శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 25, 2020 , 01:42:15

నేడే ఉత్కంఠకు తెర

 నేడే ఉత్కంఠకు తెర
  • మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి
  • మూడంచెల భద్రత నడుమ పక్కాగా ఓట్ల ఫలితాలు
  • జిల్లాలో 7మున్సిపాలిటీలకు స్థానికంగానే లెక్కింపు
  • దేవరకొండలో 4రౌండ్లు.. మిగతా చోట్లా 3రౌండ్లు
  • నల్లగొండ, మిర్యాలగూడలో రెండు టేబుళ్లపై కౌంటింగ్
  • నల్లగొండ, మిర్యాలగూడలో రెండు టేబుళ్లపై కౌంటింగ్నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ  : పట్టణ ప్రజలు ఎవరికి పట్టం కట్టారనే సంగతి నేడు తేలనుంది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పాలకవర్గాల ఎన్నిక కోసం ఈ నెల 22న పోలింగ్ జరగ్గా.. నేడు ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 162వార్డులు ఉండగా.. ఏకగ్రీవమైన చిట్యాల 3వ వార్డు మినహా మిగిలిన 161వార్డుల ఫలితం తేలనుంది. నల్లగొండలో ఆర్జాలబావి సమీపంలోని స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ గౌడౌన్లలో ఏర్పాట్లు చేపట్టగా.. మిర్యాలగూడలో అవంతీపురం సమీపంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఓట్లు లెక్కించనున్నారు. దేవరకొండలో ఎంకేఆర్ డిగ్రీ కాలేజీ, నందికొండలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ.. హాలియా, చిట్యాలల్లో ఆయా ఎంపీడీఓ కార్యాలయాలు.. చండూర్‌లో మరియానికేతన్ స్కూళ్లో లెక్కింపు కోసం ఏర్పాట్లు చేపట్టారు. పటిష్ట భద్రత నడుమ ఇప్పటికే సిద్ధం చేసిన కౌంటింగ్ హాళ్లలో లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ సిబ్బంది 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. కౌంటింగ్ పాస్‌లు కలిగిన అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది, మీడియా ప్రతినిధులను మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు అనుమతిస్తారు.

మూడు రౌండ్లలో మొత్తం ఫలితాలు...

నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో 48వార్డులు ఉండగా.. ఒక్కో రౌండ్‌కు 16వార్డుల ఫలితం వెల్లడి కానుంది. ఇందుకోసం ఒక్కో వార్డు రిటర్నింగ్ అధికారికి రెండు టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పైన వెయ్యి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ముందుగా ఒక వార్డుకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. అనంతరం ఆ వార్డుకు సంబంధించిన అన్ని బ్యాలెట్ బాక్సులు తెరిచి వాటిని ప్రాథమికంగా లెక్కిస్తారు. తర్వాత 25 ఓట్ల చొప్పున బండిళ్లు కడతారు. అనంతరం అన్ని బండిళ్లనూ కలిపి ఒక్కో టేబుల్‌కు వెయ్యి బ్యాలెట్లను అభ్యర్థుల వారీగా పోలైన వివరణాత్మక లెక్కింపు కోసం కేటాయిస్తారు. ప్రతి టేబుల్ పైన ఇద్దరు కౌంటింగ్ సిబ్బంది, ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్ ఉంటారు. రెండు టేబుళ్లకు కలిపి ఒక వార్డుకు ఒక రిటర్నింగ్ అధికారి ఉంటారు. ఒక వార్డు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి.. విజేతను ప్రకటించిన తర్వాత అవే టేబుళ్లపై మరో రెండు వార్డుల ఓట్ల లెక్కింపును సైతం వేర్వేరుగా చేపడతారు. మొత్తం ఒక్కో టేబుల్‌పై మూడు వార్డుల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే.. ఓట్ల సంఖ్య తక్కువగా ఉన్నందున నల్లగొండ, మిర్యాలగూడ మినహా మిగిలిన మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కోసం ఒక్క టేబుల్‌ను మాత్రమే వినియోగిస్తారు. దేవరకొండలో ఒక్కో రౌండ్‌కు 6వార్డుల చొప్పున నాలుగు రౌండ్లలో మొత్తం ఫలితం వెల్లడి కానుంది. నందికొండ, హాలియాలో 12వార్డులు ఉన్నందున ఒక్కో రౌండ్‌కు నాలుగు వార్డుల ఫలితం వెల్లడవుతుంది. ఇప్పటికే 3వ వార్డు ఏకగ్రీవమైన చిట్యాలలో ఇంకా 11వార్డుల ఓట్లు లెక్కించాల్సి ఉండగా.. ఇక్కడ ఒక్కో రౌండ్‌కు నాలుగు వార్డుల ఫలితం మూడు రౌండ్లలో పూర్తి కానుంది. చండూర్‌లో 10వార్డులు ఉండగా.. ఒక్కో రౌండ్‌కు ఇక్కడ కూడా నాలుగు వార్డుల ఓట్ల లెక్కింపు జరగనుంది.


logo