బుధవారం 08 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 31, 2020 , 03:04:27

గాలికుంటు నివారణే లక్ష్యంగా..

గాలికుంటు నివారణే లక్ష్యంగా..

పశు సంపదపై తీవ్ర ప్రభావం చూపే గాలికుంటు వ్యాధి నివారణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సర్కారు ఆదేశాల మేరకు పశుసంవర్ధకశాఖ యంత్రాంగం జిల్లాలో ఫిబ్రవరి 1నుంచి మార్చి 15 వరకు స్పెషల్‌ డ్రైవ్‌ ప్రణాళిక సిద్ధం చేసింది. వ్యాధి నిరోధక టీకాలు వేయడానికి 530 మంది సిబ్బంది 136బృందాలుగా పనిచేయనున్నారు.గ్రామాల్లో పశువులకు వ్యాక్సిన్లు వేయడంతో పాటు ట్యాగింగ్‌ చేసి వాటి ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. జిల్లాలో 4.12 లక్షల మూగజీవాలుండగా.. ప్రతి పశువుకు హెల్త్‌కార్డును జారీ చేయనున్నారు.

  • పశువుల్లో వ్యాధి నిరోధానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
  • రేపటి నుంచి మార్చి 15వరకు స్పెషల్‌ డ్రైవ్‌
  • గ్రామాల్లో పశువులకు టీకాలు వేయనున్న యంత్రాంగం
  • ప్రతి పశువుకు ట్యాగింగ్‌, అన్‌లైన్‌లో నమోదు, హెల్త్‌కార్డు జారీ
  • జిల్లా వ్యాప్తంగా 136 బృందాలు 530 మంది సిబ్బంది సిద్ధం

నీలగిరి : వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడిరంగం అత్యంత ప్రధానమైంది. ఈ రంగంపై నేడు జిల్లాలో అనేకమంది ఆధారపడి జీవిస్తున్నారు. పశువుల్లో అంతర్భాగమైన ఆవులు, బర్రెలు, దూడలు, ఎద్దులు వ్యవసాయానికి ఉపయోగపడడంతోపాటు పాల రూపేణ రైతులకు ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. గాలికుంటు వ్యాధి ముప్పు కారణంగా వ్యాధిసోకి మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. ఏటా ఈ తరహా మరణాలు కొంత మేరకు ఉండడంతో ఈసారి అలాంటి నష్టం జరగవద్దని ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించింది. జిల్లాలోని అన్నిగ్రామాల్లో 30రోజుల పాటు ఆశాఖ యంత్రాంగం పర్యటించి పశువులకు టీకాలు వేసి వ్యాధి నియంత్రణ చర్యలు చేపడుతుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా అన్ని మూగజీవాల్లో రోగాల నివారణకు ఎన్‌ఏడీసీపీ (నేషనల్‌ ఎనిమల్‌ డీసీస్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం) పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ఐదు సంవత్సరాలుగా జిల్లాలో గాలికుంటు వ్యాధి నమోదు కాకపోవడం గమనార్హం.


జిల్లాలో 136 బృందాలు... 30 రోజులు

జిల్లాలోని 31 మండలాలు.. 848 గ్రామాలు... వాటి పరిధిలోని ఆవాసాల్లో ఉన్న పశువులను గుర్తించి గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా 136 బృందాలను ఏర్పాటు చేసి ఆ యంత్రాంగం ఒక్కో బృందంలో నలుగురు చొప్పున 530మంది సిబ్బంది ఆయా గ్రామాల్లో పర్యటించనున్నారు. సిబ్బందికి సంబంధించి 5శాతం అదనంగా సిబ్బందిని కూడా కేటాయించారు. ఇందులో 250మంది పశుసంవర్ధక శాఖ సిబ్బంది, 105గోపాల మిత్రలు, డీఆర్‌డీఏ ద్వారా శిక్షణ పొందిన 92మంది పశువుల మిత్రలను వినియోగించనున్నారు. వీరుకాకుండా దేవరకొండ, కొండమల్లేపల్లిలో ఇంటర్మీడియట్‌లో ఒకేషనల్‌ గ్రూపులకు చెందిన 60మంది విద్యార్థులను కూడా ఉపయోగించనున్నారు. ప్రతి బృందంలో చెవు ట్యాగింగ్‌, వ్యాక్సిన్‌ వేయడం, డేటా అన్‌లైన్‌ చేయడం, మరొకరు సహయకులుగా ఉంటారు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 వరకు (సెలవులు మినహాయింపు) నెల రోజులపాటు ఈ స్పెషల్‌ డ్రైవ్‌ ఉన్నందున ముందురోజు సంబంధిత గ్రామ కార్యదర్శిచే డప్పుచాటింపు వేయించి రైతుల దృష్టికి తీసుకెళ్లనున్నారు.


