బుధవారం 08 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 26, 2020 , 05:13:23

కారు జోరు

కారు జోరు
  • -మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్‌ఎస్‌
  • - మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ కైవసం
  • - హాలియా, నల్లగొండ, చిట్యాలలో హోరా హోరీ
  • -చండూరు మున్సిపల్‌ పీఠం గెలుచుకున్న కాంగ్రెస్‌
  • -ఫలితాల లెక్కింపు పూర్తయ్యే వరకు తీవ్ర ఉత్కంఠ

మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్‌ఎస్‌ మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ కైవసం హాలియా, నల్లగొండ, చిట్యాలలో హోరా హోరీ చండూరు మున్సిపల్‌ పీఠం గెలుచుకున్న కాంగ్రెస్‌ ఫలితాల లెక్కింపు పూర్తయ్యే వరకు తీవ్ర ఉత్కంఠ
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : 2014అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుసగా ప్రతి ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ మరోసారి సత్తా చాటింది. ఆది నుంచి అందరూ ఊహించిన విధంగానే జిల్లాలోని 7 మున్సిపాలిటీలకు మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ స్థానాల్లో అత్యధిక వార్డు స్థానాలు కైవసం చేసుకొని చైర్మన్‌ పీఠాలకు లైన్‌ క్లియర్‌ చేసుకుంది. నల్లగొండ, హాలియా, చిట్యాలలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య హోరా హోరీ పోరు సాగినా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎక్స్‌ అఫీషియో ఓట్లతో ఆయా చైర్మన్‌ పీఠాలు సైతం టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. చండూర్‌ మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని దక్కించుకుంది.

తుది ఫలితం వరకూ కొనసాగిన ఉత్కంఠ...

జిల్లాలో ఏడు మున్సిపాలిటీలకు శనివారం ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రౌండ్‌ ఫలితాలు 11గంటలకు వెలువడగా.. మిర్యాలగూడ, నల్లగొండ మున్సిపాలిటీల ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చాయి. ఈ రెండు కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకూ లెక్కింపు కొనసాగింది. నల్లగొండలో మొత్తం 48వార్డు స్థానాలుండగా.. టీఆర్‌ఎస్‌ 20, కాంగ్రెస్‌ 20, బీజేపీ 6, టీఆర్‌ఎస్‌ రెబల్‌ 1, ఎంఐఎం ఒక్క స్థానం గెలుచుకున్నాయి. మొదటి రౌండ్‌లో ఇక్కడ 16 వార్డుల ఫలితాలు ప్రకటించగా.. టీఆర్‌ఎస్‌ 8, కాంగ్రెస్‌ 6 స్థానాలు గెలిచింది. రెండో రౌండ్‌తో కలిపి 32 వార్డుల ఫలితాలు వచ్చే సరికి ఇరు పార్టీలు చెరి 12 స్థానాలతో ఉండటంతో.. మూడో రౌండ్‌ ఫలితాల పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరి వరకూ ఇరు పార్టీల మధ్య అదే స్థాయిలో హోరా హోరీ కొనసాగింది. జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో 162 వార్డులకు చిట్యాల 3వ వార్డు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 161 వార్డుల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. దేవరకొండలో 6వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి గోపలదాసు చెన్నయ్య ఒక్క ఓటు ఆధిక్యంతో విజయం సాధించారు. తొలుత చెన్నయ్య మూడు ఓట్ల ఆధిక్యంతో  గెలవగా.. రీ కౌంటింగ్‌ నిర్వహించగా ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడ మినహా జిల్లాలో ఎక్కడా రీ కౌంటింగ్‌ జరగలేదు. చిట్యాల 11వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి గోదుమగడ్డ పద్మ ఏడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఇక్కడ రీ కౌంటింగ్‌ కోసం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మన్నెం దుర్గ పట్టుబట్టినా.. అప్పటికే అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో రీ కౌంటింగ్‌ జరపలేమని అధికారులు తెలిపారు. మిగిలిన అన్ని స్థానాల్లోనూ ఓట్ల లెక్కింపు ప్రశాతంగా కొనసాగింది.  logo