మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Feb 05, 2020 , 02:42:59

ఏం చేద్దాం.? ఎలా చేద్దాం.?

ఏం చేద్దాం.? ఎలా చేద్దాం.?

సహకార ఎన్నికల్లో పోటీపై రైతుల్లో విస్తృత చర్చ సాగుతోంది. వార్డు నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ రిజర్వేషన్‌ వచ్చింది? వంటి అంశాలను రైతులను ఆరా తీస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో మన వార్డు నుంచి డైరెక్టర్‌గా మన ఊరి రైతు పోటీ చేస్తే ఎలా ఉంటుంది? మనకంటే మన వార్డులోనే ఉన్న పక్క ఊరిలో ఎన్ని ఓట్లున్నాయి? మన బలమెంత..? మిగిలిన గ్రామాల్లో ఓట్ల సంఖ్య ఎంత? ఇలాంటి అంశాలను బేరీజు వేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 110ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవనున్న నేపథ్యంలో.. ఉమ్మడి జిల్లా అంతటా పీఏసీఎస్‌ల పరిధిలోని వార్డుల నుంచి డైరెక్టర్లుగా పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ  : రిజర్వేషన్లు ఖరారు.. నోటిఫికేషన్‌ సైతం విడుదల కావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా సహకార ఎన్నికల సందడి మొదలైంది. ఉమ్మడి జిల్లా అంతటా 111ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు) ఉండగా.. కట్టంగూర్‌ మినహా మిగిలిన అన్ని పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతీ పీఏసీఎస్‌ పరిధిలోనూ 13వార్డులను విభజించగా.. ఆయా వార్డుల నుంచి పోటీ చేయాల్సిన డైరెక్టర్‌ పదవులకు సైతం రిజర్వేషన్లను సహకార శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. రేపటి నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి నుంచి నామినేషన్లు సైతం స్వీకరించనున్నారు. ఈ నెల 15న పోలింగ్‌ జరనుండగా.. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్న విషయం తెలిసిందే. 

పోటీకి పలువురు రైతుల ఆసక్తి...

ఒక్కో ప్రాథమిక సహకార సంఘం పరిధిలో 13డైరెక్టర్‌ వార్డులు ఉండగా.. ఆయా వార్డులన్నీ రెండు నుంచి నాలుగు గ్రామాల పరిధికి విస్తరించి ఉన్నాయి. ఒక్కో వార్డు పరిధిలో సగటున 400వరకు ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న పలువురు రైతులు.. తమ తమ ఊర్లలో తమకు ఉన్న అనుకూలతలను అంచనా వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రైతులంతా ఏకమై తమ ఊరి నుంచే వార్డు డైరెక్టర్‌ను పోటీలో నిలపాలా.. లేకుంటే పక్క ఊరి వారికి మద్దతు ఇవ్వాలా.. అనే విషయమై చర్చిస్తున్నారు. తమ ఊరికి ఉన్న ఓట్లు ఎన్ని..? అవతలి ఊర్లలో మిగిలిన ఓట్లు ఎన్ని..? ఆయా సామాజిక వర్గాల వారీగా ఎవరు బరిలో నిలిస్తే ఎంత సానుకూలత ఉంటుందనే విషయంపై చర్చోప చర్చలు సాగిస్తున్నారు. పార్టీల పక్షాన పోటీ చేద్దామా.. లేకుంటే వార్డు పరిధిలోని ఊర్లన్నీ ఒక్కటై రాజకీయాలకు అతీతంగా పోటీలో నిలుద్దామా.. అనే విషయం పైనా కొన్ని గ్రామాల్లో చర్చ కొనసాగుతోంది. పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులపై కన్నేసిన రాజకీయ ప్రముఖులు కూడా కొందరు పోటీకి ఎనలేని ఆసక్తి చూపుతున్నారు. తాను గెలిస్తే చైర్మన్‌ అయ్యే అవకాశం ఉందని.. రాజకీయ అంశాలు తనకు అనుకూలంగా ఉన్నందున తనకే అవకాశం ఇవ్వాలని.. గ్రామాల్లో రైతులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నేడు, రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండగా.. ఔత్సాహికులంతా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.logo
>>>>>>