శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 28, 2020 , 01:44:51

‘నీలగిరి’ పీఠం టీఆర్‌ఎస్‌ కైవసం

‘నీలగిరి’ పీఠం టీఆర్‌ఎస్‌ కైవసం

నల్లగొండ, నమస్తే తెలంగాణ : నల్లగొండ మున్సిపల్‌ పీఠం టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. 48కౌన్సిలర్లకు గాను 20కౌన్సిలర్లు ఆ పార్టీ గెలుచుకోగా మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా ఎంఐఎం, ఇండిపెండెంట్‌ అభ్యర్థులతోపాటు ఐదుగురు ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిసి నూతన చైర్మన్‌ను ఎన్నుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ 17వ వార్డు కౌన్సిలర్‌ మందడి సైదిరెడ్డిని మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అనంతరం సైదిరెడ్డితో ఆర్డీఓ, ఎన్నికల అధికారి జగదీశ్వర్‌రెడ్డి చైర్మన్‌గా పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవికి సంబంధించి ఎన్నిక కాకపోవడంతో నేటికి వాయిదా వేస్తున్నట్లు ఆర్డీఓ ప్రకటించారు. ఈ ఎన్నికలో 17వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీచేసి విజయం సాధించిన సైదిరెడ్డిని చైర్మన్‌గా ప్రకటిస్తూ ఖయ్యూంబేగ్‌ ప్రతిపాదించగా 12వ వార్డు కౌన్సిలర్‌ అభిమన్యు శ్రీనివాస్‌ బలపరిచారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి బుర్రి శ్రీనివాస్‌రెడ్డిని చైర్మన్‌ అభ్యర్థిగా మహబూబ్‌ అలీ ప్రతిపాదించగా కరుణాకర్‌రెడ్డి బలపరిచారు. మొత్తం 48మంది కౌన్సిలర్లతోపాటు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తేర చిన్నపరెడ్డితోపాటు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉన్నారు. మొత్తంగా 53మందిలో 27మంది సైదిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆమోదం తెలుపగా బుర్రి శ్రీనివాసరెడ్డికి 20మంది ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో మెజార్టీ ఆమోదం పొందిన సైదిరెడ్డిని చైర్మన్‌గా ఎన్నికల అధికారి జగదీశ్వర్‌రెడ్డి ప్రకటించి ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్నికకు ముందు కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేశారు.


logo