సోమవారం 06 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 28, 2020 , 01:51:33

దేవరకొండ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవం

దేవరకొండ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవం

దేవరకొండ, నమస్తేతెలంగాణ : దేవరకొండ మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. మున్సిపల్‌ చైర్మన్‌గా ఆలంపల్లి నర్సింహ, వైస్‌ చైర్మన్‌గా ఎండీ రహత్‌ అలీ ప్రమాణస్వీకారం చేశారు. దేవరకొండ మున్సిపాలిటీలో 20వార్డులకు గాను 11వార్డుల్లో టీఆర్‌ఎస్‌, 4 వార్డుల్లో కాంగ్రెస్‌, 3 వార్డుల్లో బీజేపీ, రెండు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పటికే ఓ ఇండిపెండెంట్‌ అభ్యర్థితోపాటు 2వ వార్డుకు చెందిన కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ టీఆర్‌ఎస్‌ గూటికి చేరడంతో మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ బలం 13కు చేరింది. సోమవారం దేవరకొండ మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి, దేవరకొండ ఆర్డీఓ గుగులోతు లింగ్యానాయక్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులందరూ పాల్గొనగా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ ఎక్స్‌అఫిషియో సభ్యునిగా హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలో కౌన్సిలర్లకు విప్‌ జారీచేశాయి. అయితే కాంగ్రెస్‌ సభ్యులకు జారీ చేసిన విప్‌లో ప్రతిపాదితుని పేరు లేకపోవడంతోపాటు ఫాం బీని సమర్పించకపోవడంతో విప్‌ చెల్లదని ప్రిసైడిండ్‌ అధికారి ప్రకటించారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ఆలంపల్లి నర్సింహ పేరును 5వ వార్డు కౌన్సిలర్‌ వడ్త్య దేవేందర్‌ ప్రతిపాదించగా, 17వ వార్డు కౌన్సిలర్‌ చిత్రం శ్రీవాణి బలపరిచింది. అదేవిధంగా మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా ఎండి రహత్‌ అలీని 4వ వార్డు కౌన్సిలర్‌ ఎండి రయిస్‌ ప్రతిపాదించగా, 1వ వార్డు కౌన్సిలర్‌ పొన్నబోయిన భూదేవి సైదులు బలపర్చింది. పోటీలో ఎవరూ లేకపోవడంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక ఏకగ్రీవమైంది.

ఫిఫ్టీ - ఫిఫ్టీ ఫార్ములా.. 

దేవరకొండ మున్సిపాలిటీలో 9వ వార్డు కౌన్సిలర్‌ హన్మంతు వెంకటేశ్‌ గౌడ్‌, 16వ వార్డు కౌన్సిలర్‌ ఆలంపల్లి నర్సింహలు చైర్మన్‌ పీఠం కోసం పోటీ పడ్డారు. అధిష్టానం ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను అమలుచేయడంతో తొలి రెండున్నర సంవత్సరాలు చైర్మన్‌గా ఆలంపల్లి నర్సింహ, చివరి రెండున్నర సంవత్సరాలు హన్మంతు వెంకటేశ్‌ గౌడ్‌ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.


logo