శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 26, 2020 , 05:08:47

టీఆర్‌ఎస్‌దే ఆధిక్యం

 టీఆర్‌ఎస్‌దే  ఆధిక్యం
  • - 162వార్డులకు 80స్థానాల్లో దూసుకుపోయిన కారు
  • - 62స్థానాలతో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌
  • -నల్లగొండ, దేవరకొండలోనే బీజేపీ ప్రభావం
  • - చెరొక్క స్థానానికి పరిమితమైన సీపీఎం, ఎంఐఎం
  • - సీపీఐ, టీడీపీ సున్నా.. ఐదు వార్డుల్లో స్వతంత్రులు


జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి తనకు ఎదురులేదని నిరూపించింది. 2014అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రతి సందర్భంలోనూ సత్తా చాటుతున్న టీఆర్‌ఎస్‌.. తాజాగా  మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ తన శక్తి చాటుకుంది. మొత్తం 162వార్డు స్థానాలకు 80స్థానాలు దక్కించుకొని అతి పెద్ద పార్టీగా నిలిచింది.

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి తనకు ఎదురులేదని నిరూపించింది. 2014అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రతి సందర్భంలోనూ సత్తా చాటుతున్న టీఆర్‌ఎస్‌.. తాజా మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ తన శక్తి చాటుకుం ది. ఈసారి నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌ కొద్దిగా పోటీనిచ్చినా.. ఒక్క చండూరు మినహా చివరగా అన్ని స్థానాల్లో ఆధిక్యంమాత్రం టీఆర్‌ఎస్‌కే దక్కింది. మొత్తం 162వార్డు స్థానాలకు 80స్థానాలు దక్కించుకొని అతి పెద్ద పార్టీగా నిలిచింది. 62వార్డులు దక్కించుకున్న కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలవగా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ కేవలం 11స్థానాలకే పరిమితమైంది. నల్లగొండ, దేవరకొండ మినహా ఎక్కడా బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. సీపీఎం, ఎంఐఎం ఒకే ఒక్క స్థానం దక్కించుకోగా.. టీడీపీ, సీపీఐ సున్నాకే పరిమితమయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం జిల్లా అంతటా కేవలం ఐదు వార్డుల్లో మాత్రమే గెలిచారు.

ఎన్నికలు ఏవైనా ఏకపక్షంగా..సత్తా చాటుతున్న టీఆర్‌ఎస్‌..

తాజాగా మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ జిల్లాలో తన సత్తా చాటింది. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి.. జిల్లాలో తనకు ఎదురులేదని మరోసారి టీఆర్‌ఎస్‌ బలం నిరూపించుకుంది. కాంగ్రెస్‌ కొన్ని చోట్ల బీజేపీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకొని సహకరించుకున్నా.. కొన్నిచోట్ల సీపీఎంతో పొత్తు పెట్టుకున్నా.. టీఆర్‌ఎస్‌ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో మొత్తం 162వార్డులుండగా.. 80స్థానాలు టీఆర్‌ఎస్‌ తన ఖాతాలో వేసుకుంది. 49.4శాతం స్థానాలతో గులాబీ సేన మొదటి స్థానం లో నిలవగా.. 38.2శాతంతో కాంగ్రెస్‌ 62స్థానాలు దక్కించుకుంది. రెండో స్థానంలో నిలిచినా.. చైర్మన్‌ పీఠాల పరంగా చూసినపుడు కాంగ్రెస్‌ కేవలం ఒక్క స్థానానికే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక తాజా ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ కేవలం 11స్థానాల్లో విజయం సాధించింది. 6.8శాతం మాత్రమే సీట్లు గెలుచుకున్న బీజేపీ.. తనకు వచ్చిన 11స్థానాల్లోనూ 6 నల్లగొండలో, 3 దేవరకొండలోనే గెలుచుకోవడం విశేషం. మిగిలిన 5 మున్సిపాలిటీల్లో ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. కాంగ్రెస్‌ సహకరించినా నల్లగొండలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన సీపీఎం.. మిర్యాలగూడలో మాత్రం కాంగ్రెస్‌ పొత్తు ఫలితంగా ఒక్క చోట గెలుపొందింది. నల్లగొండలో ఎంఐఎం కూ డా కేవలం ఒక్క స్థానానికే పరిమితమైం ది. నల్లగొండ, హాలియా, మిర్యాలగూడ లో ఒక్కొక్క స్వతంత్ర అభ్యర్థి గెలవగా.. దేవరకొండ లో ఇద్దరు గెలిచారు. జిల్లాలో ఘనమైన రాజకీయ చరి త్ర కలిగిన సీపీఐ, టీడీపీ ఒక్కటంటే ఒక్క వార్డు స్థానం సైతం గెలుచుకోలేక చతికిల పడ్డాయి. చిట్యాలలో కాం గ్రెస్‌ మద్దతుతో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ పక్షాన పోటీ చేసిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు.


logo