శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 05, 2020 , 02:37:36

‘పల్లె ప్రగతి’లో దేవరకొండ మండలం ఆదర్శం

‘పల్లె ప్రగతి’లో దేవరకొండ మండలం ఆదర్శం

దేవరకొండ, నమస్తేతెలంగాణ :  ‘పల్లె ప్రగతి’లో దేవరకొండ మండలం ఆదర్శంగా నిలవడం అభినందనీయమని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గన్యానాయక్‌తండా, సూర్యతండా, కట్టకొమ్ముతండాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ పంచాయతీల్లో అమలవుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. గన్యానాయక్‌ తండాలో హరితహారంలో నాటిన మొక్కలను, శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డు, నర్సరీలను పరిశీలించి పంచాయతీలో జరుగుతున్న అభివృద్ది పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ నేనావత్‌ గోపాల్‌ను అభినందించారు. ఆయన వెంట ఏపీఓ రాంచంద్రయ్య, సూర్యతండా సర్పంచ్‌ దామోదర్‌, పంచాయతీ కార్యదర్శులు ఉపేందర్‌, శ్రీజ, ఈసీ చంద్రయ్య ఉన్నారు.

గ్రామాలను హరితవనంలా మార్చాలి

చందంపేట : ఉమ్మడి మండలంలో ప్రతి గ్రామాన్ని హరితవనంగా మార్చాలని డీఆర్డీఓ శేఖర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉమ్మడి మండలాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా గుర్తించిన పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మిషన్‌ భగీరథ పథకంలో చేపట్టిన పైప్‌లైన్‌ల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. త్వరలో ప్రతి గ్రామంలో పర్యటించి హరితహారం మొక్కలను పరిశీలిస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ పార్వతి, ఉమ్మడి మండలాల ఎంపీడీఓలు రాములు నాయక్‌, మాధవి, ఈఓఆర్డీ శ్రీకాంత్‌ టెక్నికల్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


logo