గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 19, 2020 , 00:33:07

అభివృద్ధే అస్త్రం..

అభివృద్ధే అస్త్రం..


నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులే అస్ర్తాలుగా మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచారం చేస్తోంది. జిల్లా కేంద్రం నల్లగొండతోపాటు మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చిట్యాల, చండూర్‌ మున్సిపాలిటీల పాలకవర్గాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ 7 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 162వార్డులు ఉండగా.. ఇప్పటికే ఏకగ్రీవమైన చిట్యాల 3వ వార్డు మినహా మిగిలిన 161వార్డుల్లో ప్రచారం హోరెత్తుతోంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీతోపాటు సీపీఐ, సీపీఎం, టీడీపీ, ఎంఐఎం సహా భారీగా పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అన్ని మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లోనూ ఆటోలు, కార్యకర్తల ర్యాలీలు కనిపిస్తున్నాయి. కరపత్రాలతో అభ్యర్థులు, వారి వెంట ఆయా పార్టీల కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి.. తమను గెలిపించాలని కోరుతున్నారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తున్న టీఆర్‌ఎస్‌...

ప్రచారంలో అందరికంటే ముందు నుంచీ ఉత్సాహంగా పాల్గొంటున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు..  ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలనే ప్రజలకు వివరిస్తున్నారు. 2014జూన్‌ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలను చెప్తూ.. ఓట్లు అడుగుతున్నారు. అభ్యర్థుల పక్షాన ప్రచారంలో పాల్గొంటున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సైతం ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, ఆసరా పించన్లు, మిషన్‌ భగీరథ, హాస్టల్‌ విద్యార్థులకు సన్న బియ్యం, కేసీఆర్‌ కిట్‌, రైతు బంధు, రైతు బీమా, బతుకమ్మ చీరల వంటి అనేక కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. మైకులతోపాటు కరపత్రాల్లోనూ ప్రభుత్వ పనులనే ప్రధానంగా పేర్కొంటున్నారు. పట్టణాల అభివృద్ధి కోసం వెచ్చించిన నిధులతోపాటు.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ఎన్నో పనులు జరిగే అవకాశం ఉందని వివరిస్తూ ప్రచారం చేపడుతున్నారు.logo
>>>>>>