బుధవారం 08 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 30, 2020 , 04:12:40

భయం వీడితే జయం మీదే..

 భయం వీడితే జయం మీదే..

ప్రతి విద్యార్థీ తన జీవితంలో ఎదుర్కొనే తొలి పబ్లిక్‌ పరీక్ష పదోతరగతిలోనే కావడంతో సహజంగానే వారిలో భయాందోళనలు ఉంటాయి. ఇలాంటి సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురి కావొద్దని, ప్రశాం తంగా చదివి పరీక్షలు రాస్తేనే మంచి మార్కులొస్తా యని మానసిక విశ్లేషకులు అంటున్నారు. వారి శకి ్తసామర్థ్యాలను బట్టి ఈ దిశగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సాహించాలని, లేకుంటే మానసిక సమస్యలు చుట్టుముడతాయని వారు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు గతంలో సాధించిన విజయాలతో ప్రేరణ పొందుతూ ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని దూరం చేసుకొని స్వీయ ప్రేరణ చేసుకోవాలి.

  • మార్చి 19 నుంచి పదోతరగతి పరీక్షలు
  • ఒత్తిడిని జయిస్తేనే విజయం సాధ్యం
  • ఆందోళన వద్దు.. ఆత్మవిశ్వాసమే ముద్దు

ఆందోళన వద్దు 

భౌతికశాస్త్రం, గణితశాస్ర్తాలు కఠినమైనవని పదే పదే భావిస్తూ ఆందోళన, అనుమానాలకు గురి కావద్దు. వాటిపై ఏకాగ్రత ఉంచి చక్కని  ప్రణాళికతో కీలక భావనలు, ముఖ్యాంశాలు చదువుతూ  కొంచెం ఎక్కువ సమయం కేటాయిస్తూ  కృషిచేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. నెగిటేవ్‌ ఆలోచనలను, భయాన్ని మెదడులోకి చేరనీయవద్దు. 


స్టడీ టైం.. 

 కొంతమంది  విద్యార్థులు పగలు టీవీ చూస్తూ లేక కబుర్లతో కాలక్షేపం చేసి రాత్రంతా చదువుతారు.  ఇది సరైంది కాదు.   అనవసర విషయాలు, సీరియళ్లు, సినిమాలపై శ్రద్ధ పెట్టకుండా రాత్రి 10 గంటల వరకు చదువుకొని, మళ్లీ తెల్లవారుజాము 4 గంటలకే లేచి  7 గంటల వరకు చదివితే బాగా గుర్తుంటుంది. ఈ సమయంలో నిస్సల్‌ కణికలు, ఉత్సాహంగా ఉండి మెదడు విషయాన్ని త్వరగా స్వీకరిస్తుందని మనోవిజ్ఞానశాస్త్రం వివరిస్తుంది. ఈ సమయంలో 3 గంటల చదువు- ఆరుగంటల చదువుతో సమానం. ఆ సమయంలో మెదడు ‘ఆల్ఫాస్థితిలో ఉండి, పూర్తిస్థాయి అవగాహన, సృజనాత్మకంగా పనిచేస్తుంది కాబట్టి ఈ సమయాన్ని వృథా చేయొద్దు.  


సమతుల్య వాతావణం 

స్టడీరూమ్‌లోని వాతావరణం సమతుల్యంగా ఉంచుకోవాలి. అంటే గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉండాలి. టేబుల్‌లాంప్‌ దగ్గర చదివితే ఏకాగ్రత పెరుగుతుంది. భయం, ఆందోళనలు తగ్గుతాయి. అలాగే గదిలో క్రికెటర్లు, సినిమా తారల పోస్టర్లు పెట్టొద్దు. అంతేకాకుండా టీవీ సౌండ్‌, సెల్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌కు దూరంగా ఉండాలి. 40-50 నిమిషాల చదివాక విరామం ఇవ్వండి. లేచి కొద్దిసేపు అటుఇటూ నడవండి. దీనివల్ల  మెదడుకి రక్త ప్రసరణ జరుగుతుంది. మెదడుకు విశ్రాంతినివ్వడమే స్వల్పకాలిక విరామ ఉద్దేశ్యం. 


వ్యాయామం చేయాలి.. 

శారీరక వ్యాయామం, నడక, ఆటల వల్ల ఆందోళన, భయం, ఒత్తిడి తగ్గుతాయి. బ్రీతింగ్‌ వ్యాయామం, ప్రాణాయానాలు, ధ్యానం, పాజిటీవ్‌ సజీషన్స్‌ ఆందోళనలను దూరం చేస్తాయి. ఉదయిస్తున్న సూర్యుడు, వికసిస్తున్న పూలు, ఆడుకుంటున్న పిల్లలు, చల్లగాలి, ఆత్మీయులతో ముచ్చట్లు, ఆహ్లాదకర సంగీతం, కామెడీ కథలు ఒత్తిడిని తగ్గిస్తాయి. 


నిద్ర- దివ్య ఔషధం.. 

