీరాజన మంత్ర పుష్పం, క్షేత్ర పాలక అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.


logo