మంగళవారం 07 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 24, 2020 , 02:01:29

సైదులు బాబా జాతర షురూ

సైదులు బాబా జాతర షురూ
  • -దర్గాలో దట్టీలు, పూలతో అలంకరణ
  • - వైభవంగా దీపారాధనలు, ప్రత్యేక ప్రార్థనలు
  • -నేడు గంధం ఊరేగింపు
  • - హాజరుకానున్న హోం మంత్రి మహమూద్‌ అలీ


జాన్‌పహాడ్‌ దర్గా ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మూడ్రోజుల ఉర్సులో భాగంగా తొలిరోజు దర్గాలోని హజ్రత్‌ సయ్యద్‌, మొహినుద్దీన్‌ షా సమాధులను పూలు, దట్టీలతో అలంకరించి కొవ్వొత్తులతో దీపారాధన చేశారు. దర్గా పూజారి ఇంటి నుంచి గంధం కలశాలు, దట్టీలను ఊరేగింపుగా దర్గాకు తీసుకురాగా.. పకీరుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శుక్రవారం గంధోత్సవం నిర్వహించ నుండగా హోంశాఖమంత్రి మహమూద్‌ అలీ హాజరు కానున్నారు.

పాలకవీడు : మతసామరస్యానికి ప్రతీకగా వెలుగొందుతున్న మండలంలోని జాన్‌పహాడ్‌ దర్గా వద్ద సైదులు బాబా ఉర్సు ఉత్సవాలు గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా  ప్రారంభమయ్యాయి. మూడ్రోజులపాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు వేకువజామునే దర్గా పూజారి సయ్యద్‌ అలీబాబా, జానీల  గృహం నుంచి మేళతాళాలతో గంధ కలశాలను, దట్టీలను తలపై ఎత్తుకొని ఊరేగింపుగా దర్గాకు తరలివెళ్లారు. దర్గాలోని హజ్రత్‌ సయ్యద్‌, మొహినొద్దీన్‌షా సమాధులతోపాటు వెలుపల ఉన్న సైనిక బృంధాల సమాధులపై(సిపాయిలు)గంధం చల్లి పూలమాలలు, దట్టీలతో అలంకరించారు. సమాధుల చుట్టూ మహిళలు కొవ్వొత్తులను వెలిగించి  పూజలు నిర్వహించారు. అలంకరించిన సమాధులు నూతన శోభతో భక్తులను ఆకట్టుకున్నాయి. రెండు తెలుగు రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన భక్తుల మధ్య మగ్రీబ్‌, ఈషాద్‌ నమాజ్‌లను దర్గా ముజావర్లు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దర్గాకు వచ్చిన భక్తులు కొబ్బరికాయలను కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సమీపంలోని నాగదేవతకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఉర్సు సందర్భంగా విద్యుద్దీపాలంకరణతో పరిసర ప్రాంతాలు, వీధులు వెలుగులీనుతున్నాయి. రెండో రోజైన శుక్రవారం జరిగే గంధం ఊరేగింపునకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. అందుకు తగినట్లు వక్ఫ్‌బోరు,్డ అధికారులు ఏర్పాట్లు చేశారు.  ఉర్సు సందర్భంగా పకీర్లు పెద్ద ఎత్తున జాన్‌పహాడ్‌ దర్గాకు తరలివచ్చారు. ఉర్సు ప్రారంభం సందర్భంగా ఫకీర్లు నిర్వహించిన ఖవ్వాలి అలరించింది. దట్లీ ఊరేగింపులో వీరి సందడి ప్రత్యేకంగా కనిపించింది. 

నేడు గంధం  ఊరేగింపు

ఉర్సు ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం ప్రధాన ఘట్టం గంధం ఊరేగింపు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ హాజరుకానున్నారు. అదేవిధంగా హుజుర్‌నగర్‌, మిర్యాలగూడ, కోదాడ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, బొల్లం మల్లయ్యయాదవ్‌ హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.

 ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

నేడు నిర్వహించబోయే  గంధం మహోత్సవ ఏర్పాట్లను జేసీ సంజీవరెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్సుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నేరేడుచర్ల, దామరచర్ల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్‌ నియంత్రణకు, వాహనాలు నిలుపడానికి 5ఎకరాల్లో పార్కింగ్‌,  దర్గా వెలుపల, లోపల భక్తుల నియంత్రణకు బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిక్షణకు సీసీకెమెరాల ఏర్పాటును పరిశీలిస్తున్నామని చెప్పారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేరేడుచర్ల, పాలకవీడు తాసిల్దార్లు రాంరెడ్డి, కృష్ణానాయక్‌, ఎస్‌ఐ నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo