మంగళవారం 07 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 30, 2020 , 04:09:35

ఇంటింటికి ఇంకుడు గుంత

ఇంటింటికి ఇంకుడు గుంత
  • నూరు శాతం నిర్మాణానికి 330మంది సర్పంచ్‌లు సిద్ధం
  • మొదటగా ఆయా గ్రామాల్లో 1.10లక్షల గుంతల నిర్మాణం
  • ఒక్కో గుంతకు కూలీ, సామగ్రి కలిపి రూ.4500వ్యయం
  • మహిళా సంఘాల భాగస్వామ్యంతో పనులు వేగవంతం
  • ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేసేలా అధికారుల చర్యలు

నల్లగొండ, నమస్తే తెలంగాణ:  పల్లెలను పట్టు సీమలుగా మార్చాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్‌ చట్టంలో భాగంగా చేపడుతున్నటువంటి పలు పథకాలను క్రమంగా అమలు చేస్తోంది. తొలి దశలో గ్రామాలను శుభ్రంగా మార్చుతూ పారిశుధ్యంపై దృష్టి సారించిన సర్కార్‌ ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌ ఏర్పాటు, డంపింగ్‌యార్డు, శ్మశాన వాటిక, నర్సరీలను తప్పనిసరిగా చేసింది. అందులో భాగంగానే ఇంకుడు గుంతలపై దృష్టి సారించి ఇంట్లో నుంచి వచ్చే మురుగు బయటకు రాకుండా భూమిలోకి పంపాలనే ఉద్దేశంతో ఈ గుంతలను నిర్మించ తలపెట్టింది. ఈనెల 2నుంచి 11 వరకు జరిగినటువంటి పల్లె ప్రణాళికలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని తప్పనిసరిగా చేసిన నేపథ్యంలో ఆ దిశగా అధికార యంత్రాంగం అందర్ని అవగాహన పరిచి గ్రామీణాభివృద్ధ్ది శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తోంది. 


ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించే  దిశగా...

ఇంట్లో నుంచి బయటకు వెళ్లే మురుగు వీధుల్లోకి వచ్చి వీధులన్నీ అపరిశుభ్రం గాకుండా ఉండటానికి ప్రతి ఇంటి పరిసరాల్లోనే ఇంకుడు గుంతలను నిర్మించి ఆ నీరును అందులోకి పంపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంకుడుగుంతల నిర్మాణాన్ని చేపడుతోంది. పల్లె ప్రణాళికలో భాగంగా రెండో దశలో వీటిపై దృష్టి సారించి ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలని అధికారులు ఆయా గ్రా మాల్లో ప్రజలను అవగాహన పరిచారు. ఈనెల 2 నుంచి 11వరకు జిల్లా వ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీల్లో జరిగినటువంటి పల్లె ప్రణాళికలో ఇంటింటి సర్వే సైతం చేపట్టారు. ఇంకుడు గుంతల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో ఆసక్తి కలిగిన వారు ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డు అసిస్టెంట్లకు దరఖాస్తులు అందజేస్తున్నారు. 


వంద శాతం చేపడతామని  సర్పంచుల లేఖలు...

జిల్లాలో 844 గ్రామ పంచాయతీలుండగా ఆయా గ్రామ పంచాయతీల్లో 300 మంది సర్పంచులు తమ గ్రామాల్లో వంద శాతం ఇంకుడు గుంతలు నిర్మిస్తామని ముందుకు వచ్చి రాత పూర్వకంగా జిల్లా గ్రామీణాభివృద్ధ్ది శాఖ యంత్రాంగానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆశాఖ యంత్రాంగం ఆయా గ్రామాల్లో 1.10 లక్షల ఇంకుడు గుంతలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి లోపు వీటిని పూర్తి చేయాలని భావించి ఇప్పటికే 8600 ఇంకుడు గుంతలను నిర్మించారు. ప్రధానంగా మహిళా సంఘాల భాగస్వామ్యంతో గ్రామస్తులను అవగాహన పరిచి వీటిని నిర్మిస్తోంది. తొలుత ఈ 300 గ్రామాల్లో ఇంకుడు గుంతలు పూర్తయిన అనంతరం మార్చి నుంచి మిగిలిన గ్రామాల్లో చేపట్టేలా చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా గ్రామీణాభివృద్ధ్ది శాఖ యంత్రాంగం కింది స్థాయిలో సమీక్షిస్తు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. 


ఒక్కో గుంతకు రూ.4500

ఇంటి ముందు లబ్ధిదారులు నిర్మించుకునేటువంటి ఇంకుడు గుంతలకు ప్రభుత్వమే నిధులు అందజేస్తోంది. ప్రతి గుంతకు రూ.4500 కేటాయించింది. ఇందులో రూ.800 ఉపాధి హామీ పథకం కింద కూలీలకు వేతనం చెల్లించనుండగా రూ.3700 విలువైన మెటీరియల్‌ను అందజేయనున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద ఈ నిధులు లబ్ధిదారులకు అందనున్నాయి. స్థానిక ఫీల్డు అసిస్టెంట్లు, ఇంకుడు గుంతల నిర్మాణానికి సంబంధించి మహిళా సంఘాల సహకారంతో వేగవంతం చేస్తున్నారు. 4 ఫీట్ల వెడల్పు, 4 ఫీట్ల పొడవుతో ఈ ఇంకుడు గుంతను నిర్మించనున్నారు. కింది భాగంలో 255 ఎంఎం బెందడిగా పోసి 65 ఎంఎం కంకర పోసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పై భాగంలో 20ఎంఎం సన్నకంకర మధ్యలో గోళెం అమర్చుతారు. ఇంట్లో నుంచి వచ్చే మురుగు ఆ పైపు ద్వారా వచ్చి ఆ గోళెంలోకి వెళ్లి ఆ గుంతలో ఇంకిపోతుంది. ఫిబ్రవరి 1 నాటికి 1.10 లక్షల ఇంకుడు గుంతల నిర్మాణం

-శేఖర్‌రెడ్డి, డీఆర్‌డీఓ

ఫిబ్రవరి చివరి నాటికి సర్పంచ్‌లు లేఖలు ఇచ్చిన 300 గ్రా మాల్లో 1.10 లక్షల ఇంకుడు గుంతలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం 8600 ఇంకుడు గుంతలు పూర్తి చేశాం. మిగిలినవి మహిళా సంఘాల భాగస్వామ్యంతో వేగవంతం చే స్తున్నాం. పల్లె ప్రణాళికలో భాగంగా రెండో దశలో ఈ కార్యక్రమాన్ని తీసుకునివాటిని నిర్మించే విధంగా చర్యలు చేపట్టాం. 


logo