    గాలికుంటు వ్యాధి లక్షణాలు..

గాలికుంటువ్యాధి సహజంగా పశువుల్లో సోకేటువంటిది. పశువుల్లో  ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తుగా గుర్తించి నివారణ చర్యలు చేపడితే వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అధిక జ్వరం(104-106 డిగ్రీలు) రావడంతోపాటు నోట్లో, కాలిగిట్టలో బొబ్బలు ఏర్పడి 24గంటల్లో అవి చితికిపోయి పొక్కులు లేదా పుండ్లు పుడతాయి. ఈ నొప్పుల వలన మేత, నీరు తీసుకోకుండా నీరసించి పశువు చనిపోతుంది. వ్యాధి సోకిన పశువుల పాలు తాగితే దూడలు సైతం మరణిస్తాయి. ఆంబోతులు, దున్నలు, గొర్రెలు, మేకలు, పందుల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఈ వ్యాధి సోకిన జీవం నుంచి 60కి.మీ. పరిధిలో ఉన్న వాటికి సైతం వ్యాపిస్తోంది.


    వ్యాధి నిర్మూలనపై సర్కారు దృష్టి...

పశువుల్లో గాలికుంటు వ్యాధి సోకడం వల్ల అవి మృత్యువాత పడతాయి. ఈనేపధ్యంలో రైతులు ఆర్థికంగా నష్టపోవడంతోపాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పైన దెబ్బపడుతుంది. జిల్లాలో ఈవ్యాధి నివారణకు 21సార్లు ఈ టీకాలను వేశారు. త్వరలో అంతర్జాతీయ సంస్థ (ఓఐఈ) ద్వారా గాలికుంటు రహిత రాష్ట్రంగా ప్రకటింప చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఈసారి వందశాతం పశువులకు టీకాలు వేయాలని అధికారులను ఆదేశించింది. ఇప్పటికే మన రాష్ట్రం నుంచి చీడపారుడు (ముసర వ్యాధి) అనే వ్యాధిని పూర్తిగా నిర్మూలించినందున ఇక గాలికుంటు వ్యాధినే పారదోలాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉచితంగా టీకాలు వేయిస్తోంది.


      పశువుల వివరాలు అన్‌లైన్‌లో...

గతంలో కేవలం వ్యాక్సిన్‌లు, టీకాలు వేసి కొమ్ములకు రంగులు వేసి చేతులు దులుపుకునేవారు. కానీ ఈ సంవత్సరం నుంచి అలా మూస పద్దతిలో కాకుండా పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వ్యాక్సిన్‌, టీకాలు వేసిన ప్రతి పశువుకు చెవికి పోగులు పెట్టడం (ట్యాగ్‌ చేయడం)తోపాటు దాని యొక్క వివరాలు INAPH అనే వెబ్‌సైట్‌లో నమోదు చేయనున్నారు. ఇక నుంచి చెవికి పోగులు ఉన్న పశువును మాత్రమే అమ్మకం, కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు.


ప్రతి పశువుకు టీకా వేయించాలి

ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 వరకు (సెలవుల దినాలు మినహాయింపు) 30 రోజులపాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని పశువులకు టీకాలు ఉచితంగా వేయడానికి అధికారులు వస్తున్నారు. పశువులు సుడితో ఉన్న, పాలు ఇస్తున్న కూడా టీకాలు వేయించవచ్చు. ఈ టీకాలను రైతులు నిర్లక్ష్యం చేస్తే అవి మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. ఆవులు, బర్రెలు, దూడలు, ఎద్దులకు జ్వరం వచ్చి నోట్లో, కాలి డెక్కల్లో పుండ్లు పుట్టినా... మేత తినకపోయినా వెంటనే మా వైద్య బృందానికి చూపించి చికిత్స చేయించుకోవాలి.  

-డా. వి.శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి


logo