మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Jan 26, 2020 , 05:12:06

రేపే ఎన్నిక

 రేపే ఎన్నిక
  • రేపటి చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక కోసం రాజకీయ ఎత్తుగడలు
  • టీఆర్‌ఎస్‌కు స్పష్టంగా మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ
  • ఎక్స్‌ అఫీషియో ఓట్లతో చిట్యాల, హాలియా పీఠాలూ టీఆర్‌ఎస్‌కే..
  • నల్లగొండ చైర్మన్‌ ఎంపికకు
  • కీలకం కానున్న బీజేపీ మద్దతు
  • చండూర్‌ చైర్మన్‌ పీఠం మాత్రమే కాంగ్రెస్‌కు దక్కే అవకాశం
  • గెలిచిన వెంటనే క్యాంపులకు తరలిన అన్ని పార్టీల సభ్యులు

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పుడు పట్టణ ప్రజలందరి దృష్టి రేపు జరుగనున్న చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికపైనే నెలకొంది. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా.. మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండలో టీఆర్‌ఎస్‌.. చండూర్‌లో కాంగ్రెస్‌ అధిక స్థానాలు గెలుచుకున్నాయి. చైర్మన్లపై ఆయా పార్టీల అభ్యర్థులే కూర్చోనున్నారు. హాలియా, చిట్యాలలో ఇరు పార్టీలకూ సమాన బలం కనిపిస్తుండగా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉన్న ఎక్స్‌ అఫీషియో ఓట్ల బలంతో ఈ రెండు స్థానాలూ టీఆర్‌ఎస్‌కు ఖాయమనే చెప్పొచ్చు. చెరి 20స్థానాలు గెలిచిన నల్లగొండలో మాత్రం బీజేపీ (6 స్థానాలు) మద్దతు కీలకంగా మారనున్న నేపథ్యంలో.. ఏ పార్టీ నుంచి ఎవరు చైర్మన్‌ అవుతారనే అంశం పైనే ఎక్కువ ఉత్కంఠ నెలకొంది.

మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కౌన్సిలర్లుగా ఎవరు గెలుస్తారనే ఉత్కంఠకు తెర పడింది. కానీ ఇప్పుడు రేపు జరగనున్న చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక గురించే సర్వత్రా చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ ఎక్కడా చైర్మన్‌ అభ్యర్థులను ప్రకటించలేదు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎంపిక రేపు జరగనుంది. మిర్యాలగూడతోపాటు దేవరకొండ, నందికొండలో ఆ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో ఎలాంటి చర్చ లేకుండానే అక్కడ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లతోపాటు.. కో ఆప్షన్‌ సభ్యులు సైతం టీఆర్‌ఎస్‌ మద్దతుతోనే ఎంపిక కానున్నారు. చండూరులో 10స్థానాలకు 7వార్డులు గెలిచిన కాంగ్రెస్‌ నుంచి తోకల వెంకన్న చైర్మన్‌ కావడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. 12 స్థానాలకు టీఆర్‌ఎస్‌ 6, కాంగ్రెస్‌ 4, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ 2 స్థానాలు గెలిచిన చిట్యాలలో చైర్మన్‌ పీఠం టీఆర్‌ఎస్‌కు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ ఏకమైనా 6 స్థానాలే కావడంతో.. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎక్స్‌ అఫీషియో ఓటుతో టీఆర్‌ఎస్‌ ఓట్ల సంఖ్య ఏడుకు చేరనుంది. హాలియాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ 5స్థానాలు గెలవగా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన టీఆర్‌ఎస్‌ నాయకుడు నల్లగొండ సుధాకర్‌ సైతం టీఆర్‌ఎస్‌కే మద్దతిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఓట్ల సంఖ్య ఆరుకు చేరింది. కాంగ్రెస్‌ సైతం ఆరు స్థానాలు గెలిచినప్పటికీ..

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఎక్స్‌ అఫీషియో ఓటు టీఆర్‌ఎస్‌కు అదనం కానుంది. ఎంపీలు, ఎమ్మెల్సీల మద్దతు సైతం టీఆర్‌ఎస్‌కే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్స్‌ అఫీషియో ఓట్ల విషయంలోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యత దక్కే పరిస్థితి కనిపించడం లేదు. మిగిలిన నల్లగొండలో మాత్రమే ఎటూ తేలని పరిస్థితి ప్రస్తుతానికి నెలకొంది. మొత్తం 48వార్డులకు టీఆర్‌ఎస్‌ 20, కాంగ్రెస్‌ 20 స్థానాలు గెలవగా బీజేపీ 6 స్థానాలు గెలిచింది. చెరో స్థానం గెలుచుకున టీఆర్‌ఎస్‌ రెబల్‌, ఎంఐఎం మద్దతు టీఆర్‌ఎస్‌కే దక్కినా.. మొత్తం బలం 22కు చేరనుంది. బీజేపీ 6 స్థానాలు గెలుచుకోవడంతో వాళ్ల మద్దతు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లలో ఎవరికి దక్కితే వారిని చైర్మన్‌ పీఠం వరించే అవకాశం కనిపిస్తోంది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలపై ఇరు పార్టీలు కన్నేయడంతో.. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే అభ్యర్థులతో క్యాంపులు ఏర్పాటు చేశాయి.logo
>>>>>>