బుధవారం 01 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 02, 2020 , 04:15:34

సమస్యలపై ఏకరువు..

సమస్యలపై ఏకరువు..
  • జడ్పీ సమావేశంలో అధికారుల పనితీరును ప్రశ్నించిన సభ్యులు
  • వ్యవసాయ మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు..450పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం
  • రెండు తీర్మానాలు ఆమోదించిన జడ్పీ సర్వసభ్య సమావేశం

నీలగిరి : అధికారుల పనితీరు, సమస్యలపై జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకరువు పెట్టారు. శనివారం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశం మందిరంలో చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్‌, గ్రామీణాభివృద్ధ్ది, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌ తదితర శాఖల అధికారుల పని తీరుపై సభ్యులు చర్చించారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో దళారులు రాజ్యమేలుతున్నారని పలువురు మండిపడ్డారు. టోకెన్ల ప్రకారంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు చెప్పగా టోకెన్లను సైతం మిల్లులు వద్ద అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దేవరకొండ, మల్లేపల్లి, నాంపల్లి, మర్రిగూడ, చండూర్‌ మండలాల్లోని సీసీఐ కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ లోపించిందని అన్నారు. మర్రిగూడ మండలంలోని ఓ మిల్లు వారంలో నాలుగు రోజులు మూసే ఉంటుందని అధికారుల దృష్టికి తెచ్చినా స్పందించడం లేదని జడ్పీటీసీ సభ్యులు పాశం సురేందర్‌రెడ్డి సభ దృష్టికి తెచ్చా రు. మిల్లు సామర్థ్యం తక్కువగా ఉండడం వల్లే ఇలా జరుగుతుందని వార్తలు వస్తున్నాయని అలాంటి వాటికి అనుమతులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.  చైర్మన్‌ కలుగజేసుకుని వచ్చే సీజన్‌ నుంచి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కోనుగోలు చేసేలా తీర్మానం చేద్దామని చెప్పడంతో శాంతించారు.


దేవరకొండ మండలంలో చాలా గ్రామాలకు తాగునీరు సరఫరా కావడం లేదని  జడ్పీటీసీ సభ్యురాలు ఆవేదన వ్యక్తం చేశా రు. అడవిదేవులపల్లి మండలంలో చాలా గ్రామాలకు కృష్ణ జలాలు సరఫరా కావడంలేదని ఏఈ ఎక్కడ ఉంటున్నాడో తెలియడం లేదని అతడిపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పెద్దవూర మండలంలోని గిరిజన తండాలకు తాగునీరు అందక ప్రజలు ఇబ్బం ది పడుతున్నారని నెలాఖరులోగా పనులన్నీంటిని పూర్తి చేసి వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులను కోరారు. గతంలో రైతుబంధు అందని రైతులకు ఈ సారి ఇస్తారా అని తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి డీడీని ప్రశ్నించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రబీలో యూరియా కొరత రాకుండా చూడాలని కోరారు. రైతు బీమాపై గ్రామా ల్లో అవగాహన కల్పించాలని సూచించారు.  సంక్షేమ హాస్టల్‌లో వార్డెన్లు అందుబాటులో ఉండడం లేదని.. మెనూ పాటించడం లేదని మునుగోడు, చండూరు జడ్పీటీసీ నారబోయిన స్వరుపారాణి, కర్నాటి వెంకటేశం పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పని చేయని వారికి ఇటీవల గణతంత్ర వేడుకల్లో అవార్డులు ఇచ్చారని ఎంపికలో జడ్పీటీసీలు, ఎంపీపీలకు ఎందు కు సమాచారం ఇవ్వలేదని పలువురు ప్రశ్నించారు. ఎంపికలు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రకారం జరిగాయ ని డీఆర్‌ర్డీఓ సమాధానం ఇచ్చినా వారు సంతృప్తి చెందక విచారణ జరుపాలని కోరారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌, కలెక్టర్‌ చంద్రశేఖర్‌ కలుగజేసుకుని విచారణ జరుపుతామని చెప్పారు. అనంతరం కరోనా వైరస్‌పై వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లను ఆవిష్కరించారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు ఇన్‌చార్జి సీఈఓ సీతాకుమారి, సభ్యులు వంగూరి లక్ష్మ య్య, తీగల జాన్‌శాస్త్రి, అధికారులు జి,జ్యోతి, కొండల్‌రావు, రాజ్‌కుమార్‌, శ్రీధర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, సంగీతలక్ష్మి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 


రెండు తీర్మానాలు ఆమోదం..

వచ్చే సీజన్‌ నుంచి పత్తి కొనుగోళ్లు సీసీఐ మిల్లుల్లో కాకుండా వ్యవసాయ మార్కెట్‌లోనే కొనుగోలు చేయాలి.

   వచ్చే ఆర్థ్ధిక సంవత్సరం నుంచి 450 పాఠశాలల్లో ఎల్‌కేజీ నుంచి ఇంగ్లీష్‌ మీడియం తరగతులు నిర్వహించాలి. 


logo
>>>>>>