సోమవారం 06 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 22, 2020 , 04:29:16

నేడే పుర పోలింగ్

నేడే  పుర పోలింగ్


నల్లగొండ, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నేడు నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, నందికొండ, హాలియా, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తిచేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో 454 పోలింగ్ బూత్ ఉండగా ప్రతి బూత్ ఒక పోలింగ్ అధికారితోపాటు సహాయ పోలింగ్ అధికారి, అదనపు పోలింగ్ అధికారి, రిజర్వు  పోలింగ్ అధికారి, ఇతర సిబ్బంది ఒకరు... మొత్తం ప్రతి పోలింగ్ స్టేషన్ 5గురు చొప్పున విధులు నిర్వహించనున్నారు. 454 బూత్ 2677 మంది సిబ్బంది ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు.
   

162 వార్డులు... 714 మంది అభ్యర్థులు

జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో 162 వార్డులుండగా 714మంది అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి తలపడుతున్నారు. నల్లగొండలో 48 వార్డులుండగా 225 మంది అభ్యర్థులు బరిలో ఉండగా హాలియాలో 12 వార్డులకు 60మంది, దేవరకొండలో 20 వార్డులకు 83మంది, మిర్యాలగూడలో 48 వార్డులకు 178 మంది, చిట్యాలలో 12 వార్డులకు 47మంది, నందికొండలో 12 వార్డులకు 77 మంది, చండూరులో 10 వార్డులకు 44మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఆయా మున్సిపాలిటీల్లో 2,82,266 మంది ఓటర్లుండగా 2677 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
   

పటిష్టంగా పోలీస్ బందోబస్తు...

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో పటిష్టంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో 2348 మంది పోలీసులను ఆ శాఖ రంగంలోకి దించింది. ప్రతి మున్సిపాలిటీలో పోలీసులు విధులు నిర్వర్తించడంతో ఎన్నికల యంత్రాంగం సహకారంతో 54 వెబ్ కెమెరాలతో సూక్ష్మ పరిశీలకులతో వెబ్ నిర్వహించనున్నారు. జిల్లాలో గుర్తించిన 82 సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్ రోజున ప్రత్యేక చెక్ ఏర్పాటు చేసి, అన్ని మున్సిపాలిటీల్లో పికెట్ పెట్రోలింగ్ చేయనున్నారు. ఎలాంటి ఘటన జరుగకుండా జిల్లాలో లైసెన్స్ పొందిన 161 ఆయుధాలను స్వాధీనం చేసుకొని 107 బైండోవర్ కేసులు నమోదు చేసి 444 మందిని బైండోవర్ చేసి 34 మందిపై నాన్ కేసులు పెట్టారు. ఇక 48 గంటల ముందే మద్యం దుకాణాలు బంద్ చేయడంతోపాటు మద్యం, డబ్బుల పంపిణీపై నిఘా పెట్టారు.
  

25న కౌంటింగ్...

జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 మున్సిపాలిటీల్లో నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా పోలింగ్ అనంతరం పోలింగ్ బాక్సులను ఆయా బూత్ నుంచి సూచించిన రూట్ల వారీగా జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్ భద్ర పరచనున్నారు. నేడు పోలింగ్ ముగిసిన అనంతరం ఏ కారణం చేతైనా రీపోలింగ్ జరగాల్సిన పరిస్థితి వస్తే ఈనెల 24న నిర్వహించి 25న ఫలితాలు లెక్కించనున్నారు. అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి మూడు రౌండ్ల లో కౌంటింగ్ చేపట్టి మధ్యాహ్నం ఫలితాలు తేల్చనున్నారు.logo