ఎవరికైనా ఆహారం లాగానే నిద్ర కూడా చాలా అవసరం. ప్రణాళికతో చదువుతూ, విసుగులేకుండా కనీసం 6 గంటలు నిద్రవల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి, చదువుకూ, ఏకాగ్రతకు మంచిది. ప్రతిరోజూ ఒక నిర్ధిష్టమైన సమయానికి నిద్రను అలవాటు చేసుకోవాలి. నిద్రలేమి వల్ల అలసటకు లోనై ఆలోచనలు బలహీనపడతాయి.  కావున ‘నిద్ర- దివ్యౌషధం’లా పని చేస్తుంది. 


భావోద్వేగాల నియంత్రణ.. 

హార్మోన్ల ప్రభావం వల్ల విద్యార్థుల్లో గౌణ లక్షణాలు, పరస్పర అకర్షణలు, అపరాధ భావన, స్వైర కల్పన,  భావోద్వేగాలు సంఘర్షణల వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. సెల్‌ఫోన్‌లో కబుర్లు చెప్పడం, ఒంటరిగా ఉండాలనుకోవడం, ఊహల్లో విహరించడం, లైంగిక భావనలు, ఆకర్షణల ప్రాధాన్యత తగ్గించటానికి కౌన్సిలర్స్‌, ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల సూచనలను పాటిస్తూ, ఒత్తిడిని తొలగించుకోవాలి. 


ఇలాచేస్తే ఒత్తిడి దూరం.. 

చదివిన దాన్ని పునఃశ్చరణ (రివిజన్‌) చేసుకోవడం ద్వారా ఒత్తిడి దూరమవుతుంది. 

జంక్‌ఫుడ్‌, నాన్‌-వెజిటేరియన్‌, నూనె వస్తువులు అతిగా తినకుండా పోషక విలువలున్న పండ్లు, కూరగాయలు, రసాలు తీసుకోవాలి. దీనిద్వారా ఆరోగ్యంగా ఉండి, ఆందోళన దూరమవుతుంది. 

ర్యాంక్‌,  పోటీదారుల గురించి ఆలోచించడం మాని నిత్యం కృషిచేస్తూ, సరైన ధ్యాసతో చదివి పరీక్ష రాయాలి.

ఆత్మవిశ్వాసానికి వ్యతిరేకం భయం. ఇది కేవలం ఊహ మాత్రమే. భయం విషయంలో ఉన్న సున్నితత్వాన్ని పొగొట్టుకొని మానసికంగా దృఢంగా మారాలి. 

చదివిన విషయాన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో కలిసి లోతుగా చర్చించుకోవడం ద్వారా సీసీఈ విధానంలో ప్రశ్నలకు తార్కికంగా సమాధానాలు రాయొచ్చు. 


పదికి ‘పది’ సాధనకు ప్రత్యేక శ్రద్ధ

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఉపాధ్యాయుల కృషి

నేరేడుచర్ల : పదో తరగతిలో విద్యార్థులు మంచి మార్కులు సాధించడానికి విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతుంది.  విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపి వారి నడవడికలో మార్పు తెచ్చి, భవిష్యత్‌ను బంగారుమయం చేసి వారిని విజయతీరాలకు చేరవేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించాలనే ధృక్పథంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. గత ఫలితాల కన్నా ఈ సారి మరింత మెరుగ్గా సాధించాలనే లక్ష్యంతో అదనపు తగరతులు, టెస్ట్‌లు, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. 


మార్చి 19వ తేదీ నుంచి జరిగే వార్షిక పరీక్షలకు ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తున్నారు. సిలబస్‌ ముగించగా, ముఖ్యమైన, విభాగాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఉపాధ్యాయులు, ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి పాఠశాలలో ఉదయం 8:45 నుంచి 9:45 వరకు, సాయంత్ర గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు చెప్పిన సబ్జెక్టుపై తిరిగి విద్యార్థులు తమకు అర్థమైన విధం గా విశ్లేషణ చేస్తున్నారు. వారం వారం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సారి 100శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. 


ప్రశాంతంగా చదివితే విజయం తథ్యం 

విద్యార్థులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పరీక్షలనేవి కొత్తకాదు, గతంలో కూడా ఇలాంటి పరీక్షలు ఎన్నో రాసి విజయం సాధించామని గ్రహించాలి. గతంలో సాధించిన విజయాల ద్వారా ప్రేరణ పొందుతూ విశ్వాసంతో ముందుకు సాగాలి. ఇది మనోవిజ్ఞానశాస్త్రంలో ముఖ్యమైన విషయం. ఈ సూత్రం నిత్యం స్మరిస్తూ ఒత్తిడి ఆందోళనలను దూరం చేసుకొని, స్వీయ ప్రేరణ చేసుకోవాలి. ప్రతిచిన్న విషయానికి  బాధ,  ఆందోళన చెందకుండా, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవటం ద్వారా  విజయం సాధించవచ్చు. 

- చారుగుండ్ల రాజశేఖర్‌, మానసిక విశ్లేషకుడు, కోదాడ


logo