గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 31, 2020 , 03:07:19

ఇక సహకార సమరం

ఇక సహకార సమరం

‘సహకార సంఘాలకు పర్సన్‌ ఇన్‌చార్జీల పదవీ కాలం ముగుస్తున్నందున ఎన్నికల నిర్వహణకు నాలుగు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయండి. 15రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయండి’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు సహకార శాఖ చర్యలు చేపట్టింది. గురువారం అన్ని జిల్లాల కోఆపరేటివ్‌ అధికారులతో ఆ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి.. ఆ వెంటనే ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఫిబ్రవరి 15న జిల్లాలోని 42ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. జిల్లాలో మొత్తం 43పీఏసీఎస్‌లున్నా.. 2021వరకు కట్టంగూర్‌(గడువు ఉంది) మినహా 42పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరుగనున్నాయి. 42ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 1,07,391మంది సభ్యులకు ఓటు హక్కుంది. వరుస ఎన్నికల్తో సత్తా చాటుతున్న టీఆర్‌ఎస్‌.. సహకార ఎన్నికల్లోనూ అదే వ్యూహరచన చేస్తోంది.

  • ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌.. 6,7,8 తేదీల్లో నామినేషన్లు
  • 9న పరిశీలన.. 10వరకు ఉపసంహరణ గడువు
  • 15న పోలింగ్‌.. అదే రోజు మధ్యాహ్నం లెక్కింపు
  • 42పాత పీఏసీఎస్‌లకు మాత్రమే ఎన్నికల నోటిఫికేషన్‌
  • షెడ్యూల్‌ విడుదల చేసిన రాష్ట్ర సహకార ఎన్నికల విభాగం
  • జిల్లాలోని 42పీఏసీఎస్‌ల పరిధిలో 1,07,391 ఓటర్లు

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : 2018డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు.. 2019జనవరిలో పంచాయతీ ఎన్నికలు.. 2019మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌లో వరుసగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పార్లమెంట్‌.. ఆ వెంటనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ.. తాజాగా ముగుస్తున్న 2020జనవరిలో మున్సిపాలిటీ ఎన్నికలు.. ఇలా ఏడాది నుంచి ఎన్నికల సందడే ఆవహించిన జిల్లాలో తాజాగా సహకార ఎన్నికల నగారా మోగింది. పునర్విభజిత నల్లగొండ జిల్లాలో పూర్వం నుంచీ 43ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా.. కట్టంగూర్‌ మినహా 42పీఏసీఎస్‌లకు ఫిబ్రవరి 15న ఎన్నికలు జరుగనున్నాయి. 


ఇందుకోసం ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 6, 7, 8 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 9న పరిశీలన, 10వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంటుంది. ఫిబ్రవరి 15న ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయా పీఏసీఎస్‌ కేంద్రాల్లో పోలింగ్‌ అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికలు జరుగనున్న 42పీఏసీఎస్‌ల పరిధిలో మొత్తం 1,07,931మంది సభ్యులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. 2018లోనే పీఏసీఎస్‌ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. 2019 జనవరిలోనే ఎన్నికల నిర్వహణకు సహకార శాఖ ఏర్పాట్లు చేపట్టింది. వరుస ఎన్నికలతో నిర్వహణ సాధ్యపడలేదు. 


తాజాగా బుధవారం సీఎం కేసీఆర్‌.. నాలుగు రోజుల్లోనే సహకార సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని.. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో సహకార శాఖ వెను వెంటనే చర్యలు చేపట్టి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆయా పీఏసీఎస్‌లలో రైతుల సంఖ్య, స్థాయిని బట్టి డైరెక్టర్ల సంఖ్య ఉండగా.. ఎన్నికలు నిర్వహించి డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. గెలిచిన డైరెక్టర్లను తమలో ఇద్దరిని చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఉమ్మడి నల్లగొండ నుంచి కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటైనా.. ప్రస్తుతానికి డీసీసీబీ మాత్రం ఉమ్మడిగానే కొనసాగనుంది. కొత్త డీసీసీబీల ఏర్పాటుకు ఆర్బీఐ అనుమతి అవసరం ఉన్న నేపథ్యంలో.. ఇప్పట్లో ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం లేనందున పీఏసీఎస్‌ల ఎన్నికలు జిల్లాల వారీగా నిర్వహించినా.. ఆయా పీఏసీఎస్‌ల నుంచే ఉమ్మడిగా డీసీసీబీ కార్యవర్గం ఎన్నుకోనున్నారు. 


రాజకీయ పక్షాల కసరత్తు ..

సహకార ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో పీఏసీఎస్‌ పదవులపై రాజకీయ పక్షాలు దృష్టి సారించాయి. రైతు పక్షపాతిగా పని చేస్తూ.. రైతాంగం కోసం రైతు బంధు, రైతు బీమా సహా మరెన్నో కార్యక్రమాలు చేపడుతున్న తమ వైపే సహకార సంఘాల సభ్యులు మొగ్గు చూపుతారనే అంచనాల్లో టీఆర్‌ఎస్‌ నేతలున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లో పలు పదవులు ఆశించిన వారిని.. తాజాగా పీఏసీఎస్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, డైరెక్టర్ల పదవులతో సంతృప్తి పరిచేందుకు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఆలోచిస్తున్నారు. 


తమకూ ఎంతో కొంత మేర విజయావకాశాలు ఉంటాయనే అంచనాతో కాంగ్రెస్‌ సహా ఇతర రాజకీయ పక్షాలూ వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. పునర్విభజిత నల్లగొండ జిల్లాలో ఉన్న 43పీఏసీఎస్‌లకు అదనంగా.. ఇటీవలే సహకారశాఖ మరో 25పీఏసీఎస్‌లను ఏర్పా టు చేసింది. ప్రతీ మండలంలో కనీసం రెండు పీఏసీఎస్‌లు తగ్గకుండా ఉండేలా.. రైతులకు సహకార సేవ లు మరింత చేరువ చేసే విధంగా చర్యలు చేపట్టింది. అయినా.. ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో.. ఆయా నూతన సొసైటీలకు చట్ట పరమైన రిజిస్ట్రేషన్లు పూర్తి కానందున ప్రస్తుతానికి పాత పీఏసీఎస్‌లకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. 


logo