శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 05, 2020 , 02:38:36

పాఠశాలకు తాళం వేసి విహార యాత్రకు.!

పాఠశాలకు తాళం వేసి విహార యాత్రకు.!

దేవరకొండ, నమస్తే తెలంగాణ : విహార యాత్ర పేరిట పాఠశాలకు తాళం వేయడం వివాదాస్పదంగా మారింది. దేవరకొండ మండలం కొండభీమనపల్లి మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులను మంగళవారం విహారయాత్రకు తీసుకెళ్తున్నామని చెప్పి ఉపాధ్యాయులు పాఠశాలకు తాళం వేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట, దేవరకొండ ఎమ్మార్సీ ఎదుట ధర్నా నిర్వహించారు. నిబంధనల మేరకు 6, 7, 8 తరగతులకు చెందిన విద్యార్థులను మాత్రమే విహారయాత్ర పేరిట తీసుకెళ్లగా.. మిగతా తరగతుల విద్యార్థులతో పాఠశాలను నడుపకుండా తాళం వేశారు. పాఠశాలలో హెచ్‌ఎంతోపాటు 8 మంది ఉపాధ్యాయులు, ఓ విద్యావాలంటీర్‌ ఉండగా మంగళవారం పాఠశాలకు హెచ్‌ఎంతో సహా ఆరుగురు ఉపాధ్యాయులు, వలంటీరు విధులకు వచ్చి ప్రార్థన నిర్వహించారు. రిజిస్టర్‌లో ఉపాధ్యాయులు సంతకాలు సైతం చేశారు. అనంతరం నల్లగొండలోని పానగల్‌ వద్ద ఉదయ సముద్రం వద్దకు విహారయాత్రకు తీసుకెళ్తున్నామంటూ విద్యార్థుల తల్లి దండ్రులకు చెప్పి నల్లగొండకు తరలించారు. మిగిలిన తరగతుల విద్యార్థులకు సెలవు ప్రకటించారు.

పాఠశాల మూసివేతపై విచారణ..

కొండభీమనపల్లి మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు పానగల్‌ ప్రాంతానికి విహార యాత్రకు వెళ్లారని చెబుతుండగా.. విద్యార్థి సంఘాలు మాత్రం ఓ స్థానిక నేత కుమారుడి జయంతి కార్యక్రమానికి విద్యార్థులను తరలించారని ఆరోపిస్తున్నారు. పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నాకు సైతం దిగారు. స్థానిక ఎంఈఓకు ఫిర్యాదు చేయడంతోపాటు విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. విషయం వివాదాస్పదంగా మారడంతో డీఈఓ భిక్షపతి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఏఎంఓ శ్రీనివాస్‌గౌడ్‌, ఎంఈఓ మాతృనాయక్‌ పాఠశాలకు వెళ్లి వేర్వేరుగా విచారణ నిర్వహించారు. విచారణ నివేదికను డీఈఓకు అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

హుటాహుటిన పాఠశాలకు ఉపాధ్యాయులు.. 

విహారయాత్ర వివాదాస్పదం కావడంతో విద్యార్థులను మధ్యలోనే వెనక్కి తీసుకొని ఉపాధ్యాయ బృందం హుటాహుటిన మధ్యాహ్నం 3గంటల సమయంలో పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగడం.. డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అర్థాంతరంగా వెనుదిరగాల్సి వచ్చింది. 


logo