శనివారం 28 మార్చి 2020
Nalgonda - Jan 24, 2020 , 02:01:29

27న చైర్మన్ల ఎన్నిక

27న చైర్మన్ల ఎన్నికనోటిఫికేషన్‌ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం మొదట మున్సిపల్‌ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం ఏడు పురపాలికల్లో కొలువు దీరనున్న నూతన పాలకవర్గం రేపు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి  

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగియగా.. ఎన్నికల ఫలితాలతో పాటు చైర్మన్ల ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 25న ఓట్ల లెక్కింపునకు తగిన ఏర్పాట్లను ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. దీంతో పాటు 27న నూతన పాలకవర్గాల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముందుగా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడంతో అనంతరం చైర్మన్లను ఎన్నుకోనున్నారు. గత పాలకవర్గం గడువు గతేడాది జూలై 4వ తేదీన పూర్తవడంతో అప్పటి నుంచి పురపాలికలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. ఈ నెల 27న జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో నూతన పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి.

నల్లగొండ, నమస్తేతెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఘట్టం ముగియగా ఇక ఎన్నికల ఫలితాలతోపాటు నూతన పాలకవర్గాల ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. ఈనెల 25న జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు లెక్కించి విజేతలను తేల్చనుండగా 27న నూతన పాలకవర్గాల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 27న ఉదయం 11 గంటలకు ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించి మధ్యాహ్నం 12.30కు చైర్మన్లను ఎన్నుకోనున్నారు. నల్లగొండతో పాటు దేవరకొండ, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీలలో 27న నూతన పాలకవర్గాలు కొలువు దీరనున్నాయి. గత ఏడాది జూలై 4న గత పాలకవర్గం గడువు పూర్తి కావడంతో ప్రత్యేకాధికారుల పాలనలో ఆయా పురపాలికలు ఇప్పటివరకు నడువగా 27నుంచి నూతన పాలకవర్గాలు పాలించనున్నాయి.

27న చైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ...

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి తుది ఘట్టమైన చైర్మన్ల ఎన్నిక ఈనెల 27న జరుగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఉదయం 11గంటలకు జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో ఉన్న 162మంది కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించి ఆయా మున్సిపాలిటీల్లో బలబలాలను దృష్టిలో పెట్టుకుని మెజార్టీ కౌన్సిలర్లు ప్రతిపాదించిన అభ్యర్ధిని చైర్మన్‌గా, వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకోనున్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఈనెల 7న నోటిఫికేషన్‌ జారీ చేసిన ఎన్నికల కమిషన్‌ 8 నుంచి 10వరకు నామినేషన్లు స్వీకరించి 22న ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికలకు సంబంధించి 25న ఫలితాలు వెలువడనుండగా 27న కొత్త పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేయనున్నాయి.

6 నెలల తర్వాత నూతన పాలక వర్గాలు...

2014 మార్చిలో మున్సిపల్‌ ఎన్నికలు జరగ్గా జూలైలో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు ఏర్పడ్డాయి. వాటికి తోడు ఇటీవల జిల్లాలో హాలియా, నందికొండ, చండూరు, చిట్యాలను నూతన మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. గత పాలకవర్గాల పదవీకాలం 2019 జులై 5వ తేదీతో ముగియడంతో ఆయా మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పాలన సాగుతోంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈనెల 22న 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా 25న ఫలితాలు రానున్నాయి. ఆ తర్వాత 27న నూతన చైర్మన్లు, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 25న జరుగనున్న ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం ఆయా మున్సిపాలిటీల పరిధిలోని కౌంటింగ్‌ సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
logo