మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Jan 24, 2020 , 02:01:29

బాలికలకు భరోసా..

బాలికలకు భరోసా..
  • - ప్రజలను చైతన్యపర్చేందుకు పలు కార్యక్రమాలు
  • - సంరక్షకులు, ఆడపిల్లలను తీర్చిదిద్దిన వారికి సన్మానాలు
  • - లింగ నిర్ధారణ పరీక్షల నివారణకు పోలీసుశాఖ ప్రత్యేక నిఘా
  • - ‘ప్రేరణ’తో మార్పు తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు

సమాజంలో ఆడబిడ్డకు ఆదరణ కరువవుతోంది. మగ బిడ్డపై ఉన్న మోజు... ఆడ పిల్లలను సాకడం కష్టమన్న భావన నేపథ్యంలో వారిపై మమకారం సన్నగిల్లుతోంది. ప్రభుత్వం ఆడపిల్లల రక్షణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. పేదరికం కారణంగా కన్నపేగునే కాదనుకుంటున్న ఉదంతాలు నేటికీ జిల్లాలోని చందంపేట వంటి ప్రాంతాల్లో వెలుగు చూస్తూనే ఉన్నాయి. పట్టణాల్లో సైతం ఆడపిల్లలపై కన్నవాళ్ల ఆదరణ తగ్గుతూ వస్తుండటం విస్మయం గొలుపుతోంది. దీంతో జనాభా పరంగా మగ, ఆడ మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ సమస్యకు మూలాలను వెతికి పరిష్కరించే పనిలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇటీవలే ఇన్‌చార్జి కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ప్రేరణ కార్యక్రమానికి రూపకల్పన చేయగా.. దానికి అనుసంధానంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ నెల 26 వరకు పలు కార్యక్రమాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చేపడుతోంది.

దేవరకొండ, నమస్తే తెలంగాణ : నాగరికత, వైద్య విజ్ఞానం పెరిగిన కొద్దీ మనిషిలోని పాశవికత జూలువిదుల్చుతోంది. వెనుకబడ్డ చందంపేట మండలం వంటి ప్రాంతాల్లో భ్రూణహత్యలు ఎక్కువగా జరుగుతుండగా... అభివృద్ధ్ది దిశగా ముందుకు సాగుతున్న పట్టణ ప్రాంతాల్లోనూ స్కానింగ్‌ సెంటర్ల పుణ్యమా.! అని ఆ అనాగరిక సంస్కృతి పట్టణాలకూ పాకింది. అత్యాధునిక స్కానింగ్‌ పరిజ్ఞానంతో ఆడపిల్ల అని నిర్ధారించుకొని గర్భస్థ శిశువును ఛిదిమేస్తున్నారు. భ్రూణహత్యల పరంపర నేపథ్యంలో జిల్లాలో ఆడపిల్లల నిష్పత్తి గణనీయంగా తగ్గుతోంది.

ఆందోళన కలిగిస్తున్న ఆడపిల్లల సంఖ్య..

జిల్లాలో ప్రతీ వెయ్యిమంది పురుషులకు 921 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. తాజా జనాభా లెక్కల ప్రకారం... 0-6 వయస్సు మధ్య ఉన్న లెక్కలను పరిశీలిస్తే... రాష్ట్రంలో వరంగల్‌ జిల్లాలో అతి తక్కువగా బాలికలు ఉన్నారు. ఆతర్వాత స్థానంలో కడప జిల్లా ఉండగా, నల్గొండ జిల్లా మూడో స్థానంలో ఉంది. చందంపేట మండలంలో ప్రతీ వెయ్యిమందికి 834 మంది బాలికలు, సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలంలో 832 మంది, మునుగోడులో 842, పెద్దవూరలో 850, త్రిపురారంలో 853, మర్రిగూడలో 863, భూదాన్‌పోచంపల్లిలో 867, చిట్యాలలో 883, ఆత్మకూరులో 892, చండూరులో 894 మంది మాత్రమే బాలికలు ఉన్నారు. గిరిజన తండాల్లో ఆడపిల్లలపై ఉన్న వివవక్షత కారణంగా పురిట్లోనే ఆడపిల్లలను చంపేస్తున్నారు. లేదంటే అమ్ముకుంటున్నారు. నిరక్షరాస్యత, సరైన అవగాహనలేక గిరిజనులు ఈ చర్యలకు పూనుకుంటున్నారు. అయితే అన్నిరకాలుగా అభివృద్ధి సాధిస్తున్న ప్రాంతాల్లో, అక్షరాస్యులు సైతం ఇలాంటి చర్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

‘ప్రేరణ’తో చైతన్యం చేసే దిశగా..

గతంలో జిల్లాలో మన ఇంటిలక్ష్మి వంటి కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపర్చగా తాజాగా.. ‘ప్రేరణ’ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ చంద్రశేఖర్‌ కార్యరూపం ఇచ్చారు. యుక్త వయస్సులో బాలికలకు ఎదురవుతు న్న సమస్యలను అధిగమించే దిశగా బాలికలను చైతన్య పర్చేందుకు ప్రత్యేకించి సెల్ఫ్‌ డిఫెన్స్‌ తరగతులను పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహిస్తున్నారు. బాలికలు చేరుకోవాల్సిన లక్ష్యాలను అధిగమించేలా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. బాలికల రక్షణ కోసం ఉన్న చట్టాలు, శిక్షల గురించి అవగాహన కల్పిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో కళాజాత ప్రదర్శనలు కూడా నిర్వహించారు. వీటితోపాటు వీడియో, ఆడియో కార్యక్రమాల ద్వారా ఆడపిల్లలపై జరుగుతున్న వివక్షతలను, తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నారు. బేటీ బచా వో.. బేటీ పడావో వంటి కార్యక్రమాలను ఇప్పటికే పలు దఫాలుగా చేపట్టిన అధికార యంత్రాంగా జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఈనెల 20 నుంచి 26 వరకు బాలికల సంరక్షణకు సంబంధించి పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. డ్రాయింగ్‌, వ్యాస రచన పోటీలు నిర్వహించి ఆడపిల్లల వివక్షతపై పూర్తి స్థాయిలో అవగాహన పరిచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో ఆడపిల్లలకు రక్షణ కోసం కృషి చేస్తున్నవారిని, ఆడపిల్లలను తీర్చిదిద్ది మహోన్నత స్థానంలో నిలిపిన వారిని ఘనంగా సన్మానించేందుకు ఉమెన్స్‌ ఛైల్డ్‌ వెల్ఫేర్‌ అన్ని ఏర్పాట్లు చేసింది.

పోలీస్‌శాఖ ప్రత్యేక నిఘా..

దేశ జనాభాలో స్త్రీల నిష్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది. తాజా జనాభా లెక్కల ప్రకారం ప్రతీ వెయ్యి మంది పురుషులకు 963 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. దీనికి కారణం పిండదశలోనే ప్రత్యేక టెస్ట్‌ల ద్వారా శిశు లింగ నిర్థారణ చేసుకుని ఆడపిల్లయితే... అబార్షన్‌ చేయించేస్తున్నారు. లింగ నిర్ధ్దారణ చేసే ఫ్రీ కాన్సెప్షనల్‌ ఫ్రీనాటల్‌ డయోగ్నస్టిక్‌ టెస్ట్‌(పీసీ పీఎన్‌డీటీ)ను నిషేధిస్తూ ప్రభుత్వం 1994లో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చినా అమలులో పూర్తిగా విఫలమైంది. ఈ చట్టం ద్వారా లింగ నిర్థారణ పరీక్షలు చేసినా, ఆడ శిశువు అని చెప్పినా... తెలుసుకునేందుకు ప్రయత్నించినా నేరంగా పరిగణిస్తారు. చట్టం అమలులోకి వచ్చి 18 ఏళ్లు గడచినా నేటికి గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు చేస్తూ భ్రూణహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం వెలుగుజూస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 200కు పైగా డయాగ్నస్టిక్‌ సెంటర్లు కొనసాగుతున్నట్లు అంచనా. డబ్బులకు ఆశపడి స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు చట్టాలను ఉల్లంఘిస్తూ అబార్షన్లను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ రంగనాథ్‌ స్కానింగ్‌ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. పోలీస్‌, ఇంటలిజెన్స్‌ల ద్వారా సమాచారాన్ని సేకరించి సంబంధిత స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులపై కొరడా ఝులిపిస్తున్నారు.
logo
>>>>>>