ఆదివారం 29 మార్చి 2020
Nalgonda - Jan 25, 2020 , 01:39:18

ఘనంగా రామలింగేశ్వరుడికి లక్ష పుష్పార్చన

ఘనంగా రామలింగేశ్వరుడికి లక్ష పుష్పార్చన



నార్కట్‌పల్లి : మండల పరిధిలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. శుక్రవారం పుష్యబహుళ అమావాస్య కావడంతో జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో పార్వతీ సమేతుడి క్షేత్రం పోటెత్తింది. గుట్టపై నిద్ర చేసే భక్తులు ఓం నమః శివాయ అంటూ శివ సత్తుల పూనకాలతో స్వామివారిని భక్తితో దర్శించుకున్నారు. అదేవిధంగా మానసిక రుగ్మతులతో బాధపడేవారు ఈ క్షేత్రంపై మండల ధీక్ష చేసి శివ నామస్మరణలతో జపిస్తే అనారోగ్యం మటుమాయమై సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారనే విశ్వాసం భక్తుల్లో ఉంది. దీంతో ప్రతి నెలా అమావాస్య తిథి రోజున భక్తులు అధిక సంఖ్యలో నిద్ర చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారికి నైవేథ్యంతో వండిన భోనంను డప్పు చప్పుళ్లతో తీసుకెళ్లి భక్తి శ్రద్ధలతో సమర్పించారు.

పార్వతీ పరమేశ్వరులకు లక్ష పుష్పార్చన

పుష్యబహుళ అమావాస్య సందర్భంగా శ్రీ పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలకు కల్యాణ మండపం వద్ద లక్ష పుష్పార్చనను ఆలయ ప్రధానర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు. స్వామివారి లక్ష పుష్పార్చనను చూసి భక్తులు పుణీతులయ్యారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగించుకుంటూ కోనేరు వద్దకు తీసుకెళ్లి స్వామివారికి పంచ హారతి సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాభివృద్ధి కమిటీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఈఓ సులోచన, సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డిలు మౌలిక వసతులు కల్పించారు. కార్యక్రమంలో దేవాలయ పాలక మండలి సభ్యులు, దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



logo