మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Jan 28, 2020 , 01:53:10

స్వాతంత్య్ర సమరయోధుడు తిరునగరు గంగాధర్‌ మృతి

స్వాతంత్య్ర సమరయోధుడు తిరునగరు గంగాధర్‌ మృతి

మిర్యాలగూడ టౌన్‌ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఆర్యవైశ్య సంఘం నాయకుడు తిరునగరు గంగాధర్‌ (87) సోమవారం  హైదరాబాద్‌లో కన్నుమూశారు. టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు, మిర్యాలగూడ మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగర్‌ భార్గవ్‌ తండ్రి గంగాధర్‌, మున్సిపల్‌ ఎన్నికల ముందు అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. సోమవారం భార్గవ్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన కొంతసేపటికే తండ్రి గంగాధర్‌ మరణవార్త తెలిసి హుటాహుటిన కుటుంబ సమేతంగా హైదరాబాద్‌కు వెళ్లారు. యువకుడిగా ఉన్నప్పుడు ఐదేళ్లపాటు మిలటరీలో పనిచేసిన గంగాధర్‌ స్వాతంత్ర సమరయోధుడిగా, మిర్యాలగూడ గ్రామ సర్పంచ్‌గా, మిర్యాలగూడ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సేవలందించాడు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున నల్లగొండ ఎంపీగా, మిర్యాలగూడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ గెలవలేదు. మిర్యాలగూడ ప్రాంత ఆర్యవైశ్యులతోపాటు అన్నివర్గాల ప్రజలు పెద్దాయన అని పిలుచుకునే గంగాధర్‌ మృతి తీరని లోటని, మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు అంత్యక్రియలు చేపడుతున్నట్లు ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు తెడ్ల జవహర్‌బాబు తెలిపారు. 

గంగాధర్‌ సేవలు చిరస్మరణీయం  : మంత్రి జగదీశ్‌రెడ్డి

తిరునగరు గంగాధర్‌ మృతి పట్ల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మిర్యాలగూడ మున్సిపల్‌ చైర్మన్‌గా గంగాధర్‌ తనయుడు భార్గవ్‌ ప్రమాణస్వీకారం రోజునే ఆయన మృతిచెందడం చాలా బాధాకరమన్నారు. మున్సిపాలిటీ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నల్లగొండ లోకసభకు పోటీ చేయడం ద్వారా ఉన్నతస్థాయికి చేరుకున్నారని మంత్రి కొనియాడారు. 


logo
>>>>>>