మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Jan 19, 2020 , 00:32:40

రాజగోపాల్‌రెడ్డికి మతిభ్రమించింది

రాజగోపాల్‌రెడ్డికి మతిభ్రమించిందిచిట్యాల : “ఉదయమో మాట, సాయంత్రమో మాట మాట్లాడే ఆ వ్యక్తి ఇప్పుడు చిల్లరగాళ్లను వెంట పెట్టుకొని మతిభ్రమించి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నడు.. కాంట్రాక్టుల కోసం వైఎస్‌ఆర్‌ పంచ చేరిన ఆ వ్యక్తే ఓ సారి బీజేపీ అంటడు.. ఉదయం సీఎం కేసీఆర్‌ను కలిసి వచ్చి సాయంత్రం టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తాడు..’ అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధ్వజమెత్తారు. ఒక ఎమ్మెల్యేను ఉద్దేశించి ‘వాడు వీడు అనడం’ ఆయన దురహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఆ కుటుంబంపై గౌరవంతోనే మౌనంగా ఉంటున్నానని.. పదే పదే విమర్శిస్తే మాత్రం ఊరుకోబోనని హెచ్చరించారు. తన ప్రాంతం, ప్రజల కోసమే తాను పార్టీ మారనని చిరుమర్తి స్పష్టం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం చిట్యాలలో జరిగిన సభలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ‘ఆయన రాజకీయాల్లోకి రాకముందే నేను ఎంపీటీసీగా గెలిచాను. ఆ కుటుంబంపై ఆధారపడి నేను గెలువలేదు.. నా మంచితనం, ప్రజలతో ఏర్పరుచుకున్న సత్సంబంధాలే తనని గెలిపించాయి.. ‘ఆ వ్యక్తి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నా నేను ఎప్పుడూ తప్పు చేయను, నిజాయితీగా పనిచేస్తా’ అని చెప్పారు.

దళిత ఎమ్మెల్యేనని నన్ను పదే తిడితే తగిన బుద్ధి చెబుతానని ఈ సందర్భంగా హెచ్చరించారు. అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడం, పూటకో మాట మాట్లడుతుండడం వల్లనే తాను ఈ ప్రాంత అభివృద్ధి, ఉదయసముద్రం పూర్తి చేయడం కోసం టీఆర్‌ఎస్‌లో చేరానని చిరుమర్తి వివరించారు. ‘అతను రాజకీయాల్లోకి రాకపోతే అతడి అన్న రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగేవాడని, అతడి వల్లే సోదరుడి రాజకీయ భవిష్యత్‌ దెబ్బతిన్నది’ అని పేర్కొన్నారు. ఏదేమైనా చిట్యాల మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తామని, దమ్ముంటే అడ్డుకో అంటూ సవాల్‌ చేస్తూ.. తన ప్రాంత అభివృద్ధికి అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళ్లు పట్టుకోనైనా నిధులు తెస్తానని అన్నారు. ఈ సభలో నాయకులు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, జడల ఆదిమల్లయ్య, కర్నాటి ఉప్పలవెంకట్‌రెడ్డి, గుండెబోయిన సైదులు, 5వ వార్డు అభ్యర్థి గుండెబోయిన శ్రీలక్ష్మి, వేలుపల్లి మధుకుమార్‌ తదితరులున్నారు.


logo
>>>>>>