బుధవారం 08 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 03, 2020 , 03:11:28

సహకార ఓటర్లు 1.15 లక్షలు

సహకార ఓటర్లు 1.15 లక్షలు

నీలగిరి : సహకార ఎన్నికల నిర్వహణకు ఆశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో 43 పరిమితి సంఘాలు ఉండగా కట్టంగూర్‌ సంఘం పదవీకాలం పూర్తి కాకపోవడంతో దానిని మినహాయించి 42 సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఓటరు జాబితాను, రిజర్వేషన్లకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. ప్రతి సంఘంలో 13 మంది డైరెక్టర్లు ఉండేలా చేసి, ఆ సంఘాన్ని యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు పూర్తి చేశారు. సోమవారం అన్ని సంఘాల్లో వీటిని ప్రదర్శించనున్నారు. చైర్మన్‌ స్థానానికి మాత్రం ఎలాంటి రిజర్వేషన్లు లేవు. సభ్యత్వం పొంది సంవత్సరం పూర్తయిన వారికి, బకాయిలు లేని వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించారు. జిల్లాలో 42 పీఏసీఎస్‌లలో 1.15 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.     రాష్ట్ర సహకార ఎన్నికల ఆథారిటి నుంచి నోటిఫికేషన్‌ వెలువడడంతో అవసరమైన చర్యలపై జిల్లా అధికార యం త్రాంగం దృష్టి పెట్టింది. ఫిబ్రవరి 3న ప్రతి సహకార సంఘానికి కేటాయించిన ప్రత్యేకాధికారి అక్కడి ఎన్నకపైన నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఈ క్రమంలో ఓటర్లు, రిజర్వేషన్లకు సం బంధించిన వివరాలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పరిధిలో 43 సహకార పరిమితి సంఘాలుండగా వాటిలో కట్టంగూర్‌ సంఘానికి 2016 సంవత్సరంలో ఎన్నికలు జరుగడంతో దాని పదవికాలం డిసెంబర్‌ 2021 వరకు గడువుంది. దీంతో దానిని మినహాయించి మిగతా సంఘాలకు ఎన్నికలు నిర్వహించనునారు. 


ప్రతి సొసైటీలో 13 మంది డైరెక్టర్లు..

ప్రతి సహకార సంఘంలో 13మంది డైరెక్టర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ లెక్కన జిల్లాలో 42 సొసైటీలలో 546మంది డైరెక్టర్లుగా ఎంపికయ్యే అవకాశం ఉం ది. గతంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో 2017 డిసెంబర్‌ను ప్రమాణికంగా తీసుకుని ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. దానిని మరో సంవత్సర కాలం పొడిగింపు రావడంతో ప్రస్తుతం ఉన్న సభ్యు ల సంఖ్యను గుర్తించిన ఓటర్ల వివరాలను మరోసారి క్షుణ్ణం గా పరిశీలిస్తున్నారు. ప్రతి సంఘంలో ఉన్న సభ్యుల మొత్తం సంఖ్యకు 13 డైరెక్టర్లతో విభజించి ప్రాదేశిక వర్గంగా తయా రు చేస్తున్నారు. దీంతో ప్రతి డైరెక్టర్‌కు 300 నుంచి 600 వరకు ఓటర్లు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు రోజు ల నుంచి డైరెక్టర్‌ స్థానాలు, ఓటరు జాబితా, రిజర్వేషన్ల వివరాలపైనే జిల్లా కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియపై కసరత్తు చేసి అదివారం పూర్తి చేశారు. సోమవారం రిజర్వేషన్లు, ఓటరు జాబితాలను సంబంధిత ప్రాథమిక వ్యవసాయ పరిమితి సంఘాల్లో ప్రదర్శించనున్నారు. 


ఏడాది సభ్యత్వం ఉంటేనే..

సహకార సంఘాల్లో సభ్యత్వం పొంది ఏడాదైన వారికి మాత్రమే సొసైటీల్లో ఓటు హక్కు ఉంటుంది. డిసెంబర్‌ 21, 2017 నాటికి జిల్లాలో 3 లక్షల 32 వేల మంది రైతులు ఉండగా 43 పీఏసీఎస్‌ల పరిధిలో లక్షా 33,868 మంది సభ్యులున్నారు. అయితే వీరిలో 31,317 మంది రైతులు సహకార సంఘాల నుంచి రుణాలు తీసుకోవడంతో తమ ఓటు హక్కును కోల్పోగా ప్రస్తుతం జిల్లాలో లక్షా 4,557 మంది ఓటర్లున్నారు. ప్రభుత్వం కటాప్‌ తేదీని డిసెంబర్‌ 31, 2018 వరకు పొడిగించింది. జిల్లాలో ఏడాదిలో మొత్తం 42 సొసైటీల్లో లక్ష 4557 మంది ఓటర్లు ఉండగా వారిలో కొంతమంది మృతి చెందగా, మరికొంత మంది చేరడంతో సభ్యుల సంఖ్య మరో 10వేలా వరకు పెరిగి సుమారు లక్ష 15వేలాకు చెరింది. 


పరిమితి సంఘం యూనిట్‌గానే రిజర్వేషన్లు..

గతంలో లోకల్‌ ఎన్నికలకు సంబంధించి జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేవారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం జిల్లా యూనిట్‌గా, వార్డులు మండల యూనిట్‌గా తీసుకుని చేసేవారు. సహకార ఎన్నికలు కూడా గతంలో జిల్లా, డివిజన్‌ వారీగా చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా చైర్మన్‌కు ఏలాంటి రిజర్వేషన్‌ లేకుండా డైరెక్టర్లకు మాత్రమే రిజర్వేషన్లుగా చేశారు. ఇవి కూడా ప్రతి ప్రాథమిక వ్యవసాయ పరిమితి సంఘంలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించనున్నారు. ప్రతి సొసైటీలో 13 మంది డైరెక్టర్లు ఉండగా అందులో ఎస్టీ(జనరల్‌)కు ఒకటి, ఎస్సీకి రెండు(జనరల్‌, మహిళ), బీసీకి రెండు(జనరల్‌, మహిళ), మరోకటి జనరల్‌ మహిళకు, 7స్థానాలు జనరల్‌గా నిర్ణయించారు. డైరెక్టర్‌ నియోజకవర్గాల్లో ముందుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వారిగా రిజర్వేషన్లు చేస్తారు. ప్రతి సొసైటీకి ఆరుగురు కోఅప్షన్‌ సభ్యులను ఎంపిక చేసుకునే వీలు కల్పించారు. వీటిలో రెండు మైనార్టీలకు, మరో రెండు మహిళలకు, మిగతా రెండు ఇతరులకు కేటాయించారు. 


logo