గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 23, 2020 , 03:16:54

79.50 శాతం పోలింగ్

 79.50 శాతం పోలింగ్
  • - జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లోనూ పోలింగ్ ప్రశాంతం
  • - అత్యధికంగా చండూర్ 92.01 శాతం పోలైన ఓట్లు
  • - నందికొండలో 63.74% మాత్రమే పోలింగ్ నమోదు
  • - మధ్యాహ్నం ఒంటి గంట వరకే 58 శాతం పోలింగ్
  • - జిల్లా అంతటా పలు ప్రాంతాల్లో ఓట్లేసిన ప్రముఖులు

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చిట్యాల, చం డూర్ పట్టణ పురపాలక సంఘాల ఎన్నిక కోసం బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలతో పోలింగ్ ముగిసింది. ఎక్కడా ఎలాంటి చెదురుమొదురు ఘటనలు కూడా నమోదు కాకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. జిల్లాలో మొత్తం 79.50 శాతం ఓట్లు పోలయ్యాయి. 2,81,444 మంది ఓటర్లకు.. 2,23,684 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా చండూర్ 92.01 శాతం పోలింగ్ న మోదుకాగా.. చిట్యాలలో 89.75, హాలియాలో 88.14, దేవరకొండలో 83.35, మిర్యాలగూడలో 79.31, నల్లగొండలో 77.09 శాతం పోలింగ్ నమోదైంది. నందికొండలో అతి తక్కువగా కేవలం 63.74 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా ఇన్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, ఎస్పీ రంగనాథ్, ఎన్నికల పరిశీలకురాలు కొర్రా లక్ష్మి జిల్లాలోని పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

ఉదయం నుంచే బారులు..        

7 మున్సిపాలిటీల్లోని 161 వార్డుల్లోనూ ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకే సుమారు 60 శాతం పోలింగ్ నమోదైంది. రాజకీయ ప్రముఖులు, పలువురు ఉన్నతాధికారులు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మిర్యాలగూడలోని 20వ వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు 20వ వార్డు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగా రెడ్డి 32వ వార్డులో ఓటు వేశారు. నల్లగొండలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి 33వ వార్డు పరిధిలోని నల్లగొండ పబ్లిక్ స్కూల్ పోలింగ్ బూత్ నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి 34వ వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి 47వ వార్డు బోయవాడ స్కూల్ ఓటు వేశారు. నందికొండలో తొలిసారి స్థానిక సంస్థల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మాజీ సీఎల్పీ నేత కుందూరు జానా రెడ్డి 5వ వార్డు పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హాలియాలో ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య 2వ వార్డు పరిధిలోని ఇబ్రహీంపేటలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిట్యాలలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు 6వ వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
10, 7వ వార్డులో డబ్బులు పంచుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను భారీ భద్రత నడుమ ఆయా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాలకు తరలించారు. స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. ఈ నెల 25న లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడిస్తారు.logo
>>>>>>