ఆదివారం 29 మార్చి 2020
Nalgonda - Feb 01, 2020 , 02:50:35

నేటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు
  • నాలుగు విడుతల్లో 20వరకు నిర్వహణ
  • సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు
  • సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు
  • ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రం.. మార్కుల నమోదు 23,628 మంది విద్యార్థులు

నల్లగొండ విద్యావిభాగం : ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికాలు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి(ఫిబ్రవరి 1) నుంచి 20వరకు నాలుగు విడుతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 97పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 23,628మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక స్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలు సీసీ కెమెరాల నిఘా నీడలో ఉండనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 101 ఇంటర్మీడియట్‌ కళాశాలలు ఉండగా వీటిలో 2019-20 విద్యా సంవత్సరానికి 23,628 మంది విద్యార్థులు ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో జనరల్‌ విభాగంలో 75 పరీక్ష కేంద్రా ల్లో (ఎంపీసీ, బైపీసీ) ద్వితీయ సంవత్సరంలో 17,8 32 మంది అదే విధంగా ఓకేషన్‌ విభాగంలో 22 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరంలో 2,929, ద్వితీయ సం.లో 2,867 మంది పరీక్షలు రాయనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.


ఆన్‌లైన్లో ప్రశ్నాపత్రం.. 

ప్రాక్టికల్‌ పరీక్ష ప్రశ్నాపత్రం పరీక్ష జరిగే రోజే రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ ఆన్‌లైన్‌లో పంపుతుంది. ఆయా పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక పాస్‌వర్డు (ఓటీపీ) కేటాయిస్తుంది. దాని ఆధారంగా కళాశాల యాజమాన్యం ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని విద్యార్థులకు అందజేయాలి. పరీక్ష ముగియగానే అదేరోజు మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి. ఉదయం జరిగిన పరీక్ష మార్కులను మధ్యాహ్నం 12నుంచి 1:30లోపు, సాయంత్రం నిర్వహించిన పరీక్ష మార్కులను 5గం నుంచి 7గం.లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఆ తర్వాత నమోదు చేసేందుకు సర్వర్‌ పని చేయదు. దీంతో బోగస్‌ మార్కుల నమోదుకు అవకాశం ఉండదు. పరీక్షకు హాజరైన విద్యార్థుల పరిశీలనకు సీసీ ఫుటేజీలు అందుబాటులో ఉండటంతో పైలటింగ్‌కు అవకాశం ఉండదు. ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్స్‌గా ఇంటర్మీడియేట్‌ బోర్డే సీనియర్‌ అధ్యాపకులను నియమించింది. పరీక్షలు కేంద్రాల వద్ద 144సెక్షన్‌ అమలులో ఉండనుంది.


అధికారుల పర్యవేక్షణలో..

ప్రాక్టికల్‌ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారి పర్యవేక్షణలో ప్రత్యేకాధికారులను నియమించారు. పరీక్షల మానిటరింగ్‌ కమిటీ, ఫ్లయింగ్‌ స్కాడ్స్‌, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లు, డీఈసీ సభ్యులు, పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించనున్నారు. పరీక్ష జరిగిన రోజే అదేగదిలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్థులు సాధించిన మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.  ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులు ఆయా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 


నాలుగు విడుతల్లో పరీక్షలు..

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు నాలుగు విడుతల్లో జరుగనున్నాయి. తొలి విడుత ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు. రెండో విడుత  ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు, మూడో విడుత ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు, 4వ విడుత  ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయి. 


logo